అనుభూతికి లోనుకాని విషయానికి కళారూపం ఇవ్వడం సాధ్యం కాదు. మనసుపై గాఢమైన ముద్ర వేసే సంఘటనలనే కాగితంపై పెట్టగలరు. గుండె లోలోపల తండ్లాడే మానవీయ సంవేదనలే అక్షరాల బాట వేసుకుంటాయి. విషయాన్ని పాత్రల భాషలో, సహజ పరిసరాల చిత్రణతో చెబితే రచన జీవం పోసుకుంటుంది. అందుకు కవి, కళాకారుడు రచయిత .. ఎవరైనా వస్తువులో మమేకమవ్వాలి. పాత్రల్లో ఒకరు కావాలి.వాటి మధ్యన నవ్వాలి, ఏడ్వాలి. ఈ గుణాలన్నీ రచయిత పర్కపెల్లి యాదగిరిలో కనిపిస్తాయి. నేడు కథలన్నీ మధ్య తరగతి జీవితాల్లోకి తెచ్చిపెట్టుకున్న కష్టాలను, మారుతున్న సమాజంలోని వంకర టింకర పోకడలను వల్లె వేస్తుంటే యాదగిరి మాత్రం సామాన్యుల, గ్రామీణుల జీవన రోదనలను మన ముందు పోసి ఈ గోడు వినండి అంటున్నారు. సకల వస్తువుల సృష్టికి మూలమైన శ్రమజీవులు పరిస్థితులను ఎదురీదలేక దిగాలు పడుతున్న వైనం కనమంటున్నారు. పర్కపెల్లి యాదగిరి కవి, కథకుడు. శికారి తర్వాత ఈ మధ్య ‘పొలిమేర దాటే వేళ’ అనే కథా సంపుటిని వేశారు. ఇందులో ఉన్న 12 కథలు వివిధ పోటీలో బహుమతి పొందినవే. సగానికి పైగా ప్రథమ బహుమతిని పొందాయి. అయితే ఇవేవి పోటీ కోసం నాటకీయతను పెంచి, పాఠకులను ఆకట్టుకునేందుకు వేషం కట్టినవి కావు. తన సహజ ధోరణిలో ఆయన రాస్తూ పోగా ఎంపికదారులు మెచ్చి అందించిన పురస్కారాలివి.
తెలంగాణ యాసలో కథ రాశామని అనుకొనే తెలంగాణ కథకులు ఉన్నారు. ఇదే కదా తెలంగాణ మాట అనుకోని తోచింది రాసిన బయటి రచయితలూ ఉన్నారు. అసలుసిసలు తెలంగాణ నుడికారం ఎలా ఉంటుందో యాదగిరి కథలు చదివితే తెలుస్తుంది. పాత్రల నోటి నుండి రాలిపడిన ఎన్నో పదాలు ఇంకా బతికే ఉన్నాయా అని ఆశ్చర్యం వేస్తుంది. కథల్లో వీటి వాడకం యాదగిరి కథలకు సొంత ముద్రను తెచ్చి పెట్టింది. ఉంకొక్క మల్కా, పరాకత్గా, పిత్కంత, నివద్ధి, సైసు, నిత్తె, ఓడ్త్ , ఒల్రకు లాంటి ఎన్నో అచ్చ తెలంగాణ పదాలు ఈ కథల నిండా కనబడతాయి. అందరికి అర్థం కాక పోతే ఎట్లా అని నికార్సయిన జనం మాటలను వదిలేస్తే అది భాషకు ద్రోహమే అవుతుంది. కథల్లోకి వెళితే – ‘గూడు’ కథలో ఎండాకాలంలో ఊరపిచ్చుకలను నీళ్ల వసతి కల్పించాలని తండ్లాడే ముసలమ్మ ప్రయత్నం మానవత్వాన్ని ఎత్తి చూపుతుంది. పక్షుల కోసం ఆమె చేసిన ఏర్పాట్లకు నీళ్లు వృధా అని, ఇల్లంతా చెత్త పడుతుందని పక్కింటివాళ్లు, ఇంటి యజమాని అడ్డు పడుతుంటారు. ఇట్లయితే ఇల్లు ఖాళీ చేయండి అంటే పిట్టల గుడ్లు పెట్టినయ్, అవి పిల్లలు అయ్యేదాకా ఖాళీ చేసేదే లేదని ముసలమ్మ మొండికేస్తుంది. ఆవిడ తన మాటని ఎలా నెగ్గించుకుందో ముగింపులో తెలుస్తుంది.
దేశంలో ఇల్లు, వాకిలి లేని కుటుంబాల దుర్భర జీవితాలకు ప్రతీక ‘పిట్టలు’ కథ. కాలే కడుపుకు తిండి కోసం మనుషులు కాలే శవాల దగ్గర కాపు కాయడం, శవం నోట్లో పెట్టే పిసరు బంగారాన్ని కట్టె కాలక ముందే దొరికించుకోవడం బతుకు నాటకంలో కడు విషాద అంకం. కథ ఆరంభానికి, ముగింపుకు మంచి లంకె ఉంది. పోరడు కథ తాత, మనవళ్ల ఆకలి పోరాట వ్యధ. చేసిన పనికి చిన్న దొర దగ్గర కూలీ సొమ్ములు అడక్కోవడానికి బయలుదేరిన తొవ్వ ముచ్చటలో వారి జీవన పరిస్థితులను రచయిత వివరించాడు. మనవడు నిస్పృహతో అన్నమాటకు ‘కోపం అలవాటు చేసుకుంటే బతకలేం ఈ భూమ్మీద’ అంటాడు. ఆ మాటతో మనవడి కోపం ఆగిందా అనేది కథ చివర్లో తెలుస్తుంది. ప్రయివేటు హాస్పిటళ్ళ కనికరం లేని దోపిడీకి చిన్నాభిన్నమై కథ రేణుక. కథలో రేణుక కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఇందులోని మిగతా కథలు కూడా పేద జీవితాలను పెనవేసుకున్న బాధల గాధలే. తెలంగాణ గ్రామీణ జీవితాల వాస్తవ రూపం ఈ కథల్లో దొరుకుతుంది. కథాకథనం, జీవన చిత్రణ, పరిసరాల వర్ణనపై రచయిత తీసుకున్న శ్రద్దతో పాటు ఆయనకు భాష, సామెతలపై ఉన్న సాధికారిత కథలకు ఎనగర్రగా నిలిచాయి. ఎంచుకున్న జీవితాలకు అతికినట్లుగా కథలు అల్లిన పర్కపెల్లి యాదగిరికి అభినందనలు.
బద్రి నర్సన్ 9440128169
బతుకు చిత్రణలో భేషైన కథలు
- Advertisement -
- Advertisement -


