Sunday, July 26, 2026
E-PAPER
Homeదర్వాజసనాతనవాదంలోని అన్యాయాలను విడమరచిన రచన

సనాతనవాదంలోని అన్యాయాలను విడమరచిన రచన

- Advertisement -

గత కొంతకాలంగా చర్చలో ఉన్న విషయం ఇది. అనేకమంది, అనేక రకాలుగా సనాతన ధర్మాన్ని గూర్చి చెబుతూ ఉద్వేగపడుతున్నారు. వాస్తవంగా ఇలాంటి అంశాలు పూర్వం ధర్మప్రచారకులు, పీఠాధిపతులు చర్చించేవారు. బోధించేవారు. కానీ ఇప్పుడు అధికార రాజకీయ నాయకులు తెగ మాట్లాడేస్తున్నారు. ఆఖరికి ఈ సనాతన ధర్మ ఆచరణను చట్టబద్ధం కూడా చేస్తారేమోననే అనుమానం రోజురోజుకు పెరుగుతోంది. సనాతన ధర్మమంటే ఎంతో పవిత్రమైనదని, దీనిని ఎవరూ నిరాకరించవలదన్నీన్నూ నొక్కి వక్కాణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సనాతన వాద చర్చలు ` శాస్త్రీయ దృక్పథం’ పేరుతో ఒక 56 పేజీల వ్యాసాన్ని పుస్తకంగా తెచ్చారు రాజ్యసభ మాజీ సభ్యులు పెనుమల్లి మధుగారు. దీన్ని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం వారు ప్రచురించారు.
పుస్తకం చాలా చిన్నది. కానీ అందులోని విషయం చాలాపెద్దది. సనాతన ధర్మాన్ని చెప్పుకుంటూ పోవటం చాలా తేలిక. కానీ ఆ ధర్మాన్నీ విప్పుకుంటూ పోవటం కష్టతరమైనదే. అనేకానేక ఉదాహరణలతో, ఊటంకింపులతో వాస్తవిక విషయాలతో చరిత్రలోకి వెళ్లి, వర్తమానంలోకి వచ్చి, భవిష్యత్తును ఎరుకపరచటం చాలా సమర్థవంతంగా చేశారు. తాత్విక విషయాలను కూడా చాలా సులువుగా విడమరచి చెప్పారు. ధర్మం పేర ఎంత అధర్మం దాగి ఉందో వివరించారు. సనాతన ధర్మం అంటే మార్పుకు అతీతమైనదని, శాశ్వతమైనదని భావిస్తారు మత విశ్వాసకులు. ఆధునిక విజ్ఞానం ప్రకారం మార్పే శాశ్వతమైనది. శాశ్వితమైనదంటూ ఏదీ ఉండదు.

సనాతన ధర్మం ప్రకారం నేర్చుకోవాల్సింది జ్ఞానం, ఆచరించాల్సింది ధర్మం. ధర్మం వేద ప్రమాణం. వేదం ప్రకారం భగవంతుడిని ఆరాధించడానికి రెండు విధానాలు చెబుతారు. గాయిత్రీ మంత్ర జపం, రెండోది యజ్ఞం చేయడం.గాయత్రి జపం అంటే, వర్ణవ్యవస్థ. కులవ్యవస్థ. యజ్ఞం అంటే నెయ్యిని మంటల్లో పోస్తూ మంతోచ్ఛరణ. ఇదీ మనుషులంతా ఆచరించగలది కాదు. బ్రాహ్మణులకే పరిమితమయింది. అందుకే సనాత ధర్మం అనేది వర్ణవ్యవస్థ మీద ఆధారపడి అసమానతలతో కూడుకున్నదిగా నిర్ధారణ చేశారు. వర్ణవ్యవస్థకు ఏం చెబుతారు వాళ్లు? బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు జన్మించారని. ఇక దళితులను గుర్తించనే లేదు. ఈ విధమైన విభజన బ్రహ్మయే సష్టించాడు. కావున తిరుగులేదు. కర్మ సిద్ధాంతం కూడా సనాతన ధర్మ ఫలమే. ఈ రోజు నువ్వు అనుభవించే కష్టాలకు, వివక్షతలకు, దుఃఖానికి కారణం నీ పూర్వ జన్మలో నువ్వు చేసుకున్న పాపమని వివరించారు. ఇది ఎంత దారుణం. ఈ విషయం తేలికయినది కాదు. మంత్రాలకు పరిమితమైనదీ కాదు. సమాజంలోని మెజారిటీ ప్రజలను ఈ భావాలతో అణచివేసి దోపిడి కొనసాగించడం వారి లక్ష్యం. ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి తాను న్యాయం కోసం, బాధలకు వ్యతిరేకంగా పోరాడటాన్ని నిషేధిస్తుంది. తన భవిత తన చేతిలో లేదని తేల్చి చెబుతుంది. ఈ ధర్మమే ప్రపంచంలో మన దేశాన్ని వెనకపడేట్లు చేసింది. ప్రజలను చీకట్లలో ముంచింది. వీటికి తోడు అనేక మూఢ విశ్వాసాలను పెంపొందించింది.

ముఖ్యంగా సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలను తరతరాలుగా వివక్షతకు గురిచేస్తూనే ఉన్నది. సంప్రదాయాల పేరుతో స్త్రీని బలహీనురాలుగా చిత్రించింది. సతీసహగమనం, బాల్యవివాహాలు, కట్టుబాట్లను ఏర్పరిచింది. పురుషుడు యజమాని, స్త్రీ బానిసగా సమాజ అంతరాలకూ ధర్మం అని పేరు పెట్టింది. అంతే కాదు, స్త్రీల వేదాధ్యయనాన్ని నిషేధించారు. విద్యనూ దూరం చేసి ఏడేండ్లకే పెండ్లి చేసి పంపారు. ఇప్పుడేమో స్త్రీలను సరుకును చేసి నిలబెట్టారు. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఆనాటి భక్తి ఉద్యమకారులు సంస్కరణలు చేపట్టారు. మనుషుల్ని విభజించిన సనాతన ధర్మంపై తిరుగుబాట్లు చేశారు. దేవుడు ఒక్కడే అని అన్నమాచార్యుడు, కబీర్‌దాస్, రవిదాస్ ఎంతో మంది చేసిన బోధనను సందర్భానుసారం గుర్తు చేస్తారు. ప్రపంచ ఆధ్యాత్మిక సదస్సులో హిందూ మత ప్రత్యేకతపై ప్రసంగించిన స్వామీ వివేకానంద కూడా సనాతన ధర్మంలోని మూఢ విశ్వాసాలను, స్త్రీ అణచివేతను అనాగరిక ధర్మమని తిరస్కరించిన ఘటనలను పొందుపరిచారు. భారతదేశంలో జ్యోతిబాపూలే, సావిత్రాబాయి పూలేలు ఆరంభించిన పునరుజ్జీవన వికాసాన్ని, పెరియార్ రామస్వామి, కందుకూరి వీరేశలింగం, అంబేద్కర్‌లు ఎంతో పోరాడి తెచ్చిన సాంస్కృతిక మార్పులను పుస్తకంలో ప్రస్తావనకు తీసుకువస్తారు.

ఈ దేశంలో ప్రాచీన కాలం నుండి భౌతికవాద, శాస్త్రీయ దక్పథం కలిగివున్న వారసత్వాన్ని గుర్తుచేస్తూ లోకాయుతులు, చార్వాకులు, బౌద్ధం, జైనం ఈ నేలన ఉందని, దాని కొనసాగింపులో విజ్ఞానం పెంపొందిందని చాలా సూక్ష్మంగా వివరించారు. కేవలం మతపరమైన భ్రమలను కల్పించి, నేడు రాజకీయ ఆధిపత్యానికి ప్రయత్నిస్తున్నారని, కొన్ని వందల, వేల యేండ్ల నుండి కలసిమెలసి ఉన్న ప్రజల మధ్య మత విధ్యంసాలు సృష్టిస్తున్నారన్న విషయాన్ని మధు చెబుతూ వర్తమానంలోకి తీసుకొస్తారు. అనేక విషయాలను అధ్యయనం చేయటానికి ఈ పుస్తకం ప్రేరణ కలిగిస్తుంది. ముఖ్యంగా నేటి యువత ఈ చర్చను చదవాలి. కళా, సంగీత, సాహిత్య రూపాలలో మన మెదళ్లపై ఎంతటి అశాస్త్రీయతలను ధర్మం పేరిట నింపుతున్నారో వివరిస్తుంది ఈ పుస్తకం. అనేక వాదాలతో, తిరోగమన నినాదాలు ముందుకు వస్తున్న తరుణంలో వాళ్లు చెబుతున్న సనాతన ధర్మంలోని అధర్మం ఎంతో తెలుసుకోవాలి.

కె. ఆనందాచారి,
9948787660

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -