Sunday, July 26, 2026
E-PAPER
Homeదర్వాజ19వ పురాణం

19వ పురాణం

- Advertisement -

తెగిన తలను అతకడం పురాణం
అతుక్కోకుండా నరికేసి వెదజల్లడం వర్తమానం
బొటనవేలు కోరడం పురాణం
బొందిలో ప్రాణాన్ని బల్లెంతో
పొడవడం వర్తమానం
శబరి ఎంగిలి పళ్లు తిని
పరవశించడం పురాణం
ఎంగిలి చేసినవాడిని
తునాతునకలు చేయడం వర్తమానం
లక్క ఇంట్లో పాండవులను
బంధించడం పురాణం
దేశమే లక్క ఇల్లవుతుంటే
చలికాచుకోవడం వర్తమానం
నల్లని వాళ్లు రాక్షసులనేది పురాణం
అన్ని రంగులనీ ఒకేలా రంగరించడం వర్తమానం
దుష్టసంహారం పురాణం
శిష్ట సంరక్షణలో నెత్తురు పారించడం వర్తమానం
దేహాన్ని ధ్యానించడం పురాణం
అహంతో అన్నిటినీ ధ్వంసించడం వర్తమానం
వెరసి, ఇదొక వర్తమాన పురాణం-
అష్టాదశకు ఓ అదనపు చేర్పు.
దేశరాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -