Saturday, February 21, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలునేటి నుంచి తెలంగాణ సాహితి దశాబ్ది సాహిత్యోత్సవాలు

నేటి నుంచి తెలంగాణ సాహితి దశాబ్ది సాహిత్యోత్సవాలు

- Advertisement -

సిద్ధమైన ఏవీ కళాశాలలోని తంగిరాల చక్రవర్తి ప్రాంగణం
రెండు రోజుల పాటు నిర్వహణ
ముఖ్య అతిథిగా నందిని సిద్ధారెడ్డి
గౌరవ అతిథులు గోరటి వెంకన్న, డాక్టర్‌ రియాజ్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ సాహితి దశాబ్ది సాహిత్యోత్సవాలు హైదరాబాద్‌లోని ఏవీ కళాశాలలోని తంగిరాల చక్రవర్తి ప్రాంగణంలో శనివారం ప్రారంభం కానున్నాయి. తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్ట్‌ రెండు రోజుల పాటు జరుగనున్నది. శనివారం ఉదయం 10 గంటలకు జరిగే ప్రారంభ సభలో తెలంగాణ సాహితి దశాబ్ది ప్రత్యేక సంచిక ఆవిష్కరణను ముఖ్య అతిథి నందిని సిద్ధారెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, గ్రంథాలయ సంస్థల చైర్మెన్‌ డాక్టర్‌ రియాజ్‌, విశిష్ట అతిథులుగా ఏనుగు నర్సింహారెడ్డి, నామోజు బాలాచారి, సూర్య ధనుంజయ, ప్రత్యేక అతిథులుగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు శివలింగప్ప, ఆరిఫ్‌ రాజా తదితరులు హాజరుకానున్నారు. ఈ లిటరరీ ఫెస్ట్‌ సందర్భంగా ఫొటో ఎగ్జిబిషన్‌ నిర్వహించనున్నారు. పుస్తక ప్రదర్శన చేపట్టనున్నారు. రెండు రోజుల పాటు జరిగే సాహిత్యోత్సవాల్లో కవిత్వం, కథ, నవల, విమర్శ, సినిమా, పాట, మహిళా సాహిత్యాంశాలపై చర్చలు, విశ్లేషణలు నిర్వహించనున్నారు. బాలసాహిత్య మేళ ఏర్పాటు చేయనున్నారు.

ఈ ఫెస్ట్‌లో కవిసమ్మేళనాలు, నాటక ప్రదర్శనలు చేపట్టనున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రాల్లోని, హైదరాబాద్‌లోని డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులకు మాదక ద్రవ్యాల ప్రమాదం అనే అంశంపై కవితా, వ్యాస రచన పోటీలు నిర్వహించిన విషయం విదితమే. అందులో గెలుపొందిన వారికి ప్రత్యేక జ్ఞాపికలు అందజేయనున్నారు. ఉత్తమ కవితలు, వ్యాసాలు ఎంపికచేసి బహుమతులను అందించనున్నారు. 53 మంది రచయితులు రాసిన వారి స్వగతాలతో ‘అంతరంగ ఆవిష్కరణ’ పుస్తకాన్ని, ‘గోలకొండ కలాలు’ పేరుతో కవితా సంకలనాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ ఫెస్ట్‌కు రాష్ట్రంలోని ప్రముఖ రచయితలు, కవులు, సాహిత్యరంగ ప్రముఖులు రానున్నారు. సినిమా రంగం ఏ దిశగా వెళ్తుందనే అంశంపై విస్తృతంగా చర్చించనున్నారు. 21న సాయంత్రం ఏడు గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 22న సాయంత్రం కవి సమ్మేళనం చేపట్టనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -