లారీని ఢీకొన్న కరీంనగర్ డిపో బస్సు
ముగ్గురికి తీవ్ర గాయాలు
సమ్మెను అణచివేసేందుకు
ప్రయివేట్ డ్రైవర్లతో రోడ్లపైకి బస్సులు
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె సెగలు రేపుతుంటే, అధికారులు చేస్తున్న ‘ప్రయివేటు’ ప్రయోగాలు ప్రయాణికుల ప్రాణం మీదకొస్తున్నాయి. అనుభవం లేని వ్యక్తుల చేతికి స్టీరింగ్ అప్పగించి, బస్సులు నడపాలన్న పంతం నిండు ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్గూనూర్కు వెళ్లే ప్రధాన రహదారిపై అనుభవం లేని ప్రయివేటు డ్రైవర్ అతివేగం కారణంగా అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు లారీని ఢీకొ0ది. ఈ ప్రమాదంలో బస్సులోని ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. 40మంది ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
ఆర్టీసీ కార్మికులు అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునివ్వడంతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. అయితే, ఎలాగైనా బస్సులు నడిపి తీరాలన్న పట్టుదలతో అధికారులు హడావిడిగా ప్రయివేటు డ్రైవర్లను రంగంలోకి దించారు. కరీంనగర్-2 డిపోకు చెందిన బస్సులో ప్రయాణికులను ఎక్కించి వరంగల్ పంపే క్రమంలో నగర శివారులోని అల్గూనూర్ సమీపంలో ప్రమాదానికి గురైంది. అద్దె డ్రైవర్‌కు వాహనంపై నియంత్రణ లేకపోవడంతో ఎదురుగా వస్తున్న లారీని బస్సు బలంగా ఢీకొట్టింది.
బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ముగ్గురు ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. బస్సులోని సుమారు 40 మందికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో గాయపడిన వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అదేవిధంగా, కరీంనగర్ నగర శివారులోని కోతిరాంపూర్ బైపాస్ వద్ద కూడా ప్రయివేటు అద్దె డ్రైవర్ నిర్లక్ష్యం బయటపడింది. శిక్షణ లేని డ్రైవర్లు బస్సులను అదుపు చేయలేక డివైడర్లను, ఇతర వాహనాలను ఢీకొడుతుండటంతో ప్రయాణికులు బస్సు ఎక్కాలంటేనే వణికిపోతున్నారు. కొన్ని చోట్ల కండక్టర్లు లేకుండానే డ్రైవర్లతో పోలీసు బందోబస్తు మధ్య బస్సులు నడుపుతున్నారు.
అదుపుతప్పిన ‘ఆర్టీసీ ప్రయివేట్ డ్రైవింగ్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



