Sunday, February 22, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిగోబెల్స్‌ స్టోరీ!

గోబెల్స్‌ స్టోరీ!

- Advertisement -

హిట్లర్‌ కాలంలో జర్మనీలో నాజీ పాలన ప్రచారం కోసం గోబెల్స్‌ సినిమాను అత్యంత ప్రభావవంతంగా ఉపయోగించాడు. హిట్లర్‌ను దేవుడిగా కీర్తిస్తూ 1935లో వచ్చిన ‘ట్రయంఫ్‌ ఆఫ్‌ ది విల్‌’ అత్యంత ముఖ్యమైన నాజీ ప్రచార చిత్రాలలో ఒకటి. 1938లో ‘ఒలింపియా’ చిత్రం ఆర్యన్‌ జాతి అథ్లెటిక్‌ పరాక్రమాన్ని ప్రపంచానికి చాటితే, మిలియన్ల మంది యూదుల మారణహోమాన్ని శాస్త్రీయంగా సమర్థించడానికి ‘ది ఎటర్నల్‌ జ్యూ’ అనే డాక్యుమెంటరీ రూపొందించబడింది. ఐరోపా నుండి తుడిచిపెట్టుకుపోవాలని హిట్లర్‌ చేసిన ఉద్రేకపూరిత ప్రసంగం తర్వాత చప్పట్లతో ఈ డాక్యు మెంటరీ ముగుస్తుంది. అదేమాదిరిగా భారతదేశంలోనూ గోబెల్స్‌ తరహా సినిమాలు పునరావృతం అవుతున్నాయి. ఉన్నత కులాల హిందువులను కీర్తించే సినిమాలు, విదేశీ ముస్లిం పాలకులచే దేశం నాశనం చేయబడిందని చూపే సినిమాలు, ముస్లింలు ప్రేమ నటిస్తూ… హిందూ అమ్మాయిలను కిడ్నాప్‌ చేసి మతమార్పిడి చేస్తున్నారని నిరూపించడానికి ప్రయత్నించే ‘ది కేరళ స్టోరీ’ వంటి సినిమాలు దేశంలో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయి.

1960 నాటి ‘మా భూమి’ వంటి సినిమాలు సామాజిక మార్పునకు ఎంతగానో దోహద పడ్డాయి. సినిమా అనేది ప్రజలను ఏకం చేయడానికి వారధిగా వుండాలి. కానీ, బిజెపి అధికారం లోకి వచ్చిన తర్వాత సినిమాను ప్రజల మధ్య విభజనలు సృష్టించే సాధనంగా మార్చారు. కేరళ ప్రజల్లోని సామరస్య తను నాశనం చేసే లక్ష్యంతో, ఉద్దేశపూర్వకంగా విడుదల చేసిన ‘కేరళ స్టోరీ-2’ చిత్రం రాష్ట్రంపై జరుగుతున్న మరో సాంస్కృతిక యుద్ధం. 2023లో వచ్చిన ‘కేరళ స్టోరీ’ చిత్రం ఆసాంతం…మతోన్మాద మూకలు కేరళ గురించి వ్యాప్తిచేస్తున్న కొండంత అబద్ధాల ఆధారంగా రూపొందిన కట్టు కథ. కేరళకు చెందిన ముప్తై రెండు వేల మంది మహిళలు ఇస్లాంలో చేరారనే నినాదంతో ఈ చిత్రం విడుదలైంది. దేశంలోని లౌకిక సమాజం దీనికి వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో.. ముప్తై రెండు వేల మంది కేవలం ముగ్గురిగా మారారు. ఈ అబద్ధాల పునాదిపై నిర్మించిన కట్టుకథకు గాను సుదీప్తో సేన్‌ 2025లో ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. తాజాగా ‘గోస్‌ బియాండ్‌’ పేరుతో విడుదలైన ‘కేరళ స్టోరీ 2’ టీజర్‌… మొదటి భాగం కంటే ఎక్కువ ప్రమాదకరంగా, కేరళతో పాటు దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలను మరింత రెచ్చగొట్టేదిగా వుంది.

లౌకిక విలువలను, సోదరభావాన్ని నిలబెట్టిన కేరళను చూసి భయపడుతోన్న ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘ్‌ పరివార్‌ శక్తులు… కేరళను ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా చిత్రీకరించాలనే మతతత్వ ఎజెండాతో ఈ తరహా సినిమాలను ప్రజల్లోకి వదులుతున్నారు. ‘మతం పేరుతో విద్వేషాన్ని పెంచుకుంటూ పోతే, అది మన ఇంటినే దహించివేస్తుంది’ అంటారు ప్రముఖ రచయిత ఖుష్వంత్‌ సింగ్‌. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారతదేశం. ముఖ్యంగా కేరళ రాష్ట్రం… అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి వుండే సంస్కృతికి పెట్టింది పేరు. ఆ ప్రజలను నేరస్తులుగా, ఉగ్రవాదులుగా చిత్రీకరించే ఇలాంటి సినిమాను సెన్సార్‌ బోర్డు ఎలా అనుమతిస్తుంది? ‘ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘బీఫ్‌’ అనే పదాన్ని, ‘జానకి’ అనే పేరును కూడా ఉపయోగించకుండా సినిమాలను నిరోధించారు. ఆ భాగాలను కత్తిరించిన తర్వాతనే ఆ చిత్రాలను ప్రదర్శనకు అనుమతించారు.

వేర్పాటువాదాన్ని ప్రేరేపించే విషపూరిత సృజన ‘కేరళ స్టోరీ-2’కు క్లీన్‌ యుఎ సర్టిఫికెట్‌ ఇవ్వడం శోచనీయం. ‘సమాజంలో విభజన, విద్వేషాన్ని వ్యాప్తిచేసే లక్ష్యంతో నిర్మించిన విషపూరిత చిత్రం ఎలా అనుమతించబడుతుందో ఆశ్చర్యంగా ఉంది’ అని కేరళ ముఖ్యమంత్రి సైతం ఘాటుగా స్పందించారు. కేరళ నిజమైన చరిత్ర వర్గపోరాటం, త్యాగాలు, సామాజిక సంస్కరణలతో కూడుకున్నది. సామాజిక సూచికలలో కేరళ సాధించిన పురోగతి, నిరుపేదలను విముక్తి చేసే ప్రయత్నం, కొండచరియలు విరిగిపడే భూమిలో అద్భుతంగా మనుగడ సాగించడం నిజమైన కేరళ కథ. వాస్తవాలను మసకబార్చే కట్టుకథలతో సినిమాలు తీస్తూ, విద్వేషాన్ని ప్రచారం చేయడం దేశ భవిష్యత్‌కు మంచిది కాదు. విచక్షణను వినియోగించవలసిన సెన్సార్‌ బోర్డు పెద్దలు పరివార్‌ కళ్లజోళ్లు తొలగించి వాస్తవాలను పరికించాలి. కేంద్ర పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గడం తగదు. ప్రజలు ఇటువంటి విద్వేష రాజకీయ చిత్రాల పట్ల అప్రమత్తంగా వుండాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -