నేను అడవి బిడ్డను.. నా మనుగడ ఈ పచ్చని ఒడిలోనే,
నా ఊపిరిలో నిరంతరం పచ్చని అడవి వాసన!
నా నరాల్లో నదులు ప్రవహిస్తాయి, నా గుండెల్లో సెలయేర్ల సవ్వడి
కానీ నేడు.. నా గొంతులో ఓ ఆర్తనాదం, అడవిలో ఓ విషాద గీతం
అదిగో వినండి.. ఆ కర్కశ గర్జనలు
ఇనుప పాదాల కింద నా కన్నతల్లి గుండెను మెలిపెడుతూ..,
నా ప్రశాంత స్వప్నాలను చిదిమేస్తూ .
ఈ అడవి తల్లి గర్భాన్ని రాబందులు పీక్కు తింటున్నాయి
చెట్లతో నవ్వుతూ, సెలయేళ్ళతో తుళ్ళుతూ చిందులేసిన ఈ నేల
నేడు విషపు కత్తుల వేటుకు విలవిలలాడుతున్నది
నా పాదాల కింద భూమి కంపిస్తున్నది,
నా చెవుల్లో గడ్డిపోచలా రోదన మార్మోగుతున్నది !
నేను అడుగుతున్నాను.. నా హక్కు కోసం నిలబడితే నేను శత్రువునా?
నా కన్నతల్లిని కాపాడుకోవాలని చూస్తే నేను నేరస్థనా ?
నా సోదరులు, పక్షులు, వనచరాలు..
గూడు చెదిరి దిక్కులేక వలసబోతుంటే ,
నా గుండెలో భయం, కోపం, నిస్సహాయత కౌగిలించుకుంటున్నాయి.
ఇప్పటికే ఈ నేల బిడ్డలు అనేకులు మట్టిలో కలిసిపోయారు..
నాగరికత పేరుతో మీరు సాగిస్తున్న విధ్వంసానికి అంతం లేదా?
అంతా నాదే అని అహంకరించే ఓ మానవా..
ఈ లోకంలో నీవైనా శాశ్వతమా? అభివద్ధి అంటే ప్రాణాలు తీయడమేనా?
చేతనైతే ఒక మొక్కకు ప్రాణం పోయి.. అంతే కానీ ,
నీ స్వార్ధపు ఆకలి కోసం మా ఊపిరి బలి తీసుకోకు
ఈ పచ్చని అడవిని రేపటి తరం కోసం పదిల పరుచు
ఈ అడవి బిడ్డ వేదన నీకు వినిపిస్తున్నదా?
నేను వేస్తున్న ఈ కేక నా కోసం మాత్రమే కాదు ..
రేపు నువ్వు పీల్చే శ్వాస కోసం కూడా ..
వి. శాంతి ప్రబోధ
రేపటి శ్వాస కోసం
- Advertisement -
- Advertisement -



