దేశ సార్వభౌమాధికారాన్ని కోల్పోవొద్దు
స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు : రెడ్‌బుక్ డే సందర్భంగా జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచ దేశాలపై అమెరికన్ సామ్రాజ్యవాదం బరితెగించి వ్యవహరిస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రెడ్‌బుక్ డే సందర్భంగా ‘బరితెగించిన అమెరికా సామ్రాజ్యవాదం’ అనే పుస్తకంపై సామూహిక అధ్యయనం, చర్చ నిర్వహించారు. పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి జ్యోతి, కార్యదర్శి వర్గ సభ్యులు టి సాగర్, రాష్ట్ర కమిటీ సభ్యులు, సెంటర్ శాఖల సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ శ్రామిక వర్గాల విముక్తికి దారిచూపిన వెలుగు దీపిక కమ్యూనిస్టు ప్రణాళిక అని వివరించారు.
అది అప్పటికీ, ఇప్పటికీ వర్గపోరాటాల దిక్చూచి అని చెప్పారు. నేటి ప్రపంచ పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. ట్రంప్ వాణిజ్య సుంకాలు, అనేక చోట్ల జరుగుతున్న యుద్ధాలు, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని చెప్పారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అసమాన సంపద సమాజాన్ని కలవరపెడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సరిగ్గా ఇలాంటి సమయంలో అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాలపై, ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాలపై దాడులకు తెగబడుతున్నదని వివరించారు. ఇరాన్ చుట్టూ అమెరికా సైనిక బలగాలు మోహరించి ఉన్నాయని తెలిపారు. ఏ క్షణమైనా ఆ దేశంపై దాడికి తెగబడే అవకాశం ఉందన్నారు. ఇటీవలే వెనిజులా అధ్యక్షుడు మదురో, ఆయన సతీమణిని అత్యంత దారుణంగా కిడ్నాప్ చేసి అమెరికా జైల్లో బంధించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమని చెప్పారు. పెట్టుబడిదారీ వ్యవస్థ అత్యున్నత వికృత రూపం ఎలా ఉంటుందో ట్రంప్ నాయకత్వాన అమెరికా చేస్తున్న దాడులు, ఆక్రమణలు, విధ్వంసాలు రుజువు చేస్తున్నాయన్నారు. ఇజ్రాయిల్‌ను ప్రోత్సహించి పాలస్తీనాపై కొన్నేండ్లుగా చేస్తున్న దాడులతో అక్కడ మానవ హననం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇరాక్‌పైనా దాడి చేసిందనీ, ఇప్పుడు ఇరాన్‌పై కాలు దువ్వుతున్నదని చెప్పారు. సుంకాల పేరుతో ప్రపంచ దేశాలపై బెదిరింపులకు పాల్పడుతున్నదన్నారు. ఆయా దేశాలను కబళించేందుకు తప్పుడు ఆరోపణలు చేసి, లొంగదీసుకునేందుకు కుట్ర చేస్తున్నదని విమర్శించారు. వెనిజులాపై జరిగిన దాడి కూడా అలాంటిదేనన్నారు.
ఈ చర్యను ప్రపంచ దేశాలు ఖండించినా..దేశ ప్రధాని మోడీ మాత్రం మౌనంగా ఉన్నారని తెలిపారు. రెండువందల ఏండ్ల బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి స్వాత్రంత్య్రాన్ని సాధించుకున్న దేశం మనదని గుర్తు చేశారు. ఆ స్వతంత్ర పోరాట స్ఫూర్తి మోడీకి ఏ మాత్రం లేదని ఎద్దేవా చేశారు. పైగా దేశ సార్వభౌమాధికారాన్ని అవమానించే విధంగా అమెరికాతో అంటకాగుతున్నాడని తెలిపారు. నిత్యం దేశభక్తి గురించి మాట్లాడే బీజేపీ ప్రభుత్వ పెద్దలు అమెరికా బెదిరింపులకు లొంగిపోవటం దేశభక్తి ఎలా అవుతుందని నిలదీశారు. అపరిమిత సుంకాలు విధించినా, అడ్డగోలు ఆంక్షలు పెట్టినా, తలూపటం దేశ గౌరవానికి మంచిది కాదన్నారు.
‘కమ్యూనిస్టు మ్యానిఫెస్టో పరిచయం’ పుస్తకావిష్కరణ
రెడ్‌బుక్ డే సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ రచించిన కమ్యూనిస్టు మ్యానిఫెస్టో పరిచయాన్ని నవతెలంగాణ పబ్లిషింగ్ హౌజ్ ప్రచురించగా ఆ పుస్తకాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టి జ్యోతి, టి సాగర్, నవతెలంగాణ బుక్ హౌజ్ మేనేజర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.



