స్వయంసమృద్ధి గ్రామాలే ప్రభుత్వ లక్ష్యం.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు : పంచాయతీరాజ్ శాఖమంత్రి సీతక్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగు నీరందించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని ప్రజాభవన్‌లో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా పనుల పురోగతి, భవిష్యత్ లక్ష్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షాకాలంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు సహా ప్రతి ఇంటికి నిరంతరాయంగా రక్షిత మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ నీటి నాణ్యతపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వాతావరణ మార్పులు, నీటి కొరత వంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని జల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ‘పాత బావులను గుర్తించి పునరుద్ధరించాలి. బావుల చుట్టూ రక్షణ గోడలు నిర్మించి ప్రమాదాలను నివారించాలి. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంటకుంట, ప్రతి ఊరిలో ఊటకుంట ఉండేలా చర్యలు చేపట్టాలి’ అని అధికారులను ఆదేశించారు. గ్రామాల అభివృద్ధి అంటే కేవలం భవనాలు, రోడ్లు నిర్మించడం మాత్రమే కాదనీ, గ్రామాల్లో నివసించే ప్రతి వ్యక్తి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమేనని గుర్తు చేశారు. పంచాయతీరాజ్ శాఖల పరిధిలో 1.35 లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారనీ, ఏటా రూ.34 వేల కోట్లకు పైగా నిధులు ఖర్చవుతున్నాయని గుర్తుచేశారు.
ఇంత భారీ యంత్రాంగం, నిధులు ఉన్నప్పటికీ గ్రామాల రూపురేఖలు ఆశించిన స్థాయిలో మారకపోవడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ‘జిల్లా స్థాయిలో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు ఒకే టీమ్‌గా పనిచేయాలి. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలి. ప్రతి గ్రామానికి అవసరాలు, వనరులు, సమస్యలను గుర్తించి వాటి ఆధారంగా కార్యాచరణ అమలు చేయాలి..’ అని ఆదేశించారు. కొన్నిచోట్ల గ్రామసభలు నిర్వహించకుండా నిధులు ఖర్చు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయనీ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు నిధుల వినియోగంపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. మహిళా సంఘాల బలోపేతం, బ్యాంకు లింకేజీల పెంపు, మహిళలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సెర్ప్ అధికారులను ఆదేశించారు. మహిళల ఆర్థిక సాధికారత పెరిగితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలి
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని సీతక్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీ అటవీ ప్రాంతాల్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నిర్మిస్తున్న రహదారులకు కేంద్ర అటవీ శాఖ నుంచి అనుమతుల సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేసిన తర్వాత కూడా అనుమతుల పేరుతో అడ్డంకులు సృష్టించడం వల్ల ఆదివాసి గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందడం లేదన్నారు. అటవీ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, కేంద్రంతో సంప్రదింపులు జరిపేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో భూగర్భ జలాలను పెంపొందించే లక్ష్యంతో రూపొందించిన ‘జలసిరి’ అవగాహన పోస్టర్‌ను మంత్రి సీతక్క ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సమీక్షలో పంచాయతీ రాజ్ ప్రత్యేక కార్యదర్శి దానకిషోర్, కమిషనర్ దివ్యా దేవరాజన్, జిల్లా అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీఆర్‌డీఓలు, డీపీఓలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటికి నాణ్యమైన తాగునీరందించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



