ఇద్దరు రైస్ మిల్లర్ల అరెస్ట్
పెద్దపల్లి డీసీపీ రామ్‌రెడ్డి వెల్లడి
విచారణలో బయటపడిన భారీ కుంభకోణం
నవతెలంగాణ – సుల్తానాబాద్
ప్రభుత్వానికి చెందిన కోట్లాది రూపాయల ధాన్యాన్ని పక్కదారి పట్టించిన భారీ కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. సుల్తానాబాద్ పీఎస్‌లో మంగళవారం మీడియా సమావేశంలో పెద్దపల్లి జిల్లా డీసీపీ రామ్‌రెడ్డి ఈ కేసుకు సంబంధించిన సంచలన వివరాలను వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ రైస్ మిల్లుల ద్వారా కొన్నేండ్లుగా సుమారు రూ. 158 కోట్ల ప్రభుత్వ ధాన్యాన్ని (సీఎంఆర్) మాయం చేసిన కేసులో ఇద్దరు మిల్లర్లను అరెస్టు చేసినట్టు డీసీపీ ప్రకటించారు.
తాజా ఉదంతం.. రూ. 7 కోట్ల ధాన్యం పక్కదారి
2023-24 రబీ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం పెద్దపల్లి జిల్లా పూసల గ్రామంలోని సౌభాగ్యలక్ష్మి రైస్ మిల్లుకు 3,116 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అప్పగించింది. నిబంధనల ప్రకారం సదరు మిల్లు యజమానులు ప్రభుత్వానికి తిరిగి 2,119 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని డెలివరీ చేయాల్సి ఉంది. అయితే, మిల్లర్లు 515 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే అందించి, మిగిలిన బియ్యాన్ని పక్కదారి పట్టించారు. ఈ మాయం చేసిన బియ్యం విలువ సుమారు రూ. 7 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. పెద్దపల్లి పౌరసరఫరాల శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. మిల్లు యజమానులైన బండారి మారుతి, సొక్కం అంజయ్యను విచారించగా అసలు దందా వెలుగుచూసింది.
విచారణలో తేలిన రూ.158 కోట్ల భారీ స్కామ్
నిందితులను అదుపులోకి తీసుకుని లోతుగా విచారించగా, అక్రమాల చిట్టా బయటపడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ నిందితులకు 4 రైస్ మిల్లులు ఉన్నాయి. కొన్నేండ్లుగా వివిధ ఖరీఫ్, రబీ సీజన్లలో వీరు విడతల వారీగా రూ. 158 కోట్ల మేర భారీ స్కామ్‌కు పాల్పడినట్టు డీసీపీ తెలిపారు.• మహాశక్తి ఇండస్ట్రీస్ (జమ్మికుంట మండలం, కోరపల్లి): రూ. 62 కోట్ల ధాన్యం పక్కదారి.
• సాయి మహాలక్ష్మి రైస్ మిల్లు (సుల్తానాబాద్ మండలం, కాట్నపల్లి): రూ. 20 కోట్ల ధాన్యం గోల్‌మాల్.
• తాజాగా సౌభాగ్యలక్ష్మి రైస్ మిల్లు (పూసల): రూ. 7 కోట్ల ధాన్యం అక్రమ విక్రయం.
ప్రధాన నిందితుడిపై పాత నేరాల చరిత్ర
ఈ భారీ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన బండారి మారుతిపై తీవ్ర నేర చరిత్ర ఉన్నట్టు డీసీపీ రామ్‌రెడ్డి వెల్లడించారు. అతనిపై ఇదివరకే ఒక హత్యానేరంతోపాటు మరో ఏడు కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ ధాన్యాన్ని స్వాహా చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్టు డీసీపీ స్పష్టం చేశారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
రూ. 158 కోట్ల ప్రభుత్వ ధాన్యం మాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



