భూసేకరణకు క్షేత్రస్థాయిలో మైక్రో సర్వే
రాష్ట్రంలో రెండో భారీ ఎయిర్‌ఫీల్డ్
1,980 ఎకరాల్లో జాయింట్ ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదన
భూ సరిహద్దుల గుర్తింపు విషయంలో స్పష్టత
యుద్ధ విమానాల శిక్షణ కేంద్రంగా ఆదిలాబాద్
మెరుగుపడనున్న ఉపాధి అవకాశాలు
పారిశ్రామికంగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కసరత్తు
నవతెలంగాణ-ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఆదిలాబాద్ ప్రజల ఎయిర్ పోర్టు కల సాకారం కావడానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు, సూచనలతో జిల్లా అధికారులు భూసేకరణకు సంబంధించిన క్షేత్ర స్థాయి మైక్రో సర్వే చేపట్టారు. రక్షణ శాఖ, సివిల్ ఏవియేషన్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో డిఫెన్స్-సివిల్ జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ రాజర్షి షా, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్, బెంగళూరుకు చెందిన ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారులు, రాష్ట్ర సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ భరత్‌రెడ్డితో కలిసి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద అంతర్జాతీయ విమానా శ్రయం ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేయబోయేదని కేంద్రం ప్రకటించడంలో అంచనాలు భారీగానే నెలకొన్నాయి. శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్ కనెక్టివిటీ కేంద్రంగా ఆదిలాబాద్‌ను తీర్చిదిద్దేందుకు చర్యలు సాగుతున్నాయి. ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన, మైక్రో లెవెల్ సర్వే నిర్వహించి రన్‌వే విస్తరణ, భూసేకరణ, సాంకేతిక అంశాలపై సమగ్రంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
వేగంగా భూసేకరణ
ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే 700 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం జీఓ జారీ చేయగా, అదనంగా డిఫెన్స్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ కోసం 1,500 ఎకరాలు, రన్‌వే విస్తరణ కోసం మరో 80 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి వివాదాలూ తలెత్తకుండా జియో కోఆర్డినేటర్ల ఆధారంగా భూములను గుర్తించి పూర్తి పారదర్శకతతో ముందుకు సాగాలని అధికారులు నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో మైక్రో లెవెల్ సర్వే ద్వారా రన్‌వే విస్తరణ, సాంకేతిక అవసరాలు, భూసరిహద్దులపై స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. భూసేకరణ పూర్తయిన వెంటనే రక్షణ శాఖ, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించనున్నట్టు అధికారులు తెలిపారు.
మెరుగుపడనున్న రవాణా వ్యవస్థ
ప్రతిపాదిత జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్ ప్రయాణి కుల కోసం మాత్రమే కాకుండా దేశ రక్షణ అవసరాలకు కూడా ఉపయోగపడనుంది. ఇప్పటికే రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న 362 భూమితోపాటు కొత్తగా కేటాయించ నున్న భూముల్లో డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయనున్నారు. వాయుసేన శిక్షణ కార్యక్రమాలు, యుద్ధ విమానాల ట్రైనింగ్, అత్యవసర కార్యకలాపాలకు ఆదిలా బాద్ కీలక కేంద్రంగా మారే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. దేశంలోని కొద్ది వ్యూహాత్మక ప్రాంతాల్లో మాత్రమే ఉన్న జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌ల సరసన ఆదిలాబాద్ కూడా చేరబోతుండటం జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకురానుంది. దీంతో జాతీయ భద్రతా వ్యవస్థలో ఆదిలాబాద్ ప్రాధాన్యం మరింత పెరగనుంది.
మెరుగుపడనున్న ఉపాధి అవకాశాలు
డిఫెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం 1,500 ఎకరాలు, రన్‌వే విస్తరణ కోసం మరో 80 ఎకరాల భూమి కేటాయింపుపై ప్రభుత్వం సానుకూలంగా ఉండటంతో ప్రాజెక్టు అమలుపై ఆశలు మరింత పెరిగాయి. ప్రతిపాదిత ఇండిస్టియల్ కారిడార్ కూడా కార్యరూపం దాల్చితే ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పథంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇండిస్టియల్ కారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని నాలుగు గ్రామాల్లో 2062 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎయిర్ కనెక్టివిటీ అందుబాటులోకి వస్తే దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు పెరుగుతాయి. రవాణా, లాజిస్టిక్స్, నిర్మాణం, హోటల్స్, పర్యాటకం, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడతాయి. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగే ఆస్కారం ఉంది. ప్రధాన నగరాలతో నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తే ఆదిలాబాద్ వ్యాపార, పారిశ్రామిక కేంద్రంగా మారనుంది.



