Wednesday, June 24, 2026
E-PAPER
Homeజాతీయంధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని పెంచండి

ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని పెంచండి

- Advertisement -

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రులు తుమ్మల, ఉత్తమ్ విజ్ఞప్తి
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో

రబీ 2025–26 సీజన్‌లో రికార్డు స్థాయిలో వరి కొనుగోళ్లు జరిగాయని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన సేకరణ లక్ష్యాలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర మంత్రుల బృందం కోరింది. అలాగే కస్టమ్ మిల్ల్డ్ రైస్ (సీఎంఆర్) సరఫరా గడువులను పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఖరీఫ్ 2026–27 సీజన్‌కు సంబంధించి కేంద్రం నిర్ణయించే సేకరణ లక్ష్యాలు.. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే ఉత్పత్తి, కొనుగోలు అంచనాలకు అనుగుణంగా ఉండాలన్నారు. రైతుల పంటకు సకాలంలో మద్దతు ధర లభించాలంటే కేంద్ర లక్ష్యాలు, వాస్తవ ఉత్పత్తి పరిస్థితులు సమన్వయంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ని ఆయన నివాసంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లు కలిసారు. ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను కేంద్ర మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఖరీఫ్, రబీ కలిపి 2025–26 మార్కెటింగ్ సీజన్‌లో తెలంగాణలో చారిత్రాత్మకంగా 152 లక్షల మెట్రిక్ టన్నులకు (ఎల్ఎంటీ) పైగా వరి సేకరణ జరిగిందన్నారు.

అయితే రాష్ట్రం పంపిన ఉత్పత్తి అంచనాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వరి సేకరణ లక్ష్యాలను తక్కువగా నిర్ధారించిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం పడిందని వివరించారు. అలాగే రబీ 2025–26 సీజన్‌కు రాష్ట్ర ప్రభుత్వం 90 ఎల్ఎంటీల వరి సేకరణ అంచనాలు సమర్పించినప్పటికీ… కేంద్రం కేవలం 35 ఎల్ఎంటీల బియ్యం (51.47 ఎల్ఎంటీ వరికి సమానం) మాత్రమే లక్ష్యంగా నిర్ణయించిందని గుర్తు చేశారు. అయినప్పటికీ రాష్ట్ర రైతుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర లక్ష్యాలను మించి కొనుగోళ్లు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా తీవ్ర ఎండలు, హమాలీల కొరత, నిల్వ సామర్థ్య సమస్యలు, భారీగా వరి రాక, అకాల వర్షాలు వంటి ప్రతికూల పరిస్థితుల మధ్య కొనుగోలు చేసినట్లు వివరించారు. రైతుల నుంచి వచ్చిన ప్రతి గింజను కొనుగోలు చేసి వారి ఆదాయాన్ని కాపాడటంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. ఇలా గత మూడు సీజన్లలో కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలకు మించి తెలంగాణ ప్రభుత్వం 69.50 ఎల్ఎంటీల వరిని అదనంగా కొనుగోలు చేయాల్సి వచ్చిందన్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై రూ.16,446 కోట్ల అదనపు ఎంఎస్‌పీ భారం పడిందని మంత్రులు వెల్లడించారు.

సీఎంఆర్ గడువు పెంచండి
రబీ 2024–25కు సంబంధించి ఇంకా 5 ఎల్ఎంటీల బియ్యం, ఖరీఫ్ 2025–26కు సంబంధించి 14.24 ఎల్ఎంటీల బియ్యం కేంద్ర పూల్‌కు సరఫరా చేయాల్సి ఉందని మంత్రులు తెలిపారు. నిల్వ స్థలాల కొరత, ఒకేసారి పలు సీజన్ల కొనుగోళ్లు కొనసాగడం, మిల్లింగ్ సామర్థ్యాలపై ఒత్తిడి వంటి కారణాల వల్ల గడువులు పొడిగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రబీ 2024–25 సరఫరా గడువును మరో 60 రోజులు, ఖరీఫ్ 2025–26 గడువును 120 రోజులు పొడిగించాలని కేంద్ర మంత్రిని కోరారు. అలాగే రబీ 2025–26 సేకరణ లక్ష్యాన్ని 35 ఎల్ఎంటీల బియ్యం నుంచి 54.50 ఎల్ఎంటీల బియ్యానికి పెంచాలన్నారు. రబీ వరి ఎక్కువగా ఉప్పుడు బియ్యం తయారీకి అనుకూలంగా ఉండటంతో బాయిల్డ్ రైస్ రూపంలో సరఫరా చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

రైతు ప్రయోజనాల విషయంలో రాజీపడం: మంత్రి ఉత్తమ్
రైతు ప్రయోజనాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికీ రాజీపడదని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. రైతు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర లభించేలా అవసరమైన ప్రతి చర్యను తీసుకుంటామన్నారు. భేటి అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు ఒక్క గింజ కూడా నష్టపోకుండా కొనుగోలు చేసినట్లు తెలిపారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 80.09 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించిందని, కొనుగోలు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు. ‘వాస్తవానికి తెలంగాణకు కేంద్రం ఇచ్చిన లక్ష్యం 51 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. కానీ ఇప్పటివరకు మా ప్రభుత్వం 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. లక్ష్యాన్ని మించి అదనంగా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) ద్వారా కేంద్రం తీసుకోవాలి. గత మూడు సీజన్లలో రూ. 16,440 కోట్లతో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ధాన్యం కొనుగోలు చేశాం.’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -