చాలామంది ఒకటో రెండో ఓటములు ఎదురవగానే ‘ఇక మనవల్ల కాదులే’ అని చేతులెత్తేస్తారు. కానీ కొందరు మాత్రం ఆ తిరస్కరణలనే ఇంధనంగా మార్చుకుని ఆకాశమే హద్దుగా దూసుకుపోతారు. ఓటమికే సవాల్‌గా మారతారు. ‘కొండంత లక్ష్యాన్ని అయినా ప్రయత్నిస్తేనే కదా చేరుకోగలం’ అనే దృఢమైన సంకల్పంతో వైష్ణవీ రామలింగం వేసిన అడుగులు ఈరోజు ఆమెను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాయి. ఎనిమిది నెలలపాటు వరుస తిరస్కరణలు, ఎదురుదెబ్బలు ఎదురైనా పట్టువదలకుండా పోరాడి, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి దాదాపు రూ. 2 కోట్ల ‘క్లారెండన్ స్కాలర్‌షిప్’ సాధించింది ఆమె విజయ ప్రస్థానం ఈరోజు మానవిలో…
ఎలాంటి ఆర్థిక, విద్యా నేపథ్యం లేకపోయినా పట్టుదలతో శ్రమిస్తే ఏదైనా సాధించవచ్చని భారత యువతి వైష్ణవి నిరూపించింది. ప్రపంచంలోనే అత్యున్నత విద్యాసంస్థ అయిన బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి దాదాపు రూ. 2 కోట్ల విలువైన ప్రతిష్ఠాత్మక ‘క్లారెండన్ స్కాలర్‌షిప్’ను ఆమె సాధించింది. న్యాయశాస్త్ర విభాగంలో పీహెచ్‌డీ చేయడానికి ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారత మహిళగా సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో భారత్ నుండి ముగ్గురు మాత్రమే ఈ ఘనత సాధించారు.
కుటుంబంలో తొలి గ్రాడ్యుయేట్
పుణేకు చెందిన వైష్ణవి తన కుటుంబంలోనే విశ్వవిద్యాలయ స్థాయిలో చదువుతున్న తొలి తరం గ్రాడ్యుయేట్. చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండేది. ఎప్పటికైనా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకోవాలనేది ఆమె కల. ఆ దిశగానే ఆమె ప్రతి అడుగు పడింది. పూణెలోని ప్రసిద్ధ సింబయాసిస్‌లా స్కూల్ నుంచి బీఏ ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన వైష్ణవి.. ఆ తర్వాత నెదర్లాండ్స్‌లోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లైడెన్ విశ్వవిద్యాలయం నుంచి ‘ఇంటర్నేషనల్ చిల్డ్రన్ రైట్స్’ (అంతర్జాతీయ బాలల హక్కులు) అంశంలో అడ్వాన్స్‌డ్ ఎల్‌ఎల్‌ఎం పూర్తిచేశారు. లైడెన్ యూనివర్సిటీలో కూడా ఆమె తన అసాధారణ ప్రతిభతో ‘లైడెన్ యూనివర్సిటీ ఎక్స్‌లెన్స్ స్కాలర్‌షిప్’ సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.
ఆత్మవిశ్వాసంతో ముందుకు
‘సాధారణంగా మీ కుటుంబంలో తొలి గ్రాడ్యుయేట్ మీరే అయినప్పుడు పైచదువుల విషయంలో ఓ స్పష్టమైన మార్గనిర్దేశనం, ప్రణాళిక ఉండవు. దాంతో మీరు వేసే ప్రతి అడుగూ మీకు కొత్తగా అనిపించచ్చు.. మీరు ఎంచుకున్న మార్గంలో నడుస్తున్నప్పుడు మీరు ఒంటరిగా ఫీలవ్వచ్చు. ఈ క్రమంలో ఆర్జించే జ్ఞానం, ప్రోత్సాహం ఇతరులకు సర్వసాధారణంగా అనిపించినా.. మీకు మాత్రం అవి కొత్తగా అనిపించచ్చు. కొన్నిసార్లు నిత్యం జరిగే సంభాషణలూ వింతగా తోచచ్చు. డిగ్రీ పూర్తిచేసుకొని విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లినప్పుడు నేనూ ఇలాంటి సవాళ్లనే ఎదుర్కొన్నాను. కానీ అక్కడి ఉపాధ్యాయుల ప్రోత్సాహం, తోటి విద్యార్థుల సహకారంతో వీటిని అధిగమించా. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాను’ అంటోంది వైష్ణవి.
అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం
నెదర్లాండ్స్‌లో ఎల్‌ఎల్‌ఎం చదివేటప్పుడు వైష్ణవి బాలల హక్కులపై కీలక పరిశోధన చేసింది. చట్టాలు సాధారణంగా పెద్దవారితో పిల్లల అనుబంధానికే ప్రాధాన్యమిస్తాయని, కానీ తోటి పిల్లలతో సత్సంబంధాలు కలిగి ఉండటం కూడా చిన్నారుల ముఖ్యమైన హక్కేనని ఆమె తన థీసిస్‌లో పేర్కొంది. దీనివల్ల ప్రత్యేక అవసరాలున్న పిల్లలు, పేద పిల్లలు నష్టపోకుండా చట్టబద్ధమైన గుర్తింపు రావాలని వివరించింది. ఈ పరిశోధనను ‘ఉత్తమ లా థీసిస్’గా గుర్తించిన ‘రాయల్ హాలండ్ సొసైటీ ఆఫ్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్’ సంస్థ, నెదర్లాండ్స్‌లో ప్రతిష్టాత్మకమైన జాతీయ పురస్కారం ‘కేహెచ్‌ఎండబ్ల్యూ జాన్ బ్రౌవర్ ప్రైజ్’తో వైష్ణవిని సత్కరించింది. ప్రస్తుత సమాజంలో పిల్లల మానసిక ఆరోగ్యంపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో, చట్టంలో ఎక్కడా స్పష్టంగా లేని బాలల హక్కుల కోణాన్ని ఆమె తన థీసిస్ ద్వారా ప్రపంచానికి చూపించారు. ఆక్స్‌ఫర్డ్‌లో కూడా ఆమె బాలల హక్కుల అంశంపైనే తన పీహెచ్‌డీ పరిశోధనను కొనసాగించనున్నారు.
తొలి భారతీయ మహిళ
లైడెన్ యూనివర్సిటీలో చదువుకొనే సమయంలోనే ఆక్స్‌ఫర్డ్‌లో డీఫిల్ (డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ) చేయాలని అందుకోసం దరఖాస్తు చేసుకుంది వైష్ణవి. కానీ ఆ అవకాశం అంత సులభంగా లభించలేదు. కొన్ని వరుస తిరస్కరణల అనంతరం తాజాగా ఆమె తన కలల ఆకాశాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే న్యాయశాస్త్ర విభాగంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అందించిన ‘క్లారెండన్ స్కాలర్‌షిప్’ గెలుచుకున్న ఆమె.. తద్వారా ఆ విశ్వవిద్యాలయంలో తన పైచదువులకు కావాల్సిన సుమారు రూ.2 కోట్ల నగదు బహుమతిని అందుకుంది. ఇలా లా విభాగంలో ఈ ప్రతిష్టాత్మక ఉపకార వేతనం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిందామె.
దేశం గర్వించేలా
వైష్ణవి సాధించిన ఈ అద్భుత విజయం వెనుక ఎనిమిది నెలల నిరాశ, వరుస తిరస్కరణలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్నత విద్య కోసం, పరిశోధనల కోసం ఆమె చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ సమయంలో తీవ్ర నిరాశకులోనై.. అసలు దరఖాస్తు చేయవద్దని అనుకున్న చోట.. దేశం గర్వించే అత్యుత్తమ ఫలితం దక్కిందని వైష్ణవి చెప్పుకొచ్చింది. ‘క్లారెండన్ స్కాలర్‌షిప్’కు ఎంపికయ్యావంటూ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఈమెయిల్ వచ్చినప్పుడు తన ఆనందానికి అవధులు లేవని గుర్తుచేసుకుంది. వైష్ణవి సాధించిన అసాధారణ విజయాన్ని ‘ఆక్స్‌ఫర్డ్’ స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభినందించింది.
శాయశక్తులా ప్రయత్నించండి
‘ఆక్స్‌ఫర్డ్ వంటి అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో చదవాలన్న కల ప్రతి విద్యార్థికీ ఉంటుంది. కానీ అది మనకు సాధ్యం కాదని ప్రయత్నం చేయకుండానే వెనకడుగు వేస్తుంటారు చాలామంది. కానీ ప్రయత్నించకుండా ఫలితం రాలేదనడం సరికాదు. కాబట్టి మీకు ఆసక్తి ఉన్న అంశాలపై పూర్తి దృష్టి పెట్టండి. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించండి. తప్పకుండా ఫలితం దక్కుతుంది. ఇందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ. లైడెన్ యూనివర్సిటీలో చదువుకొనే రోజుల్లో అక్కడి ప్రొఫెసర్ల ప్రోత్సాహంతో మళ్లీ మళ్లీ ఆక్స్‌ఫర్డ్‌లో చేరే అవకాశం కోసం ప్రయత్నించా. వరుస తిరస్కరణలు ఎదురవడంతో ఒకానొక దశలో ఇక దరఖాస్తు చేయడం ఆపేయాలనుకున్నా. కానీ నా కష్టానికి ఫలితం ఇప్పుడు దక్కింది. కాబట్టి మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోవద్దు..’ అంటూ తన స్ఫూర్తిదాయకమైన మాటలతోనూ నేటి యువతలో ప్రేరణ కలిగిస్తోంది వైష్ణవి. ఆక్స్‌ఫర్డ్‌లోనూ బాలల హక్కుల పైనే లోతుగా అధ్యయనం చేయబోతున్నట్లు చెబుతోంది.
– అనంతోజు మోహన కృష్ణ



