నకిలీ మంజూరు పత్రాలు ఇచ్చి 99 మంది నుంచి రూ. కోటి వసూలు
ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో ముగ్గురు
నవతెలంగాణ-బేగంపేట్
ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులు ఇప్పిస్తామని నమ్మించి పేదల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన మోసగాళ్ల ముఠాను అల్వాల్ పోలీసులు అరెస్టు చేశారు. ఏడుగురు సభ్యులతో కూడిన ఈ ముఠాలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 79 నకిలీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు ధ్రువపత్రాలు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు ఇప్పటికే మృతి చెందగా, పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను గురువారం సికిం ద్రాబాద్లోని మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో డీసీపీ శ్రీధర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. తిరుమలగిరికి చెందిన తిమ్మిరి గోపీనాథ్ పుష్పలత జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేసేది. సులువుగా డబ్బులు సంపాదించాలన్న దురాశతో అల్వాల్‌కు చెందిన జయరాజ్ గంగాధరన్‌తో కలిసి ఈ మోసానికి పథకం రచించింది. పుష్పలత తాను జీహెచ్ఎంసీలో ఉన్నతస్థాయి ఉద్యో గినని, తనకు ప్రభుత్వంలో ఉన్నతాధి కారులతో సంబంధాలు ఉన్నాయని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని నమ్మించి పేద, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక్కో బాధితుడి నుంచి రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు ‘ప్రాసెసింగ్ చార్జీలు’ పేరుతో వసూలు చేశారు. ఈ విధంగా మొత్తం 99 మంది బాధితుల నుంచి సుమారు రూ.కోటి వరకూ వసూలు చేశారు. అనంతరం బాధితులకు నకిలీ కేటాయింపు పత్రాలు అందజేశారు.
అవి నకిలీవని తెలిసిన తర్వాత బాధితులు నిలదీయగా, అసలు పత్రాలు ఇస్తామని నమ్మబలుకుతూ కాలయాపన చేశారు. దాదాపు మూడు సంవత్సరాల పాటు ఇండ్ల కోసం ఎదురుచూసిన బాధితులు చివరకు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. అల్వాల్‌కు చెందిన గొగికర్ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, జూన్ 24న(బుధవారం) తిమ్మిరి గోపీనాథ్ పుష్పలత, ఆమె కుమారుడు తిమ్మిరి గోపీనాథ్ విశాల్, నకిలీ ధ్రువపత్రాల రూపకల్పన, ముద్రణలో కీలక పాత్ర పోషించిన తిరుమలగిరి జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు మహేందర్ సింగ్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జయరాజ్ గంగాధరన్ కుమార్తె నిషా రాజ్, కుమారుడు చింటూ రాజ్, అలాగే నకిలీ రబ్బర్ స్టాంపులు తయారు చేసిన రాణిగంజ్‌కు చెందిన రాజ్ అండ్ కో నిర్వాహకులు పరారీలో ఉన్నట్టు తెలిపారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. ప్రధాన నిందితుడు జయరాజ్ గంగాధరన్ కొద్ది నెలల క్రితమే మరణించినట్టు కుటుంబ సభ్యులు, స్థానికుల ద్వారా సమాచారం అందిందని, అయితే దీనిపై ఇంకా అధికారిక నిర్ధారణ జరగలేదని, విషయమై లోతుగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు.
దళారుల నుంచి అప్రమత్తంగా ఉండండి : డీసీపీ శ్రీధర్
ప్రభుత్వ ఉద్యోగాలు, ఇండ్లు ఇప్పిస్తానని చెప్పి వచ్చే దళారుల మాటలు నమ్మి ప్రజలు మోసపోరాదని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, భూ కేటాయింపులు లేదా ఇతర ప్రభుత్వ పథకాల పేరుతో డబ్బులు తీసుకుని హామీలు ఇచ్చే వ్యక్తులను నమ్మవద్దని అన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని, అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 112 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.



