Friday, June 26, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు15 మంది డాక్టర్లకు ఆరుగురే

15 మంది డాక్టర్లకు ఆరుగురే

- Advertisement -

రాత్రి డ్యూటీలో ఉండని వైద్యులు
యాచారం ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలన్నీ పాతవే
సమస్యలపై వైద్యారోగ్యశాఖ మంత్రి వెంటనే
ఆస్పత్రిని విజిట్ చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ
ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరిక
హెల్త్ కమ్యూనిటీ సెంటర్‌‌ను సందర్శించిన సీపీఐ(ఎం) బృందం

నవతెలంగాణ-యాచారం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో వెంటనే మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్ప్రత్రుల్లో సరైన సౌకర్యాలు లేక వైద్య కోసం ప్రయివేట్‌ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌‌ను సీపీఐ(ఎం) నాయకులతో కలిసి జాన్‌‌వెస్లీ సందర్శించారు. అక్కడి వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సౌకర్యాల గురించి ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యాచారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌‌గా అప్‌ గ్రేడ్‌ అయిన తర్వాత ఏ మాత్రం వైద్య సేవలు మెరుగుపడలేదని అన్నారు. ఈ ఆస్పత్రిలో 15 మంది డాక్టర్లు పనిచేయాల్సి ఉండగా.. కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారని తెలిపారు. రాత్రిపూట డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదన్నారు. దాంతో హెల్త్ ఎమర్జెన్సీ కోసం వచ్చే రోగులంతా ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరుకుందని, నూతన భవనాన్ని నిర్మించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆస్పత్రిలో తాత్కాలిక డెవలప్‌‌మెంట్‌ పేరిట రూ.50 లక్షలను దుబారా ఖర్చుల కింద కాజేశారని విమర్శించారు. శానిటేషన్ సిబ్బందికి సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదని, భోజన వసతులు పూర్తిస్థాయిలో కల్పించడం లేదని అన్నారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శిథిలావస్థకు చేరిన యాచారం హెల్త్ కమ్యూనిటీ సెంటర్‌‌ను వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సందర్శించి, మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. లేనిపక్ష‍ంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు డీజీ నరసింహారావు, పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, కార్యదర్శివర్గ సభ్యులు బోడ సామెల్, డి. రాంచందర్‌, కందుకూరి జగన్, పార్టీ మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ, జిల్లా కమిటీ సభ్యులు పి.అంజయ్య, మండల ‌నాయకులు ఆలంపల్లి జంగయ్య, ఎస్.చందునాయక్, పి. వెంకటయ్య, ఉడుతల జంగయ్య, మండల బాలరాజ్, కావలి జగన్, డి.పెద్దయ్య, తావునాయక్, విప్లవకుమార్ తదితరులు పాల్గొన్నారు. ​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -