ప్రత్యేక అధికారితో విచారణ జరపాలి
హామీల అమలుకు బడ్జెట్ కేటాయింపులుండాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై మార్చి 1-20 వరకు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెరలో చిన్నారిని చిదిమేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. ఆ గ్రామ సర్పంచ్ తుకారామిరెడ్డితో పాటు శ్రీనివాస్‌రెడ్డి, తదితర నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నారి హత్య కేసులో పెత్తందారుల పక్షం వహిస్తూ కేసును నీరుగార్చే విధంగా వ్యవహరించిన సీఐ, ఎస్ఐను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. డీఎస్పీ పాత్రపై ప్రత్యేక అధికారిని నియమించి విచారించాలని కోరారు. మంగళవారం సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశాన్ని ఇబ్రహీంపట్నం పాషా, నరహరి స్మారక కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కులదురహంకార ఘటనలు కొనసాగుతు న్నాయనేందుకు ఈ ఘటనే ఉదాహరణన్నారు. దళితులు, రజకులపై దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఈ ఘటనపై సీఎం, డీజీపీ స్పందించక పోవడం బాధాకరమని తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మార్చి 1- 20 వరకు ఆందోళనలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మార్చి 1నుంచి 20వ తేదీ వరకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించనున్నామని జాన్‌వెస్లీ ప్రకటించారు. గడపగడపకూ వెళ్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను వివరించాలన్నారు. మండల కేంద్రాల్లో ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. కార్మిక హక్కులు కాలరాస్తూ, నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. విత్తన బిల్లును తేవడం వ్యవసాయరంగాన్ని దెబ్బతీయట మేనన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని నీరుగారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సవరణ బిల్లు ద్వారా విద్యుత్‌ను ప్రయివేటు పరం చేయాలని చూస్తోందన్నారు. ఈ తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలన్నారు.
హామీల అమలుకు బడ్జెట్ ఉండాలి..
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రజలకు చేసిన హామీలు అమలు చేసేలా రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు ఉండాలని జాన్‌వెస్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. విద్యా రంగానికి 15శాతం నిధులు కేటాయిస్తామని చెప్పి, ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదన్నారు. విద్యారంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల వాగ్దానం ఇంకా నెరవేరడం లేదన్నారు. వైద్యరంగం నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రాష్ట్ర బడ్జెట్లో తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్, జగదీష్, ఏర్పుల నర్సింహ, డి.రామచందర్, కె.జగన్, కవిత, చంద్రమోహన్, జిల్లా కమిటీ సభ్యులు తదితరులున్నారు.
పసికందు హంతకులను శిక్షించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



