Sunday, June 28, 2026
E-PAPER
Homeసోపతిమల్లెపూలు

మల్లెపూలు

- Advertisement -

”నా ఎగ్జిబిషన్‌కు స్పాన్సర్‌షిప్‌ దొరికింది.”
ఫోన్‌లో ఆమె గొంతు ఉత్సాహంతో తడబడింది. ఆ ఒక్క వాక్యం కోసం ఆమె ఎన్నేళ్లుగా ఎదురుచూస్తోందో నాకు తెలుసు.
”Congratulations.” అన్నాను.
”ఈ సాయంత్రం మల్లెపూలు నువ్వే కొనిపెట్టాలి.”
”సరే.”
ఫోన్‌ కట్‌ అయింది. కొద్దిసేపు ఫోన్‌ స్క్రీన్‌నే చూస్తూ కూర్చున్నాను. ఆమె కలకు తొలి అడుగు పడిన రోజు అది. అయినా కానుకగా అడిగింది మాత్రం గుప్పెడు మల్లెపూలే.
‘మల్లెపూలు’ అనే మాట వినగానే… ఒక పాత సాయంత్రం గుర్తొచ్చింది. ఆమె జీవితంలో ఆ పువ్వులు కేవలం అలంకారం కాదని నాకు మొదటిసారి అర్థమైన సాయంత్రం అది. కళ్లుమూసుకుంటే ఆ రోజు మళ్లీ మొదలవుతుంది…
సాయంత్రం ఆరున్నర. ఆ ఆర్ట్‌ స్టూడియోలో మిగిలింది రంగుల వాసన మాత్రమే. గోడలన్నీ చిత్రాలతో నిండిపోయాయి. నేను లోపలికి వెళ్లేసరికి ఆమె కిటికీ పక్కన ఓ కుర్చీలో కూర్చుని ఉంది. మోకాళ్ల మీద స్కెచ్‌బుక్‌. చేతిలో పెన్సిల్‌.. నన్ను చూడగానే గడియారం చూసింది. అర్థమైంది. నా ఆలస్యానికి ఆమె కోపంగా ఉంది. నేను ఎదురుగా ఉన్న స్టూల్‌ మీద కూర్చున్నాను.
”టీ తాగుదామా?”
”వద్దు.”
”ఐస్‌క్రీమ్‌?”
”వద్దు.”
”మరి?”
ఆమె సమాధానం చెప్పలేదు. నేను బ్యాగులోంచి చిన్న తెల్ల కాగితపు పొట్లం తీసి ఆమె చేతిలో పెట్టాను. పొట్లం విప్పింది. ఆమె కళ్లలో ఒక్కసారిగా ఏదో మెరుపు… తాజా మల్లెపూలు. ఆమె వాటిని చేతిలోకి తీసుకుంది. క్షణంలో కోపం కరిగిపోయింది.
”నువ్వు ప్రమాదకరమైన మనిషివి.” అంది.
”ఎందుకు?”
”మనుషుల్ని ఎలా బుజ్జగించాలో బాగా తెలుసు.”
ఆ తర్వాత మెల్లగా మల్లెపూలను జడలో తురుముకుంది.
”ఇప్పుడు కోపం పోయిందా?” అడిగాను.
”కొంచెం.”
”మిగతాది?”
”ఇంకో మూర కొనాలి.”
మొదటిసారి నవ్వింది.
”నీకు తెలుసా రామ్‌…” అంది.
”ఏమిటి?”
”మా ఇంటి ముందు ఒక మల్లెచెట్టు ఉండేది.”
”అందుకే ఈ అనుబంధమా?”
”కాదు.. నేను మొదటిసారి బొమ్మ వేసిన రోజు ఎవరూ పట్టించుకోలేదు సరికదా, కనీసం సరిగా చూడలేదు. కోపంగా వెళ్లి ఆ చెట్టు కింద కూర్చున్నాను.”
”తర్వాత?”
”అప్పుడు ఒక విషయం గమనించాను.”
”ఏమిటి?”
”ఎవరూ చూడకపోయినా… ఆ చెట్టు ప్రతిరోజూ పూసేది.”
ఆమె మల్లెపూలను సరిచేసుకుంది.
”అప్పటి నుంచి ఇవంటే ఇష్టం. ఇవి నాకు విజయాన్ని గుర్తు చేయవు రామ్‌… ప్రయాణాన్ని గుర్తు చేస్తాయి.”
అప్పుడు ఆ మాటల్లో దాగి ఉన్న లోతు నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఆమె పువ్వుల గురించి మాట్లాడుతోంది అనుకున్నాను. నిజానికి ఆమె జీవితం గురించి మాట్లాడుతోంది. ఎవరూ గుర్తించినా గుర్తించకపోయినా… ప్రతిరోజూ పూసే ఒక నిశ్శబ్ద సాధన గురించి. ఆ విషయం నాకు చాలా రోజుల తర్వాత అర్థమైంది.
ఆమె చెప్పింది నిజమే. మల్లెపూలు ఆమెకు విజయాన్ని కాదు, ప్రయాణాన్ని గుర్తు చేస్తాయి. అందుకేనేమో… జీవితంలో ఏ చిన్న మైలురాయి వచ్చినా, చివరికి ఆమె అడిగేది మల్లెపూలనే. ఈరోజు కూడా ఆమె అడిగింది మల్లెపూలనే.
సాయంత్రం ఆమెను తీసుకుని నేను పూల మార్కెట్‌కు వెళ్లాను. రోడ్డు పక్కన వరుసగా చామంతులు, గులాబీలు, కనకాంబరాలు.. వాటి మధ్య తెల్లగా మెరిసిపోతున్న మల్లెపూల రాశి. ఓ మహిళ నేలపై పరచిన గుడ్డ మీద కూర్చుని ఆ మల్లెలు అల్లుతోంది. మేమిద్దరం ఆ పూలు చూస్తుండగానే…
”అమ్మా…” అంటూ ఒక అమ్మాయి పరుగెత్తుకుంటూ వచ్చి ఆ మహిళ పక్కనే కూర్చుంది. ఆ మహిళ చేతులు ఒక్కసారిగా ఆగిపోయాయి.
”ఏమైంది?”
ఆ అమ్మాయి తన చేతిలో ఉన్న కాగితం ఆమె చేతిలో పెట్టింది. ఆమె చదవలేక పోయింది. కూతురి ముఖం చూసింది..
”సీటు వచ్చిందా?” అడిగింది.
”వచ్చింది” చెప్పిందా అమ్మాయి.
”ఏ కోర్సు?”
”బీఎస్సీ నర్సింగ్‌.”
”ఎక్కడీ”
”గాంధీ మెడికల్‌ కాలేజ్‌, సికింద్రాబాద్‌.”
ఒక్క క్షణం నిశ్శబ్దం. తర్వాత ఆమె కూతురి చెంపలు రెండు చేతులతో పట్టుకుంది.
”సాధించావ్‌ తల్లీ.” అంది.
”నేను కాదు అమ్మా.. మనిద్దరం.” ఆ అమ్మాయి చెప్పింది.
ఆ తర్వాత ఆ మహిళ పూల బుట్ట వైపు చూస్తూ మెల్లగా అంది…
”ఈ మల్లెపూలు కూడా.”
ఆ మాట విన్న వెంటనే ఆమె, చిరునవ్వుతో వెళ్లి ఆ అమ్మాయి పక్కన మోకాళ్ల మీద కూర్చుంది.
”ఇప్పుడు నాకు అర్థమైంది.. మల్లెపూలతో మాలలు మాత్రమే కాదు, కలలు కూడా అల్లొచ్చని.” అంది.
ఆ అమ్మాయి కళ్లలో మెరుపు. ఆ తల్లి కళ్లలో తడి. పూల మార్కెట్‌ హడావిడి మాత్రం అలాగే కొనసాగుతోంది. కానీ ఆ చిన్న పూల దుకాణం ముందు… నలుగురు మనుషుల మధ్య ఒక కొత్త ఆశ కూర్చుంది. కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు. ఆ మౌనాన్ని భంగం చేస్తూ నేను ఆ మహిళ వైపు తిరిగాను.
”రెండు మూరల మల్లెపూలు ఇవ్వమ్మా.” అన్నాను.
ఇచ్చింది.
అది ఆమె చేతిలో పెట్టాను.
”ఇదిగో నా కానుక.” అన్నాను.
ఆమె నవ్వింది. మల్లెదండను మెల్లగా జడలో తురుముకుంది. తర్వాత…
”ఇంకో రెండు మూరలు ఇవ్వండి.” అంది.
ఆ పూలమ్మ నవ్వుతూ ఇంకో మాల ఇచ్చింది. ఆమె దాన్ని తీసుకుని తన పక్కనే కూర్చున్న ఆ అమ్మాయి జుట్టు మెల్లగా పక్కకు జరిపింది.
”మేడమ్‌…” అంది ఆ అమ్మాయి ఆశ్చర్యంగా.
మల్లెపూలను మెల్లగా ఆ అమ్మాయి జడలో తురుముతూ ఆమె నవ్వింది.
అమ్మాయి కళ్లలో నీళ్లు మెరిశాయి. తర్వాత ఆమె ప్రేమగా అడిగింది..
”నీ పేరేంటి”
”జ్యోతి”
”జ్యోతి… బాగా చదువు” అని చెప్పి మల్లెపూలను సరిచేసింది.
ఆ అమ్మాయి మౌనంగా పువ్వులను తాకింది. అది పువ్వును తాకినట్టుకాదు. తన కలను తాకినట్టుంది. ఆ సాయంత్రం… ఒక మల్లెదండ ఆమె సంతోషానికి గుర్తైతే, మరో మల్లెదండ జ్యోతి భవిష్యత్తుకు ఆశీర్వాదంగా మారింది. – రామ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -