వైద్య సేవలను వృత్తిగా, సమాజ సేవను జీవిత లక్ష్యంగా, కళను ఆత్మసంతృప్తిగా భావిస్తూ ముందుకు సాగుతున్న అరుదైన వ్యక్తి డా. జ్యోతి రెడ్డి. ఒకవైపు వైద్యురాలిగా వేలాది మంది రోగులకు ఆరోగ్యాన్ని అందిస్తూనే, మరోవైపు కూచిపూడి నర్తకిగా సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షిస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. సేవా భావం, అంకితభావం, కళాప్రేమ కలిసిన ఆమె జీవన ప్రయాణం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.
1983 ఆగస్టు 18న పుట్టిన డా. జ్యోతి రెడ్డి.. శ్రీ నరసింహారెడ్డి, మణిమాల దంపతుల కుమార్తె. చిన్ననాటి నుంచే చదువుతో పాటు కళలపై ఆసక్తి పెంచుకున్న ఆమె, కష్టపడి వైద్య విద్యను అభ్యసించి ఎంబీబీఎస్, ఎండీ పూర్తి చేశారు. అనంతరం ఫ్యామిలీ మెడిసిన్, డయాబెటాలజీలో ఫెలోషిప్ సాధించారు. ప్రస్తుతం డయాబెటాలజీ, ఫ్యామిలీ మెడిసిన్ రంగాల్లో ప్రత్యేక నైపుణ్యంతో సేవలందిస్తున్నారు. ఈమె సేవలు కేవలం వైద్య వృత్తికే పరిమితం కాలేదు. గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిన వర్గాలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో ఆరోగ్య సేవలను అందించడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్‌లో సభ్యురాలిగా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సమాజ ఆరోగ్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. కస్తూర్‌బా ట్రస్ట్, రెయిన్ బో చిల్ర్డన్ హాస్పిటల్స్ వారి సహకారంతో అనేక ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. తద్వారా పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారు. యువ వైద్యులకు మార్గదర్శకత్వం వహిస్తూ వైద్యరంగంలో కొత్త తరాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఆమె సేవలను గుర్తించి గాంధీ హాస్పిటల్ ప్రశంసా పురస్కారంతో సత్కరించింది.
అవార్డుల పరంపర
వైద్యరంగంలోనూ, కళారంగంలోనూ డా. జ్యోతి రెడ్డి ప్రతిభకు అనేక పురస్కారాలు లభించాయి. వైద్య రంగంలో 2021లో కోవిడ్ వారియర్ అవార్డు, 2022 – గ్లోబల్ లేడీ అవార్డ్ ఆఫ్ కాయపలాట్, 2023లో బెస్ట్ డాక్టర్ అవార్డు, డా.ఎ.పి.జి.అబ్దుల్ కలామ్ వంటి అవార్డులు అందుకున్నారు. ఒక కూచిపూడి నృత్య ప్రదర్శనలకు గాను రెండు నంది అవార్డులు, నాట్యాంజలి అవార్డు, సిద్ధేంద్ర యోగి అవార్డులు తీసుకున్నారు. ఈ గౌరవాలు ఆమె కృషికి, అంకితభావానికి నిదర్శనంగా నిలిచాయి.
కళతో మమేకమైన వైద్యురాలు
వైద్య సేవలు అందిస్తూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఏ మాత్రం సమయం దొరికినా కూచిపూడి నృత్య ప్రదర్శనల్లో పాల్గొంటుంటారు జ్యోతి. కళపై ఆమెకున్న ప్రేమకు ఇది నిదర్శనం. నాట్యరంగంలో ఆమె సాధించిన విజయాలు క్రమశిక్షణ, సాధన, కళపట్ల ఉన్న అపారమైన అభిరుచిని తెలియజేస్తాయి. క్లాసికల్ డ్యాన్స్, సంగీతం వినడం, ప్రయాణాలు ఆమెకు ఎంతో ఇష్టమైన హాబీలు.
సేవను కొనసాగిస్తున్న కుటుంబం
డా. జ్యోతి రెడ్డి జీవిత భాగస్వామి డా. నరసింహారెడ్డి పట్లొల్ల కూడా ప్రముఖ డాక్టర్. ఈయన జనరల్ ఫిజీషియన్‌గా సేవలు అందిస్తున్నారు. ‘సేవే ధ్యేయం’ అనే భావనతో గ్రామీణ, జిల్లా స్థాయిల్లో అనేక ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఆమె అత్తమామలు దివంగత పట్లొల్ల మల్లారెడ్డి, శ్రీమతి పట్లొల్ల సుజాత. కుటుంబ విలువలు, సేవా దృక్పథం, సామాజిక బాధ్యతలను వారు కుటుంబానికి అందించిన గొప్ప వారసత్వంగా భావిస్తారు.
ప్రతిభావంతులైన వారసులు
ఈ దంపతుల కుమారుడు కృతిన్ ప్రస్తుతం 11వ తరగతి చదువుతున్నారు. తైక్వాండోలో రెడ్ బెల్ట్ సాధించడంతో పాటు స్విమ్మింగ్ ఛాంపియన్‌గా గుర్తింపు పొందారు. అమ్మాయి ఆరాధ్య 6వ తరగతి చదువుతూ కూచిపూడి నర్తకిగా ఇప్పటికే రెండు నంది అవార్డులు అందుకుంది. అంతేకాకుండా హార్స్ రైడింగ్‌తో పాటు పెయింటింగ్‌లో కూడా తన ప్రతిభ కనబరుస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎదుగుతోంది.
వ్యక్తిత్వం వెనుక ఉన్న విలువలు
కష్టపడే స్వభావం, దయాగుణం, నాయకత్వ లక్షణాలు, లక్ష్యసాధనలో పట్టుదల, సమాజం పట్ల బాధ్యతాభావం… ఇవే డా. జ్యోతి రెడ్డి విజయానికి మూలస్తంభాలు. వైద్య సేవల ద్వారా ఆరోగ్యాన్ని, నాట్యకళ ద్వారా సాంస్కృతిక విలువలను ప్రజలకు చేరవేస్తూ ఆమె తన జీవితాన్ని అర్థవంతంగా మలుచుకున్నారు.
యువతకు స్ఫూర్తి
నేటి వేగవంతమైన జీవితంలో వృత్తి, కుటుంబం, సమాజ సేవ, కళలను సమన్వయం చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్న డా. జ్యోతి రెడ్డి నిజంగా ఒక స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం. ‘సేవలో సంతోషం – కళలో ఆత్మసంతృప్తి’ అనే జీవన సూత్రంతో ఆమె చేస్తున్న ప్రయాణం మరెందరికో మార్గదర్శకంగా నిలుస్తోంది. వైద్యురాలిగా ప్రజల ఆరోగ్యానికి, నర్తకిగా సంస్కృతి పరిరక్షణకు, సేవకురాలిగా సమాజ అభ్యున్నతికి అంకితమైన డా. జ్యోతి రెడ్డి నిజంగా ఆధునిక మహిళా శక్తికి ఓ ప్రతీక.
హిప్నో హిమకర్.జి
లైఫ్ కోచ్ ట్రైనర్, 9390044031
డ్యాన్స్ చేస్తూ డాక్టర్‌గా వెలుగొందిన డా. జ్యోతి రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



