– వర్షాకాల ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం
నవతెలంగాణ – అశ్వారావుపేట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) రూపకల్పనపై మండల స్థాయి శిక్షణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఎంపీడీవో వాల్మీకి కిశోర్ అధ్యక్షతన జరిగిన ఈ శిక్షణలో గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికల తయారీ, గ్రామ స్థాయి అవసరాల గుర్తింపు, ప్రజల భాగస్వామ్యంతో సమర్థవంతమైన ప్రణాళికల రూపకల్పనపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు.
అలాగే రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలు, గ్రామాల్లో చేపట్టాల్సిన పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి భద్రత, డ్రైనేజీల నిర్వహణ, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. వర్షాకాల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ రామ కోటా రెడ్డి,ఎంఈఓ ప్రసాదరావు, పీఆర్ ఏఈఈ అక్షిత, ఏఓ శ్రీనివాస్ తో పాటు వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు పాల్గొన్నారు.



