నవతెలంగాణ-మిడ్జిల్
పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని పాలమూరు జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా చెప్పారు. మిడ్జిల్ మండలంలో నిర్వహించిన ఉచిత లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ అధికారులు, పశువైద్య సిబ్బందితో మాట్లాడి టీకాల కార్యక్రమం పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
మండలంలో పాడి పరిశ్రమపై అధిక సంఖ్యలో రైతులు ఆధారపడుతూ, పాల ఉత్పత్తి గణనీయంగా జరుగుతున్న నేపథ్యంలో కొత్త పశువైద్య ఉపకేంద్రాల ఏర్పాటు అవసరంపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ ప్రతిపాదనల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక మండల పశువైద్యాధికారి డాక్టర్ శివరాజ్‌ను కలెక్టర్ పశువైద్య సేవలు, మండలంలో పశుసంవర్ధక రంగం పరిస్థితి, పాల ఉత్పత్తి పెంపునకు చేపడుతున్న చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలో పశుసంవర్ధక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలపై అధికారులతో చర్చించారు.
ఉచిత లంపి స్కిన్ వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా మిడ్జిల్, మల్లాపూర్, వేముల గ్రామాల్లో మూడు నెలలు నిండిన ప్రతి పాడి పశువుకు, దుక్కి దున్నే పశువుకు ఉచితంగా టీకాలు వేశారు. ఒక్కరోజే మొత్తం 564 పశువులకు టీకాలు అందించినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా అధికారులు లంపి స్కిన్ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ వ్యాధి సోకిన పశువులకు తీవ్రమైన జ్వరం రావడంతో పాటు పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుందని, పని సామర్థ్యం దెబ్బతిని రైతులకు ఆర్థిక నష్టం కలుగుతుందని వివరించారు. అలాగే చర్మంపై, నోటిలో బొబ్బలు ఏర్పడి పుండ్లుగా మారడం వల్ల పశువులు మేత, నీరు తీసుకోకుండా బలహీనపడి మృత్యువాత పడే ప్రమాదం ఉంటుందని తెలిపారు.
మూడు నెలలు దాటిన దూడలు, పెద్ద పశువులకు ఏడాదికి ఒకసారి తప్పనిసరిగా లంపి స్కిన్ వ్యాధి నిరోధక టీకా వేయించాలని పశుసంవర్ధక శాఖ అధికారులు రైతులకు సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని, మండల పశువైద్యాధికారి డాక్టర్ అనూప్ శివరాజ్, డాక్టర్ శివకాంత్ పశువైద్య సిబ్బంది నర్సింహ, శ్రీనివాస్, పాండు, గోపాలమిత్రలు నరసింహ, వేణుగోపాల్, రామకృష్ణతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.



