Wednesday, July 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండలంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన లోపం..

మండలంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన లోపం..

- Advertisement -

ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్
నవతెలంగాణ – ఉప్పునుంతల

నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల వ్యాప్తంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమం కొనసాగుతున్నప్పటికీ, విస్తృత ప్రచారం లేకపోవడంతో ప్రజల్లో సందేహాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్న సిబ్బంది వాటిని నింపి ఇవ్వాలని కోరుతున్నప్పటికీ, వాటి ఉద్దేశం, నింపే విధానం, జత చేయాల్సిన పత్రాలపై చాలామందికి స్పష్టమైన అవగాహన లేదని గ్రామస్తులు చెబుతున్నారు.

ముఖ్యంగా నిరక్షరాస్యులు, వృద్ధులు, ఒంటరిగా నివసించే వారు ఫారాలు ఎలా నింపాలో తెలియక ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. వివరాలు అర్థం కాకపోవడంతో అనేక కుటుంబాల్లో ఫారాలు నింపకుండా ఇళ్లలోనే ఉండిపోతున్నాయని స్థానికులు అంటున్నారు. దీంతో ఓటరు నమోదు ప్రక్రియపై అనవసరమైన అయోమయం నెలకొంటోందని అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం గ్రామాల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు కనిపించడం లేదని పలువురు పేర్కొంటున్నారు. మైక్ ప్రకటనలు, గ్రామ సభలు, పోస్టర్లు, కరపత్రాలు, ప్రత్యేక అవగాహన సమావేశాలు నిర్వహిస్తే ప్రజలకు పూర్తి సమాచారం చేరుతుందని సూచిస్తున్నారు. ఇప్పటికే ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు కూడా ఫారం నింపాలా? ఏ పత్రాలు జత చేయాలి? ఎక్కడ సమర్పించాలి? వంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు అందకపోవడంతో సందేహాలు మరింత పెరుగుతున్నాయని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో మండల కేంద్రంతో పాటు ప్రతి గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి, ఫారాలు నింపడంలో ప్రజలకు ప్రత్యక్షంగా సహాయం అందించాలని ప్రజలు కోరుతున్నారు. హెల్ప్‌డెస్క్‌ల ద్వారా అవసరమైన పత్రాల వివరాలు తెలియజేయడంతో పాటు, నిరక్షరాస్యులు, వృద్ధులకు ఫారాలు నింపడంలో సహకారం అందిస్తే ప్రక్రియ మరింత సులభంగా సాగుతుందని అభిప్రాయపడుతున్నారు.

ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు కావడంతో, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎవరూ ఇబ్బందులు పడకుండా ఎన్నికల యంత్రాంగం విస్తృత ప్రచారం చేపట్టడంతో పాటు ప్రజల సందేహాలను వెంటనే నివృత్తి చేసే చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -