Thursday, July 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యార్థినులను బెదిరించిన నకిలీ పోలీస్

విద్యార్థినులను బెదిరించిన నకిలీ పోలీస్

- Advertisement -

వ్యభిచార కేసులు పెడతానంటూ డబ్బులు వసూలు
అరెస్టు చేసిన పోలీసులు
​నవతెలంగాణ-కోంపల్లి

పోలీసు అధికారిగా నటిస్తూ బాలికల హాస్టల్‌లోకి ప్రవేశించి విద్యార్థినులను తప్పుడు కేసులతో బెదిరించి డబ్బు వసూలు చేసిన నకిలీ పోలీసును హైదరాబాద్‌ పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కోనేరుపల్లికి చెందిన పాండి యాదగిరి అలియాస్ అనిల్‌కుమార్(25) ఓ ప్రయివేటు సెక్యూరిటీ సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారంలో నివాసముంటున్నాడు. గతంలో మహంకాళి ట్రాఫిక్ పోలీసు విభాగంలో క్యాజువల్ లేబర్‌గా పనిచేసిన అనుభవాన్ని ఆసరాగా చేసుకుని పోలీసు యూనిఫాం, జెర్కిన్, మోటార్‌సైకిల్ కొనుగోలు చేసి పోలీసు అధికారిగా చలామణి అవుతున్నాడు. సుమారు 15 రోజుల ముందే అతను పోలీసు యూనిఫాంలో సుచిత్రలోని మౌనిడ శ్రీ గర్ల్స్ హాస్టల్ లోకి వెళ్లి రాత్రి 10.30 గంటలలోపు హాస్టల్ కార్యకలాపాలు ముగించాలని యాజమాన్యాన్ని బెదిరించాడు. అనంతరం జూన్ 29 రాత్రి మళ్లీ పోలీసు యూనిఫాంలో హాస్టల్‌కు చేరుకుని విద్యార్థినులను వ్యభిచార కేసుల్లో ఇరికిస్తానంటూ బెదిరించి వారి మొబైల్ ఫోన్లను తీసుకుని ఫొటోలు తీశాడు. కేసు నమోదు చేయకుండా ఉండేందుకు రూ.5 వేలు డిమాండ్ చేసి, చివరకు రూ.2 వేలు వసూలు చేశాడు. ఈ మేరకు హాస్టల్‌ ‌యజమాని గుడూరు విజయ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పేట్ బషీరాబాద్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే దుండిగల్ ప్రాంతంలోని ఓ బాలికల హాస్టల్‌లో కానిస్టేబుల్‌గా నటించి డబ్బులు వసూలు చేశాడు. పేట్ బషీరాబాద్–మేడ్చల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ పోలీసుగా నటిస్తూ వాహనదారులను ట్రాఫిక్ కేసుల పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. నిందితుడిపై క్రైమ్ నంబర్ 921/2026 కింద బీఎన్‌ఎస్ సెక్షన్లు 204, 308(4), 318(4) ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -