Sunday, March 1, 2026
E-PAPER
Homeసోపతిఆధునిక కళలు ఎందుకు అర్థం కావు?

ఆధునిక కళలు ఎందుకు అర్థం కావు?

- Advertisement -

ఈనాటి దృశ్యకళా ప్రదర్శనలకు వెళ్లిన ఎంతోమంది దర్శకుల మనసులో మెదులుతుంది ఈ ప్రశ్న. భారతీయ సంప్రదాయ శిల్పాలు, చిత్రాలు మందిరాలలో, మ్యూజియంలలో కనిపిస్తాయి. అవి సులభంగానే అర్థం అవుతాయి. ఈ వ్యత్యాసానికి కారణం ఏమిటి అంటే ఆధునిక కళల వెనుక వున్న కథే కారణం. నదికి వరద వస్తే నీటి ఒరవడికి తీరాలు కోసుకుపోతాయి, రేవులు మారతాయి. బ్రిటిష్‌వారి రాక, వారి పరిపాలనా మనదేశానికి వచ్చిన వరద ఒరవడి. వారు వస్తూ ఆధునికత అనే సిద్ధాంతాన్ని తెచ్చి భారతదేశం అంతా, అన్ని రంగాల మీద పాకించారు.

ఆధునికత అంటే నవ్యత, అభివృద్ధి, పాత విషయాలను వదిలి కొత్త విషయాన్ని ఆహ్వానించడం అని అర్థం చెప్పబడింది. భారతదేశం పాత సంప్రదాయాలుగా చూసి యూరోపియన్ల లేదా పాశ్చాత్యుల సలహా సంప్రదింపులు ఆధునికమని ఆపాదించుకోవడం అని తెలుపబడింది. మనదేశం మాత్రమే కాదు చాలా దేశాలు, ముఖ్యంగా దక్షిణ ఆసియా దేశాలు, తూర్పు దేశాల ఆధునిక కథ ఇదే.
ఆధునికతను వస్తురూపంగా చూడాలంటే, కొత్త రకమైన ప్రయాణ వాహనాలు, ఇంజన్‌తో నడిచే బస్సు, పొలం దున్నే ట్రాక్టర్లు, రైలు, విమానం. కెమెరాతో తీసే ఛాయా చిత్రాలు, పాటలోని రాగంలా జోడించిన ఛాయా చిత్రాల సినిమాలు, టెలిఫోన్‌, టైప్‌ రైటర్‌, మాటలు, పాటలు భద్రపరిచే టేప్‌ రికార్డర్‌, వైద్య రంగంలో ఎక్స్‌రే వంటి పరికరాలు. కొత్త పదార్థాల నుండి ఇంధనశక్తి ఉత్పత్తి, నూనె, పెట్రోల్‌, విద్యుత్‌ వంటి శక్తితో ఇంజన్‌ నడపగలగడం, కొత్త కొత్త కర్మాగాల స్థాపన మరిన్ని వస్తువుల ఉత్పత్తి. కొత్త రకమైన పదార్థాలు స్టీల్‌, సిమెంట్‌ వలన చిన్న చిన్న గుడిసె వంటి ఇళ్లు కాక ఆకాశ హర్మ్యాల ఇళ్లు కట్టగలగటం.
ఆధునికతకు మరో అర్థం వ్యక్తిగతంగా విషయ గ్రహణం పెరగాలి, జ్ఞానవృద్ధి జరగాలి అని కూడా నిర్వచించబడింది. సినిమాలు సమాజానికి కిటికీలై సమాజంలో విషయాలను ప్రజలకు అందించాయి. బస్సు, రైలు ప్రయాణాలు పెంచి ఒక స్థలం గురించి ప్రాంతం గురించి మరో ప్రాంతాల వారికి విషయాలు అందేలా, అర్థం చేసుకునేలా చేశాయి. ఈ మార్పుల వలన వ్యక్తిగత, సామాజిక మార్పులే కాదు, ప్రశ్నలూ తలెత్తాయి. పల్లెలు మారి పట్టణాలైనాయి. పట్టణాలకు వలస వచ్చిన వలస కార్మికుల జీవితాలను, పొగలు కక్కే రైలు, బస్సు, కర్మాగారాలు సమాజానికి బహూకరించిన కాలుష్యానికి జవాబు ఇవ్వలేక పోయింది ఆధునికత.

బ్రిటీష్‌ వారు అన్ని రంగాలతో పాటు దృశ్య కళా రంగంలోనూ మార్పులు తెచ్చి అది ఆధునికతగా నిర్వచించారు. కళలు, ఆపై గతి మార్చి మరో మార్గం పట్టాయి. ఆపై సాంప్రదాయ కళలు, ఆధునికత కళల విభజన మొదలైంది. సుమారుగా ఆ విభజన గురించి చెప్పాలంటే, బ్రిటిష్‌ వారు మన దేశం రాక ముందు వున్న మన కళలని సంప్రదాయక కళలని, బ్రిటిష్‌వారి పాలనా కాలంలో వారి సిద్ధాంతాల ద్వారా నేర్చుకుని చేసిన కళలని ఆధునిక కళలనీ అర్థం చేసుకోవచ్చు. ఆపై బ్రిటిష్‌ వారు మన దేశం వదిలి వెళ్లినాక 60 ల తర్వాత జరిగిన కళలని సమకాలీన కళలుగా అర్థం చేసుకోవచ్చు.
ప్రాంతీయంగా సంప్రదాయ కళలు ప్రతి ప్రాంతానికి వారి చిహ్నంలా దర్శనమిస్తాయి. ఆధునిక కళలు ఒకే రకమైన పంథాలో, ఒకే ఆలోచనా ప్రాతిపదికలా దేశమంతా నేర్పించడం వలన, ఆధునిక కళలు ఒకే దారిలో నడిచినట్టుంటాయి.

పాశ్చాత్య కళల ప్రభావం భారతీయ కళాకారుల కలంలో పనిచేయటం ప్రారంభించింది. బ్రిటిష్‌ వారు చిత్రించే చిత్రం, నిజమనిపించే పద్ధతిన కళలను సృష్టిస్తారు. అది చిత్రం అనిపించదు. దూరం వస్తువులు దూరంలోనూ, దగ్గరి వస్తువులు దగ్గరిలోనూ వున్నట్టు భ్రమకలిగించే పద్ధతిని చిత్రంలో చూపిస్తారు. దీనిని వీరు అకాడమిక్‌ రియలిజం అని పేరు పెట్టారు. భారతీయ సంప్రదాయ ప్రాతిపదిక ఇది కాదు. చూపించదలచుకున్న వివరాలు అన్నీ వివరంగా చూపిస్తారు. నిజానికి యూరోపియన్లు 16వ శతాబ్దంలో మొగలుల కాలంలోనే వారి చిత్రాలను భారతదేశం తీసుకువచ్చినప్పుడు మొగలు కళాకారులు ఈ పద్ధతికి ఆకర్షితులై, వారికి కావలసిన పద్ధతిలో మార్పులు చేర్పులతో ఈ పద్ధతిని కొంత వారి చిత్రాలలోకి తీసుకువచ్చారు.

1757వ సంవత్సరంలో బ్రిటిష్‌వారు ఈస్ట్‌ఇండియా కంపెనీ పేరుమీద బెంగాల్‌లో పాదం మోపాక అప్పటికే అంతర్యుద్ధాల వలన బలహీన పడిన మన దేశం బ్రిటిష్‌ వారి రాజకీయాల వలన రాజులు మరింత బలహీన పడ్డారు. ఆ సమయాన వారి రాజ్యాలు అధికారాలు కాపాడుకోవడటమే కష్టమైన సమయంలో, కళలకు, కళాకారులకు వారిచ్చే మద్దతు తగ్గింది. కళాకారులు కొంతమంది, ఈ రాజకీయాలకు దూరంగా వున్న చిన్న రాజ్యాలకు వెళ్లి పని వెతుక్కున్నారు. మరికొంత మంది బజార్లలో, గుడి మెట్ల వద్దకు చేరి చిత్రాలు వేసి అమ్ముకున్నారు. వీరిని బజారు చిత్రకారులు అన్నారు. కలకత్తా శివార్లలోని కాళీ మందిరం ఘాట్‌ వద్ద చేరిన వారిని కాళీఘాట్‌ చిత్రకారులన్నారు. వీరు కాగితంపై బొమ్మలు వేసేవారు. ఇంగ్లీషు వారి పద్ధతిని వీరు వారికి కావలసిన తీరులో మార్చుకుని బొమ్మలు వేశారు. సామాన్య మానవీయ జీవితాలు, ఇంగ్లీషు వారిపై ఎగతాళి చిత్రాలు, మన సంప్రదాయం వదిలి ఇంగ్లీషు వారిని అనుకరించిన బెంగాలీలపై ఎగతాళి చిత్రాలు, బెంగాలీ దొరబాబు, దొరసాని కథలు, తారకేశ్వర్‌ అనే పూజారి ఖూనీ విషయాలు, ఇలా సామాజిక విషయాలపై చిత్రాలు గీసిన కాళీఘాట్‌ చిత్రకారులు ఒక ప్రత్యేక పరిచయం సంపాదించుకున్నారు. చిత్రాలలోని విషయం వేరే అయినా బీహార్‌లోని మధుబని చిత్రాలు, గుజరాత్‌లోని మాతాజీ పఛేడీ చిత్రాలు, తంజావూరు చిత్రాలు ఈ కోవకు చెందినవే. ఈ విధంగా చూస్తే తెలుగు ప్రాంతాల నిర్మల్‌ కళలు, కొండపల్లి బొమ్మలు, చెరియాల చిత్రాలు ఈ కోవకు చెందినవే. ఇవి సంప్రదాయక జానపద కళా పద్ధతులలో పని చేస్తున్నా, ఈ కళల ఉద్భవం 18,19 శతాబ్దాలలో, రాజుల మద్దతు తగ్గిన సమయంలో వెలువడినవి. నిర్మల్‌ కళలు ఇంకొంచెం ముందుగా మొదలైనా, కోవ ఇదే. కాళహస్తి, మచిలీపట్నం ముద్రణ కళలు అలా మొదలైన ఈ కోవ కళలేను.
ఈ సమయాన్ని కంపెనీ వారు మన దేశం చేరిన సమయంగా కంపెనీ పీరియడ్‌గా గుర్తిస్తే, ఇందు ఒకటి బజారు చిత్రకారులు అనే కోవ ఒకటి, రెండవ రకం భారతీయ రాజుల ఆస్థానాలు చేరిన ఇంగ్లీషు వారి కళలు, కళాకారులు.

తైల వర్ణ చిత్రాలు మన దేశానికి ఆధునిక చిత్రపద్ధతిగా బ్రిటిష్‌ వారు పరిచయం చేశారు. రాజులకు, ధనవంతులకు బహుమానంగా ఈ చిత్రాలను తీసుకు వచ్చారు. కొంతమంది ఇంగ్లీషు కళాకారులని మన రాజుల ఆస్థానాలలో, ఆస్థాన చిత్రకారులుగా ప్రవేశపెట్టారు. అక్కడ పనిదొరకని చిత్రకారులు మనదేశం చేరనారంభించారు. గవర్నర్‌ జెనరల్‌ వారంట్‌ హేస్టింగ్స్‌, కళాకారులు జాన్‌ జోఫనీ, టెల్లీకెటిల్‌, ఓజియాన్‌ హంఫరీ, చార్లస్‌ స్మిత్‌, ఫ్రాన్సిస్కో రీనాల్డి లాంటి వారిని వేరువేరు ఆస్థానాలలో ప్రవేశపెట్టాడు. ఆనాడు వీరి తైలవర్ణ చిత్రాలు అంతగా మన రాజులకు నచ్చక పోయినా బ్రిటీష్‌ వారి మెప్పుకోసం వారి దర్బారులలో ఈ చిత్రాలు పెట్టనారంభించారు. ఇది 1800 సంవత్సరపు ముందు మాట. తినగ తినగ వేము తియ్యనుండు అన్నట్లు 1850 నాటి యూరోపియన్‌ కళలపై ఇక్కడ ఆసక్తి, రుచి పెంచారు బ్రిటిష్‌వారు.
ఈ కంపెనీ పీరియడ్‌లో జరిగిన మూడవ రకం కళలు కంపెనీ చిత్రాలు. ఆ సమయాన ఇక్కడికి వచ్చిన ఇంగ్లీషు ఆఫీసర్లు వెనక్కి వెళ్తూ ఇక్కడి జన జీవన విషయాలు, ప్రకృతి, కట్టడాలు నిర్మాణాలను నీటి రంగు చిత్రాలుగా గీయించి తమ దేశం తీసుకుపోయేవారు. ఇక్కడి విషయాలు అక్కడివారికి చూపడం కోసం, లేదా ఈ చిత్రాలు బహుకరించడం కోసం. ఆ చిత్రాలు వేసే బ్రిటిష్‌ కళాకారులకు సహాయం చేయడం కోసం ఇక్కడి కళాకారులకు వారి కళలు నేర్పించారు. ఈ పనిలో చేరిన వారిని కంపెనీ చిత్రకారులుగా పిలువబడ్డారు.

ఇలా అంతటా వారి కళలు పరిచయం చేసి మనదేశంలో కళా పాఠశాలలు పెట్టే వేదిక తయారు చేశారు. బ్రిటిష్‌ వారు భారతీయులకు మంచి కళలు, కళాభిరుచి పెంచాలి అని, అది వారి బాధ్యతగా పరిగణించుకున్నారు. వారి వుద్దేశ్యం ప్రకారం భారతీయ సంప్రదాయ కళలు, సరైన కళలు కావని. కళ అంటే శాస్త్రీయంగా, లెక్కగట్టినట్టు చిత్రం, శిల్పం చేస్తేనే అది ఫైన్‌ ఆర్ట్‌ అని, అవి నేర్పితే, వారి ప్రతి చర్యలోనూ ఆలోచనా పూర్వకంగా పనులు చేసే అలవాటవుతుందనీ జ్ఞానవృద్ధి అవుతుందనీ వారి వుద్దేశ్యం. అలాగే భారతీయులకు, బ్రిటిష్‌ వారి పద్ధతిలో మర్యాద పూర్వక ప్రవర్తన ఉన్నతమైనదనీ, అది కూడా నేర్పాలనుకున్నారు.
బ్రిటిష్‌ వారు వారి సామ్రాజ్య పథకాల ప్రకారం 1850 తరువాత వారి కళా పద్ధతులు నేర్పే కళాపాఠశాలలు నెలకొల్ప మొదలుపెట్టారు. కళా పాఠశాలలు పెట్టటం, శాస్త్రీయంగా కళలు నేర్పటం జరుగుతుందనీ హెర్‌బర్ట్‌ స్పెన్సర్‌ ప్రకటించాడు. 1854లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఈ పాఠశాలల ప్రకటన ఇచ్చింది. 1877లో విక్టోరియా రాణి భారతదేశానికి మహారాణిగా వచ్చింది. ఈ సందర్భాన భారతీయులకు ఆధునికత నేర్పాలనే ఆలోచనని మరింత పటిష్టం చేసుకున్నారు బ్రిటిష్‌వారు. ప్రాచీన భారతీయ పద్ధతులు, వాటి విలువలు, ఆధునిక ఆలోచనల మధ్య మన కళారంగంలో అంతర్యుద్ధం మొదలైంది. ఆధునిక ప్రేమికులు పాశ్చాత్య వాయువుల కోసం భారతీయ కిటికీలను తెరిచారు. బ్రిటిష్‌వారి కళా పద్ధతులను ఆదరించాలా, లేదా అనే విషయంపై కళా ప్రపంచం ఊగిసలాడింది.
బ్రిటిష్‌ వారి సామ్రాజ్య పథకాల ప్రకారం నిర్మించిన ఆర్ట్‌ స్కూళ్ల కంటె ముందరే 1798లో పూణెలో రెసిడెంట్‌ సర్‌ చార్ల్స్‌ మాలె ఒక పాఠశాల నిర్మించాడు. వచ్చేపోయే బ్రిటిష్‌ కళాకారుల సాయం కోసం, ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నట్టు, కంపెనీ కళాకారులను తయారు చేసింది ఈ స్కూలు. 1830, 1839లో కలకత్తాలో మెకానిక్స్‌ సంస్థ నిర్మాణం చేసి, ప్రదర్శనలు బోధనల ద్వారా బెంగాలీలను ప్రోత్సహించారు బ్రిటిష్‌ ఆఫీసర్లు.

బ్రిటిష్‌ వారి సామ్రాజ్య పథకాల ప్రకారం నెలకొల్పిన మొదటి ఆర్ట్‌ స్కూల్‌ 1850లో మద్రాసులో తెరవబడింది. అలెగ్జాండర్‌ హంటర్‌ అనే ఒక బ్రిటిష్‌ డాక్టర్‌ తన ఖర్చుపై ఈ పాఠశాల నడిపాడు. 1854లో కలకత్తాలో ఇండిస్టియల్‌ కళలకు ప్రాముఖ్యత పెంచే వుద్దేశ్యంతో ఆర్ట్‌ స్కూల్‌ స్థాపించారు. 1856లో జెమ్‌షట్‌జీ జీజీభారు అనే వ్యాపారవేత్త బొంబాయిలో ఆర్ట్‌ స్కూల్‌ నిర్మించారు. ఈ స్కూళ్లలో నేర్పిన పాశ్చాత్య పద్ధతి చిత్రకళ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ముందు ఈ స్కూళ్లు వ్యక్తిగత ఖర్చులపై నడిపినా, ఆపై కలకత్తా, బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీలైన బ్రిటిష్‌ వారి ఆధీనంలోకి తీసుకోబడ్డాయి.
వింత ఏమిటంటే బ్రిటిష్‌ ఆధునిక కళాబోధన ఆలోచనలలో బేధాభిప్రాయాలు వచ్చాయి. 1851లో విజయవంతమైన ఒక ఇండిస్టియల్‌ ప్రదర్శన జరిగింది. ఆ విజయానికి కారణం భారతీయ కళలు. కొంతమంది బ్రిటిష్‌ వారి లెక్కప్రకారం ఇక్కడివారికి ఆధునిక కళలు అని ఫైన్‌ ఆర్ట్‌ నేర్పటం కంటే, ఇండిస్టియల్‌ డిజైన్‌ జోడించి మంచి పనితనం నేర్పాలి అని, అందువలన మంచి అలంకరణ వస్తువులు తయారు చేయవచ్చని భావించారు. హెన్రీకోలె, ఓవెన్‌ జోన్స్‌, విలియమ్‌ మోరిస్‌, జార్జ్‌ బర్ట్‌వుడ్‌, బ్రిటిష్‌ పద్ధతిన భారతీయులకు కళలు నేర్పి వారిని చెడగొట్టవద్దు, కర్మాగార డిజైన్లు నేర్పమని మద్దతు పలికారు.
దక్షిణ కెనింగ్స్‌టన్‌ (తరువాత ఇదే రాయల్‌ కాలేజీ అఫ్‌ ఆర్ట్‌ లండన్‌గా పేరు మార్చారు), వారి పాఠ్యాంశాలే ఇక్కడి ఆర్ట్‌ స్కూళ్లలో అమలు పరిచారు. అలంకార చిత్రం నేర్పటానికి ఇక్కడికి లాక్‌ వుడ్‌ కిప్లింగ్‌ మరియు జాన్‌ గ్రిఫిత్‌ వచ్చారు. 1880లో కిప్లింగ్‌ లాహోర్‌ మయో ఆర్ట్‌ కాలేజీకి బోధకుడిగా చేరాడు. 1886లో ఆయన ది జర్నల్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆర్ట్‌ మరియు ఇండిస్టీ అనే పత్రిక స్థాపించాడు. అందులో ప్రాధమిక డ్రాయింగ్‌, రంగులు దిద్దడం వంటి వ్యాసాలు మొదలయ్యాయి. వారు నేర్పే పాఠాలు, కళాభివృద్ధి ప్రజలకు తెలపాలనేది ఉద్దేశ్యం. ఈ ఆర్ట్‌ స్కూళ్లు ముందర స్థపతి, చిత్రకారుల కోసం నిర్మించినా, కొంతకాలం గడిచి, మధ్యతరగతి, అగ్ర తరగతి కుటుంబాల పిల్లలూ ఈ స్కూళ్లలో చేరి వారి ఆధునిక కళలు నేర్చుకున్నారు. జాన్‌గ్రిఫిత్‌ 1896లో అజంతా కుడ్య చిత్రాల గురించి చేసిన పరిశోధన అతనికి పేరు తెచ్చిపెట్టింది.

ఇ.బి.హవేల్‌ 1896లో కోల్‌కత్తా ఆర్ట్‌ స్కూల్‌కి అద్యక్షుడిగా వచ్చినప్పుడు, పాఠ్యాంశాల పద్ధతిలో అతనికి అవకతవకలు కన్పించాయి. 1910లో రాయల్‌ కాలేజ్‌, లండన్‌లో తన అభిప్రాయం వెలిబుచ్చాడు. భారతీయ కళలని తక్కువగా చూపి వారిపై అనవసర పద్ధతులు రుద్దబడ్డాయి అన్నాడు.
ఆర్ట్‌ స్కూల్లో చదివిన కళాకారులకు డ్రాయింగ్‌ అధ్యాపకులుగా, ప్రభుత్వ యంత్రాంగంలో ఉద్యోగాలు ఇవ్వబడ్డాయి. కొంతమంది కళాకారులు వ్యక్తిగత ప్రదర్శనలు చేసుకుంటూ జీవనాధారం వెతుకున్నారు. అయినా ఇంగ్లీషు వారు ఇక్కడి కళాకారుల కళలని స్థానికుల కళలని పిలిచారు. వీరికి మంచి కళలు నేర్పాలి అనే పాట ఒదలక పాడారు. వారి బలవంతం భారతీయ కళాకారులని విసిగించింది.
భారతీయుల కళలకు స్థానిక జమీందారులు బహుమతులిచ్చి ప్రోత్సాహపరిచేవారు. తైలవర్ణంలో వేసే పోట్రేటు చిత్రాలు ఎక్కువ ఆదరణ పొందాయి. జమిందారులు, ధనికులు, తైలవర్ణ పోట్రేటు గీయించుకోవటం మొదలు పెట్టారు. ఇక్కడ ఇది కొత్తమాధ్యమం. నిజమనిపించేటట్టు చిత్రం గీయటం ఇంగ్లీషు వారు నేర్పిన పద్ధతి. ఇక్కడ ఈ పద్ధతిన పోట్రేటులు ఆదరణ పొందితే, ఇంగ్లీషు వారికి ఇది అనుభవించి పాతబడింది. ఆనాటికి ఫొటోగ్రపీ వచ్చి వారు ఫొటో పోట్రేటులపై మోజు చూపారు.
ముందు ఆర్ట్‌ స్కూళ్లలో యూరోపియన్ల బోధనలతో మొదలైనా భారతీయులు, ఈ స్కూళ్లలో ఉత్తీర్ణులై వారు ఉపాధ్యాయులుగా చేరారు. కొంతమంది యూరప్‌ కూడా వెళ్లి మరింత మెళకువలు నేర్చుకుని వచ్చి ఇక్కడ ప్రదర్శనలిచ్చారు. వీరు భారతీయ ఆధునిక కళల ప్రయాణంలో మరో మెట్టు అయ్యారు.

డా||యమ్‌.బాలామణి, 8106713356

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -