Saturday, July 4, 2026
E-PAPER
Homeఖమ్మంబేతుపల్లి రీ-సర్వే ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలి

బేతుపల్లి రీ-సర్వే ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలి

- Advertisement -

– ప్రతి రైతుకు పూర్తి అవగాహన కల్పించి రీ- సర్వే చేయాలి
– ప్రభుత్వ భూములు, రహదారులు, ప్రజా స్థలాల వివరాలు కోఆర్డినేట్లతో నమోదు చేయాలి
– జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ 
నవతెలంగాణ-సత్తుపల్లి : బేతుపల్లి రీ-సర్వే ప్రక్రియను ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు కచ్చితమైన భూ రికార్డుల తయారీ లక్ష్యంగా బేతుపల్లి గ్రామంలో చేపట్టిన రీ-సర్వే ప్రక్రియను శుక్రవారం జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  దివాకర టీఎస్ మాట్లాడుతూ… బేతుపల్లి గ్రామంలో భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా రీ-సర్వే చేపడుతున్నామన్నారు. ప్రతి రైతుకు రీ-సర్వే ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించి, వారి సమక్షంలోనే పారదర్శకంగా సర్వే నిర్వహించాలని సూచించారు. రీ-సర్వే ద్వారా భూముల విస్తీర్ణాలు, హద్దులు, యాజమాన్య వివరాలను శాస్త్రీయ పద్ధతిలో నమోదు చేసి భూ రికార్డులను ఆధునికీకరించనున్నట్లు తెలిపారు.

రీ-సర్వే నిర్వహణ కోసం గ్రామంలో పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి బృందంలో ఒక సర్వేయర్‌తో పాటు ఇద్దరు జీపీవోలు పనిచేస్తారని చెప్పారు. రైతు వేదికను కేంద్రంగా ఉపయోగించుకుని అక్కడే కంప్యూటర్ వ్యవస్థ ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలను వెంటనే డేటా ఎంట్రీ చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) ప్రకారం ప్రతి దశను కచ్చితంగా అమలు చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనలను పాటించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రామంలోని ప్రభుత్వ భూములు, రహదారులు, చెరువులు, కాలువలు, ప్రజా స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను కో-ఆర్డినేట్లతో సహా స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వ భూములకు సంబంధించి పంచనామాలు నిర్వహించి కచ్చితమైన రికార్డులు సిద్ధం చేయాలని తెలిపారు.

ప్రతి బృందం రోజుకు 50 నుంచి 60 ఎకరాల వరకు రీ- సర్వే పూర్తి చేయాలని, పది బృందాలు కలిసి రోజుకు సుమారు 500 నుంచి 600 ఎకరాల వరకు సర్వే నిర్వహించేలా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ సూచించారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించి, రైతుల సమక్షంలో భూ వివరాలను నమోదు చేయాలని తెలిపారు. ప్రతి రైతు పేరు, భూ విస్తీర్ణం, సరిహద్దులు, ఇతర వివరాలను కచ్చితంగా నమోదు చేయడంతో పాటు ప్రతిరోజూ సర్వే పురోగతిపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. సర్వే పూర్తయ్యే వరకు డేటా ఎంట్రీ, డిజిటల్ మ్యాప్ తయారీ ప్రక్రియ కూడా సమాంతరంగా కొనసాగాలని స్పష్టం చేశారు.

రీ-సర్వే వల్ల ఏ రైతు తన భూమి విస్తీర్ణాన్ని కోల్పోయే పరిస్థితి ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పూర్తిగా శాస్త్రీయ విధానంలో పారదర్శకంగా జరుగుతుందని, రైతులు అపోహలకు గురికావద్దని సూచించారు. గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, రెవెన్యూ గ్రామ పరిధిలోని ప్రతి రైతును గ్రామ సభలకు ఆహ్వానించి వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకోవాలని అధికారులకు సూచించారు.

క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి వివాదాలకు తావులేకుండా రీ-సర్వేను విజయవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. ఈ పరిశీలనలో సత్తుపల్లి తహసీల్దారు పున్నం సత్యనారాయణ,  తిరుమలాయపాలెం తహసీల్దార్ విల్సన్, సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -