నవతెలంగాణ-సత్తుపల్లి : సత్తుపల్లిలోని సింగరేణి సత్తుపల్లి ఏరియా జీఎం కార్యాలయం ముందు ఆ సంస్థలో పనిచేస్తున్న అధికారులు కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఓఏఐ) ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు శుక్రవారంతో ఐదో రోజుకు చేరాయి.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పీఆర్‌పీ (పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే) విడుదల, అర్హులైన అధికారులందరికీ తక్షణమే పే అప్‌గ్రేడేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అధికారులు ఈ నిరసనను ఉధృతం చేశారు. ఐదో రోజు దీక్షలో అడిషనల్ మేనేజర్ గోపీ కిషోర్, డిప్యూటీ మేనేజర్ నూకరాజు, సీనియర్ ఇంజనీర్ (సివిల్) రవికుమార్ కూర్చోగా, తోటి ఉద్యోగులు పూలమాలలు వేసి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. సంస్థను లాభాల బాటలో నడిపిస్తున్న అధికారుల పట్ల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని వీడనాడి తమ డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని సీఎంఓఏఐ నాయకులు సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించారు.



