నవతెలంగాణ-హైదరాబాద్ : ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియల్లో భారత ప్రభుత్వం తరఫున ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం పాల్గొని నివాళులర్పించింది. టెహ్రాన్‌లో జరుగుతున్న ఈ వీడ్కోలు కార్యక్రమాల్లో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటా, బిహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్ (రిటైర్డ్) పాల్గొని భారత్ తరఫున నివాళులు అర్పించారు. భారత ప్రభుత్వం, దేశ ప్రజల తరఫున తమ సంతాపాన్ని, గౌరవాన్ని తెలియజేసినట్లు కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు.
అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అంత్యక్రియలకు భారత్ తరఫున ఉన్నత స్థాయి ప్రతినిధులు హాజరుకావడం గమనార్హం. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ బంధాన్ని, ప్రజా సంబంధాల ప్రాధాన్యతను ఈ పర్యటన తెలియజేస్తుందని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇరు దేశాల రాజకీయ, ఆర్థిక బంధాలకు ఈ సంబంధాలే బలమైన పునాది అని స్పష్టం చేసింది.
శని, ఆదివారాల్లో (4-5) టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేని మొసల్లా ప్రార్థనా మందిరంలో ఖమేనీ వీడ్కోలు కార్యక్రమాలు జరగనున్నాయి. అనంతరం 6న టెహ్రాన్‌లో, 7న ఖోమ్ నగరంలో అంత్యక్రియల ఊరేగింపులు నిర్వహిస్తారు. చివరగా 9న మషద్‌లోని ఇమామ్ రెజా పవిత్ర క్షేత్రంలో అంతిమ సంస్కారాలు, ఖనన ప్రక్రియ పూర్తి కానున్నాయి.



