ఇప్పటి వరకు 2595 శవాలు గుర్తింపు
పెరుగుతున్న మృతుల సంఖ్య
ఎంతమంది చనిపోయారన్న దానిపై అస్పష్టత
నెమ్మదించిన శిధిలాల వెలికితీత ప్రక్రియ
కార్కస్ : వెనిజులాలో సంభవించిన ఘోరమైన జంట భూకంపాల తర్వాత ఒక వారం గడిచినా ఆ దేశం షాక్ నుంచి ఇప్పటికీ తేరుకోలేదు. అధికారిక మృతుల సంఖ్య, అనధికార రిపోర్టుల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోందని చర్చ నడుస్తోంది. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ గురువారం మాట్లాడుతూ ఈ భూకంపాలలో కనీసం 2,595 మంది మరణించారని, ఇది ముందు రోజు నివేదిక కంటే 300 ఎక్కువ అని తెలిపారు.
తక్కువగా మృతుల సంఖ్య ప్రకటన
ఒక ఫోరెన్సిక్ పాథాలజిస్ట్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన మృతుల సంఖ్య చాలా తక్కువని, అది వాస్తవంగా ఉన్నదానిలో మూడో వంతు కూడా కాదని తాను నమ్ముతున్నట్టు తెలిపారు. భూకంపాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న లా గువైరా ఓడరేవు నగరంలో తాను పనిచేస్తున్న తాత్కాలిక శవగారంలో రోజుకు సుమారు 400 మృతదేహాలను ప్రాసెస్ చేస్తున్నారని, వాటిలో చాలా వరకు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయాయని, బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయని పాథాలజిస్ట్ చెప్పారు. శీతలీకరించిన ట్రక్కులలో ఇక స్థలం లేకపోవడంతో, వారు మృతదేహాల సంచులను బయట ఎండలో ఉంచవలసి వస్తోంది. అక్కడ అవి త్వరగా కుళ్లిపోతున్నాయి. కూలిపోయిన ఎత్తైన భవనాల శిథిలాల కింద ఇంకా చాలా మంది కనబడకుండా ఉన్నారు. మృతుల పూర్తి వివరాలు వెలువడటానికి కొంత సమయం పట్టవచ్చని అధికారులు చెప్తున్నారు. వెనిజులా ప్రభుత్వం తమ గణనను ఎలా నిర్వహిస్తుందో, భూకంపాల అనంతర పరిణామాలలో ఎంతమంది గల్లంతైన వారిగా పరిగణించబడుతున్నారో అస్పష్ట సమాధానమే వినిపిస్తోంది.
మృతదేహాలను వెలికి తీస్తున్న కుటుంబసభ్యులు
కుటుంబసభ్యులు తామే స్వయంగా శిథిలాల నుంచి తమవారి మృతదేహాలను తీసుకొస్తున్న పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. ‘‘పౌర రక్షణ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, చివరికి అత్యవసర సేవల సిబ్బంది కూడా ఆ మృతదేహాలను వెలికితీయలేకపోతున్నారు. అందుకే వారే స్వయంగా తమ మృతులను తీసుకువస్తున్నారు’’ అని సదరు ఫోరెన్సిక్ పాథాలజిస్ట్ అన్నారు. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నా, శ్మశానవాటికలు నిండిపోతున్నాయని స్థానికులు చెబుతున్నా, ఎవరినీ సామూహిక సమాధిలో పూడ్చిపెట్టబోమని రోడ్రిగ్జ్ నొక్కి చెబుతున్నారు.
మృతుల సంఖ్య పదివేలకు పైనే?
ఈ ప్రకృతి విళయంలో పదివేల మందికి పైగా మరణించి ఉండవచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రాథమిక అంచనాలు తెలిపాయి. వెనిజులా ప్రభుత్వం రోజువారీ మృతుల సంఖ్య వివరాలు మినహా, మృతుల తుది సంఖ్యపై తన సొంత అంచనాను అందించలేదు. ఇప్పటికే నివేదించిన దానికంటే ఎక్కువ సంఖ్యనే తాము కచ్చితంగా భావిస్తున్నామని వెనిజులాకు ఐక్యరాజ్యసమితి సమన్వయకర్త అయిన గియాన్లూకా రాంపొల్లా డెల్ టిండారో చెప్పారు. వెనిజులా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా భూకంప మృతుల సంఖ్యను తక్కువగా చూపడానికి ప్రయత్నిస్తోందనడానికి ఈ అధికారిక సంఖ్యే సాక్ష్యమని విమర్శకులు భావిస్తున్నారు. భూకంపాల సమయంలో అత్యంత ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల సంఖ్యను అంచనా వేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. డెల్సీ రోడ్రిగ్జ్ సోదరుడైన జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగ్జ్ మాట్లాడుతూ.. లా గువైరా రాష్ట్రంలో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సుమారు 30,000 మంది ఉన్నారని, వారిలో దాదాపు 20,000 మంది తప్పించుకన్నారనీ, మరికొందరు రక్షించబడ్డారని చెప్పారు.



