నవతెలంగాణ – డిచ్ పల్లి
పేదలు సన్నబియ్యం తింటే బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలకు కడుపు ఉబ్బుతుందని, రాష్ట్రంలో నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం దేనికని, బీజేపీ, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం కరెంట్ కట్ చేస్తే మేము ఉచితంగా కరెంటు ఇస్తున్నామని, మేనిఫెస్టో లో లేని హామీలను అమలు చేస్తున్నామని, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీ రాజ్ గిరిజన మహిళ శిశు సంక్షేమ మంత్రి ధన సూరి సీతక్క, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి పేర్కొన్నారు.శనివారం ఇందల్ వాయి మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూపతి రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు పూర్తయిన భవనాలను ప్రారంభించారు.ముందుగా ఇందల్వాయి టోల్ గెట్ వద్ద మంత్రిని సాదరంగా స్వాగతం పలికారు. తదనంతరం ఇందల్ వాయి మండలంలోని వెంగల్‌పాడ్ తాండా వద్ద డిచ్ పల్లి మండలంలోని రాంపూర్ డి తాండా నుండి–వెంగల్‌పాడ్ తాండా వరకు, కేకే తాండా నుండి–మేఘ్యా నాయక్ తాండా వరకు మధ్య బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి సీతక్క, ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి. భూపతి రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం తిర్మన్‌పల్లి గ్రామంలో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించిన తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల జూనియర్ కళాశాల నూతన భవనాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రమే కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో లేని అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తోందన్నారు. మహిళలను గౌరవించే, అక్కా చెల్లెమ్మలకు అండగా నిలిచే నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. ప్రజల మన్ననలు పొందిన ప్రజా నాయకుడిగా ఆయన తెలంగాణను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం రూ.21 వేల కోట్ల రుణమాఫీ అమలు చేసిందని, పేద కుటుంబాలకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తోందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడగా, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తోందని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో వ్యవహరించకుండా చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాయని మంత్రి విమర్శించారు. అధికారం కోల్పోయిన అక్కసుతో బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని, బీజేపీ మతం, కులం పేరుతో సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో, కేంద్రంలో 12 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు ఏం ఒరిగిందో చెప్పాలని ప్రశ్నించారు.
నిరుద్యోగులను అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం బాధ్యతా రాహిత్యమని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా మహాత్ముడిని అవమానించారని, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధుల్లో కోతలు విధించి రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపుతోందని విమర్శించారు.ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రోడ్లు, విద్య, గిరిజన సంక్షేమం, మౌలిక వసతుల కల్పనలో వరుసగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తే ప్రజలు స్వాగతిస్తారని, కానీ తప్పుడు ప్రచారాలు, రాజకీయ దుష్ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ప్రజలే తిప్పికొడతారని మంత్రి సీతక్క, ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి స్పష్టం చేశారు.అంతకు ముందు వెంగళ్ పాహడ్ సర్పంచ్ లావుడ్య మేన గంగాధర్,ఉప సర్పంచ్ మహిపాల్ నాయక్, కేకే తాండ సర్పంచ్ లక్ష్మీ వెంకట్రాం, తిర్మన్ పల్లి సర్పంచ్ చింతల కిషన్ లో ఆధ్వర్యంలో గ్రామాలలో నెలకోని ఉన్న సమస్యల పరిష్కారానికి నిధులను మంజూరు చేయాలని మంత్రి సీతక్కకు సమస్య లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రి సీతక్క, ఎమ్మెల్యే భూపతి రెడ్డికి పూలతో ఘన స్వాగతం పలికారు.తిర్మన్ పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మంత్రి కి ఎమ్మెల్యేకి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా బంజారా పాటల పై విద్యార్థినులతో కలిసి మంత్రి సీతక్క బంజారా జానపద గీతాలకు నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి,రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయ రెడ్డి, తారాచంద్ నాయక్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు సుదర్శన్ సుధర్, ప్రధాన కార్యదర్శి పడాల రోహిత్ గౌడ్, పాల్త్యా రాజు,ఇందల్ వాయి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచ్ చింతల కిషన్, కారణం గుండ సుజాత శ్రీనివాస్, లోకాని గంగామణి గంగారం, డిచ్ పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబర్ సింగ్ నాయక్, బల్ రాం నాయక్,లారి గంగారెడ్డి , వెంకట్ రెడ్డి, రాంచందర్ గౌడ్, సర్పంచులు,నియోజకవర్గ, జిల్లా నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల జిల్లా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.



