Saturday, July 4, 2026
E-PAPER
Homeఖమ్మంసత్తుపల్లిలో భారీస్థాయిలో 'గంజాయి' పట్టివేత

సత్తుపల్లిలో భారీస్థాయిలో ‘గంజాయి’ పట్టివేత

- Advertisement -

– రూ. 89 లక్షల విలువైన 166 కేజీల మరిజువానా (భాంగ్) స్వాధీనం
– ​ఒడిశా నుంచి హైదరాబాద్ కారులో తరలిస్తుండగా పట్టుకున్న ‘ఈగల్’ టీమ్
– ఒకరి అరెస్ట్, ఇద్దరి కోసం వేట
నవతెలంగాణ – సత్తుపల్లి 
: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గంజాయి రహిత సమాజ స్థాపనకు సత్తుపల్లి పోలీసులు విశేష కృషి చేస్తున్నారు. మాదకద్రవ్యాలు, గంజాయి, మత్తు పదార్థాలను నిరోధించేందుకు సత్తుపల్లి పోలీసులు పూర్తిస్థాయిలో నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే ఒడిశా నుండి హైదరాబాద్‌కు గుట్టుచప్పుడు కాకుండా కారులో తరలిస్తున్న సుమారు 166 కేజీల 360 గ్రాముల గంజాయిని పోలీసులు శనివారం కాపుకాసి మరీ పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ మార్కెట్లో సుమారు రూ. 89 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. పట్టుబడిన గంజాయి నిందితుల వివరాలను సీఐ తుమ్మలపల్లి శ్రీహరి ఈ క్రింది విధంగా వివరించారు.
నమ్మదగిన సమాచారంతో రంగంలోకి ‘ఈగల్’ టీమ్
​ఒడిశా రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు కారులో భారీగా గంజాయి రవాణా అవుతోందనే పక్కా సమాచారం సత్తుపల్లి సీఐ  తుమ్మలపల్లి శ్రీహరికి అందింది. దీంతో సత్తుపల్లి ఏసీపీ వసుంధర యాదవ్ ఫారెబి క్షేత్రస్థాయి పర్యవేక్షణలో సత్తుపల్లి పోలీసులు, ప్రత్యేక ‘ఈగల్’ టీమ్, స్టేషన్ సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా నిఘా పెట్టి వాహన తనిఖీలను విస్తృతంగా చేపట్టారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా వచ్చిన ఒక టయోటా ఎటియోస్ కారును ఆపి తనిఖీ చేయగా అసలు రంగు బయటపడింది.
గంజాయి కేసులో నిందితుల వివరాలు ఇలా…
​గుంతవాడ, దొరగుడా, మల్కాన్ గిరి జిల్లా, ఒడిశాకు చెందిన ప్రబిన్ భాత్రా పట్టుపడగా ఇదే రాష్ట్రానికి చెందిన బికారి అలియాస్ రోహన్​, కర్నూలు జిల్లా నంద్యాల మండలం బేతంచర్లకు చెందిన చుక్క నాగేశ్వరరావు పరారీలో ఉన్నారు. 166 కేజీల 360 గ్రాముల గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన టయోటా ఎటియోస్ కారు, ఒక సెల్ ఫోన్, రూ. 500 నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో గంజాయిని తరలిస్తున్న నిందితుడు ప్రబిన్ భాత్రా నేరాన్ని అంగీకరించాడు. ఈ అక్రమ రవాణాపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల కళ్లు కప్పడానికి…  ‘గ్రీన్ ఫీల్డ్’ రూట్ డైవర్షన్ మార్చి

​ఒడిశాకు చెందిన ప్రధాన నిందితుడు బికారి అలియాస్ రోహన్, ప్రబిన్ భాత్రాకు రూ. 10వేలు ఆశచూపి ఈ  గంజాయిని హైదరాబాద్‌లోని ఒక వ్యక్తికి అందజేయాలని పురమాయించాడు. ఎటియోస్ కారు డిక్కీలో 6 ప్లాస్టిక్ సంచులలో 80 గంజాయి ప్యాకెట్లను అమర్చి ఇచ్చాడు. ​దీంతో ప్రబిన్ భాత్రా ఈనెల 3వ తేదీ,  తెల్లవారుజామున 4:00 గంటలకు ఒడిశా సరిహద్దులోని దారకొండ జంక్షన్ నుంచి బయలుదేరి రాజమండ్రి చేరుకున్నాడు. అక్కడ నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే మీదుగా ప్రయాణిస్తున్న క్రమంలో హైవేపై పోలీసు తనిఖీలు తీవ్రంగా ఉంటాయనే భయంతో వేంసూరు మండలం లింగపాలెం వద్ద హైవే దిగాడు. సత్తుపల్లిలో భోజనం చేసి, ఆపై సత్తుపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లాలని ప్లాన్ మార్చాడు. అయితే అప్పటికే పక్కా సమాచారంతో నిఘా ఉంచిన సత్తుపల్లి పోలీసులు గంజాయి రవాణా నిందితుడి ఆట కట్టించారు.

​ఈ కేసులో పట్టుబడిన A-1 నిందితుడు ప్రబిన్ భాత్రాను శనివారం రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మిగతా నిందితులు A-2 (బికారి), A-3 (నాగేశ్వరరావు)లను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. ఈ  ఆపరేషన్‌లో సీఐ తుమ్మలపల్లి శ్రీహరితో పాటు ఎస్సైలు వీర ప్రసాద్, ప్రదీప్, ఈగల్ టీమ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ప్రతిభ కనబరిచారు.

​గంజాయి అమ్మినా, తాగినా పీడీ యాక్ట్ : సీఐ తుమ్మలపల్లి శ్రీహరి 

​ప్రభుత్వం గంజాయి నిర్మూలనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఎవరైనా గంజాయి కొనుగోలు చేసినా, విక్రయించినా, లేదా వినియోగించినా (పీల్చినా) వారిపై కఠినమైన పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని సీఐ తుమ్మలపల్లి శ్రీహరి హెచ్చరించారు. గంజాయి రవాణా,  విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసినా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడమే కాకుండా, వారికి రివార్డులు కూడా అందజేస్తామని సీఐ శ్రీహరి ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -