– మూడు రోజులుగా అత్యంత వైభవంగా జరిగిన మహోత్సవాలు
నవతెలంగాణ – బీబీపేట్ : బీబీపేట మండలంలోని జనగామ గ్రామంలో రాజగోని శేఖర్ గౌడ్ , ముత్యాలమ్మ ఊరడమ్మ, గుడులు శిథిలావస్థకు చేరడంతో వాటిని నూతనంగా నిర్మించి గుండేటి మహేష్ భగ్గవ పంతులు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ ముత్యాలమ్మ, ఊరడమ్మ ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు మూడు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించి శనివారం వైభవంగా ముగిశాయి. జూలై 2న గణపతి పూజ, గోపూజ, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, నవగ్రహ వాస్తు సర్వతోభద్ర మండల పూజలు, రక్షాబంధనం, జలాధివాసం, బలిహరణం తదితర కార్యక్రమాలు వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. జూలై 3న సుప్రభాత సేవ, గణపతి పూజ, అవాహిత దేవతల పూజలు, వివిధ హోమాలు, యంత్ర స్థాపన, విగ్రహ ప్రతిష్ఠాపన, నేత్రోన్మీలనం, దిక్కు కుంభాభిషేకం, మహానైవేద్యం, పండిత సత్కారం, మహా ఆశీర్వచనం, తీర్థప్రసాదాల పంపిణీ, సాయంత్రం శ్రీ ముత్యాలమ్మ, ఊరడమ్మ తల్లుల ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
శనివారం ఉదయం సుప్రభాత సేవ అనంతరం మహా పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం, మహా అభిషేకం, మహా నైవేద్యం, తీర్థప్రసాదాల పంపిణీ నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ (అన్నదానం) కార్యక్రమాన్ని నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ మహోత్సవాల్లో గ్రామ ప్రజలు, భక్తులు, ప్రజాప్రతినిధులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.



