– సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి
– సత్తుపల్లిలో దొడ్డి కొమరయ్య వర్ధంతి
నవతెలంగాణ – సత్తుపల్లి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య అని సీపీఐ(ఎం) సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి అన్నారు. స్థానిక రావి వీర వెంకయ్య (ప్రజాసంఘాల) భవనంలో ఆ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి వేడుకను ఘనంగా జరిపారు. కొమరయ్య చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన వర్ధంతి కార్యక్రమంలో సత్యనారాయణరెడ్డి మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలనకు, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కొమరయ్య చేసిన పోరాటం అజరామరమని ఆయన తెలిపారు. వెట్టిచాకిరి విముక్తి కోసం, రైతాంగ హక్కుల కోసం ప్రాణాలర్పించిన కొమరయ్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.
సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన సాగించిన ఉద్యమం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పారు. అమరవీరుల ఆశయాల సాధన కోసం, ప్రజల హక్కుల రక్షణ కోసం నిరంతరం ఉద్యమించాలని శీలం పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ దొడ్డి కొమరయ్య త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, ప్రజా సంఘాల నాయకులు, రావుల రాజబాబు, మోరంపూడి వెంకట్రావు, చావా రమేష్ పాల్గొన్నారు.



