– రోగులకు నమ్మకం కలిగించలేని వైద్యులు
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం డి జబ్బార్
నవతెలంగాణ – వనపర్తి
వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పర్యవేక్షణ అధికారి, వైద్యుల పర్యవేక్షణ కరువైయిందని, ఈ కారణంగా రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. డి జబ్బార్ అన్నారు. శనివారం రేవల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను జబ్బర్ ఆధ్వర్యంలో సిపిఎం బృందం సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై పరిశీలించారు. అనంతరం అక్కడి వైద్యులు, రోగులతో మాట్లాడి రోగులకు అందుతున్న సేవలు, ఇంకా అందుబాటులోకి రాని వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 50 సంవత్సరాల క్రితం రేవల్లి మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేశారని తెలిపారు.
నాగం జనార్దన్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో రేవల్లి మండల కేంద్రానికి 30 పడకలతో కూడిన కమ్యూనిటీ ఆసుపత్రిని మంజూరు చేయించి ఆయన ప్రారంభించారని చెప్పారు. ఈ సెంటర్లో మొదట్లో రోగులకు అత్యవసరమైన చికిత్సలు తప్ప అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులో ఉంచాలని తెలిపారు. కానీ నేడు కమ్యూనిటీ ఆసుపత్రిలో కేవలం అవుట్ పేషెంట్స్ వైద్య సేవలను అందిస్తూ నామినల్ గా రోగులకు వైద్య సదుపాయాన్ని అందిస్తున్నారని చెప్పారు. ఆసుపత్రిలో ఈసీజీ, ఎక్స్రే వంటి పరికరాలు ఉన్నప్పటికీ నిరుపయోగంగా ఉన్నాయని తెలిపారు. 30 పడకల ఏ ఆసుపత్రిలో రెగ్యులర్గా కనీసం 10 అడ్మిషన్లు కూడా జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హెల్త్ సెంటర్లో ఆరు మంది వైద్య బృందంతో పాటు ఇతర సిబ్బందిని ప్రభుత్వం నియమించిందని చెప్పారు. అయితే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే వైద్యులంతా అందుబాటులో ఉంటున్నారని, అది కూడా వైరల్ ఫీవర్ లు, కడుపునొప్పి, తలనొప్పి, ఇతర చిన్న చిన్న దెబ్బలు తగిలిన రోగులకు మాత్రమే ఇక్కడ వైద్యం అందుతుందని తెలిపారు.
ఈ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ ఉన్నా నిత్యం తాళం వేసుకునే ఉంటుందని రోగులు చెబుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ గర్భిణీలతో పాటు డయాబెటిస్, థైరాయిడ్, తేలు, పాముకాటు కు వైద్యం అందుబాటులో లేకపోవడం విచిత్రమని చెప్పారు. ఎక్స్రే మిషన్ ఉన్నప్పటికీ వైద్య బృందం నిర్లక్ష్యం వల్ల అది నిరుపయోగంగా మారిందని, రోగులకు అవసరమైతే వనపర్తి లేదా నాగర్ కర్నూల్ కు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే ఇక్కడ ఎక్స్రే ఈసీజీ ఇతర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తే రోగులు పరుగెత్తాల్సిన పని ఉండదని, సరైన చికిత్స అంది క్షేమంగా ఇంటికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కాబట్టి ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ పవన్ కుమార్ రెడ్డి పర్యవేక్షణ కురవడం వల్లే వైద్య సేవల్లో అలసత్వం కనిపిస్తోందని చెప్పారు. అలాగే ఉదయం ఆసుపత్రికి వచ్చిన వైద్యులు కనీసం నాలుగు గంటల వరకు రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలు చేయాల్సి ఉందని, నాలుగు గంటల్లో వైద్య సేవలు అందించి పట్టణాలకు పయనమై తమ సొంత క్లినిక్ లలో పని చేసుకుంటున్నారని తమకు సమాచారం అందిందని తెలిపారు.
కాబట్టి ఉదయం ఆసుపత్రికి వచ్చిన వైద్యులు సాయంత్రం నాలుగు గంటల వరకు ఆసుపత్రిలోనే అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మెరుగైన వైద్య సేవలకు అవకాశం ఉందని తెలిపారు. రోగులను ఇతర పరీక్షల పేరుతో పట్టణాలకు తరలించకుండా ఇక్కడే సాధ్యమైనంత వరకు వైద్య సేవలను పూర్తిగా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అడ్మిట్ అయిన రోగులకు భోజన వసతులు కల్పించడంలో ఏజెన్సీ వారు సక్రమంగా పనిచేయడం లేదని, రోగులకు రెగ్యులర్గా అందించాల్సిన పాలు గుడ్లు , టిఫిన్స్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం వంటివి ఇక్కడ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అవుట్ పేషెంట్స్ అడ్మిషన్స్ గా చేయించుకొని బిల్లులు చేయించుకుని గవర్నమెంట్ సొమ్మును అప్పనంగా మెక్కేస్తున్నారని, వంట చేసే ఇతర మహిళలకు కేవలం అతి తక్కువ జీతాలు ఇచ్చి ప్రభుత్వం అందించే సొమ్మునంత ఏజెన్సీ నిర్వాహకులు కాజేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా ఆసుపత్రి సూపరింటెండెంట్ పర్యవేక్షణ లేకపోవడం వల్లనే జరుగుతోందని భావిస్తున్నామని తెలిపారు. కాబట్టి సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక పీహెచ్సీలు, సి హెచ్ సి లు, ఏరియా ఆసుపత్రులు సందర్శించి వైద్య సేవలపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నామని, ఆ సమాచారాన్ని అంతా రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేసి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషిచేసిన పోరాటాల నిర్వహించనున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఆస్పత్రిని సందర్శించిన కమిటీలో నాయకులు రమేష్, మహేష్, రాము తదితరులు ఉన్నారు.



