– ఆర్య వైశ్యులు ఆద్వర్యంలో నిర్వహణ
– మరిచిన కాంగ్రెస్ శ్రేణులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
మాజీ ముఖ్యమంత్రి,గవర్నర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కె. రోశయ్య జయంతి వేడుకలను శనివారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. చాంబర్ ఆఫ్ కామర్స్, వాసవి క్లబ్, ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో రోశయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రోశయ్య సరళమైన జీవనం, నిబద్ధతతో కూడిన రాజకీయం, పరిపాలనా దక్షతకు ప్రతీకగా నిలిచారని కొనియాడారు. ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా, అనంతరం గవర్నర్‌గా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో నిజాయితీ, క్రమశిక్షణ, విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన ఆదర్శంగా నిలిచారని, యువత ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు,మెడికల్ షాప్ అసోసియేషన్ అధ్యక్షులు కొనిజర్ల ఉమా మహేశ్వరరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కంచర్ల భాస్కరరావు, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శీమకుర్తి శ్రీనివాస్, కన్యకా పరమేశ్వరి దేవస్థానం మాజీ అధ్యక్షులు ముత్త సమాకర్, వాసవి క్లబ్ అధ్యక్షులు సమయమంతుల గంగాధర్‌రావు, దుపగుంట్ల వెంకటేశ్వరరావు, శ్రీను, పోలిపల్లి గోపీనాథ్, యశోద వెంకటరావు, శీమకుర్తి సుబ్బారావు, వాసవి క్లబ్ జోన్ చైర్మన్, మహాత్మా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జల్లిపల్లి దేవరాజు తదితరులు పాల్గొన్నారు. అయితే జీవితాంతం కాంగ్రెస్ వాదిగా రాజకీయాలు,పరిపాలన సాగించిన ఈయన సంస్మరణ లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనకపోవడం చర్చనీయాంశం అవుతోంది.



