Saturday, July 4, 2026
E-PAPER
Homeకరీంనగర్"ఏడేళ్లుగా ఎంపీ మౌనం..జగన్నాథ్‌పూర్ వంతెనపై నోరు మెదపని అరవింద్: ఎమ్మెల్యే

“ఏడేళ్లుగా ఎంపీ మౌనం..జగన్నాథ్‌పూర్ వంతెనపై నోరు మెదపని అరవింద్: ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని మారుమూల గ్రామం జగన్నాథ్‌పూర్ అభివృద్ధే తన లక్ష్యమని, విమర్శలకు పనులతోనే సమాధానం చెబుతానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.గ్రామంలో రూ.1.75 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.ఎమ్మెల్యేగా ఎన్నిక కాకముందే జగన్నాథ్‌పూర్ గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించానని, గ్రామ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలను ప్రస్తుత ప్రభుత్వం చెల్లిస్తోందని పేర్కొన్నారు.

జగన్నాథ్‌పూర్ ప్రాంతం వెనుకబడిన ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని, పీఎం జన్మన్ పథకంలో గ్రామాన్ని చేర్చడం జరిగిందని తెలిపారు. గ్రామ ప్రజల చిరకాల స్వప్నమైన బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ వంతెన నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువెల్ ఓరం కూడా వంతెన మంజూరుకు హామీ ఇచ్చారని చెప్పారు.

అయితే ఎంపీగా ఏడు సంవత్సరాలు పూర్తవుతున్నా జగన్నాథ్‌పూర్ వంతెన అంశంపై ఎంపీ అరవింద్ చొరవ చూపలేదని విమర్శించారు. ఒక్కసారైనా గ్రామానికి వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారా అని ప్రశ్నించారు. పీఎం జన్మన్ పథకంలో ఉన్న గ్రామానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్ర ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

తాను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియాలో ప్రజలకు తెలియజేస్తుంటే, కొందరు విమర్శలు చేయడానికే పరిమితమవుతున్నారని అన్నారు. నియోజకవర్గ ప్రజలే తన కుటుంబమని, ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని స్పష్టం చేశారు. ఇప్పటివరకు దాదాపు 30 సార్లకు పైగా జగన్నాథ్‌పూర్ గ్రామాన్ని సందర్శించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు.

కొంతమంది నాయకులు తమ వల్లనే గ్రామానికి నిధులు మంజూరయ్యాయని చెప్పుకుంటున్నారని, అయితే పనులు ప్రారంభించేందుకు మాత్రం ఎలాంటి చొరవ చూపలేదని విమర్శించారు. దళితుడు మంత్రి కావడాన్ని ఓర్వలేక కొందరు రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులపై నిరాధార విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి గ్రామాభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గ్రామ గ్రామాన గృహ ప్రవేశాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, అభివృద్ధి కార్యక్రమాల ద్వారానే ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -