నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో వినూత్నంగా “విద్యార్థులే ఉపాధ్యాయులు” కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో దీపిక విద్యాశాఖ మంత్రిగా,రమ్య కీర్తన డీఈఓగా, మాటూరి కావ్య హెచ్‌ఎంగా,డాక్టర్, కాంపౌండర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఇతర విద్యార్థులు వివిధ విషయాల ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తూ తరగతులను బోధించారు.ముందుగానే పాఠాలను సిద్ధం చేసుకుని బోధనలో తమ ప్రతిభను ప్రదర్శించారు. తరగతుల నిర్వహణ, హాజరు పర్యవేక్షణ, క్రమశిక్షణ వంటి అంశాలను సమర్థంగా నిర్వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హెచ్‌ఎం ఆకుల వేణు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయుక్తమని అన్నారు. నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, బాధ్యతాభావం పెంపొందించేందుకు స్వయం పరిపాలన దినోత్సవం దోహదపడుతుందని పేర్కొన్నారు. తదుపరి వివిధ పాత్రల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.



