Sunday, July 5, 2026
E-PAPER
Homeజోష్అమలిన ప్రేమకథ (ఎపిసోడ్ -4)

అమలిన ప్రేమకథ (ఎపిసోడ్ -4)

- Advertisement -

ప్రేమ పువ్వులతో అల్లుకున్న పందిరి ఆమె మనస్సు. ఆమెకు రవితప్ప వేరే లోకం లేదు. కుటుంబ సభ్యులు చూపించే ప్రేమకు, రవి చూపించే ప్రేమకు మధ్య నలిగిపోతుంది రజియా.

ఎవరైనా ఆడపిల్ల సుఖాన్నే కోరుకుంటారు. నమ్మకం లేని తనంలోంచే అడ్డంకులు ఏర్పడతాయి. గీతలు గీయబడతాయి. ఈ ప్రేమకు అడ్డంకి అపనమ్మకం.
అంతకు మించి చూస్తే ఇద్దరి కులమతాలు వేరు వేరు అవ్వటమే. రజియా ఏడ్చి ఏడ్చి కళ్ళు లోపలికెళ్ళాయి. ఎంత బతిమాలిన అలీసాబ్ వినే పరిస్థితి లేదు. ఇక చావే శరణ్యమని అనుకున్నది. ఆలోచనలు బుర్రను తింటున్నాయి. పదే పదే ఒకే విషయం మీద దృష్టి సారించినప్పుడు నిర్ణయం రూపు మార్చుకుంటుంది.
రజియాకు చిన్నప్పుడు వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఊర్లో కిష్టయ్య అనే అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నప్పుడు “బతికి సాధించాలే.సచ్చి సాధించేదేమి లేదు ” అని వాళ్ళ అమ్మతో చెబుతుంటే విన్నది.వెంటనే ఆలోచన మార్చుకుని
రవితోనే కలిసి జీవిస్తానని అతనితోనే వెళ్లిపోతానని నిర్ణయించుకుంటుంది.

ప్రేమ పంతాన్ని నేర్పుతుంది. తెగువనిస్తుంది.కొన్ని సందర్భాల్లో ఆలోచించుకునేంత సమయం కూడా ఇవ్వదు.ఇటు కావలసిన మనిషి, అటు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు. రెండు కన్నులు కావలసినవే. రజియా ఆలోచించి ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంది. రజియా ఒక కన్నును పక్కనపెట్టి ఇంకొక కన్నుతోనే వెలుగుల్ని చూడాలనుకుంది.ఎవరికీ చెప్పకుండా
రవిని పెళ్ళి చేసుకుంది. అలీసాబ్ చెల్లెలి విషయం తెలుసుకొని ఎంతో కుమిలి పోయాడు. తనలోని కోపం తారాస్థాయికి చేరి మనసంతా బరువెక్కింది.చెల్లెలు మీద పెంచుకున్న ఆశలు, ఆమె గురించి కలలు కన్న జీవితం తప్ప వేరే ఏమి కనిపించడం లేదు.

రోజులు గడుస్తున్నాయి. నెలలు గడుస్తున్నాయి.
రవి, రజియా హాయిగా బతుకుతున్నారు. రవి డ్రైవింగ్ చేసుకుంటూ ఇల్లును నెట్టుకొస్తున్నాడు. రజియా పక్కింటి దోస్తులతో కలిసి కుట్టు మిషన్ నేర్చుకుంటుంది. దాదాపుగా డ్రెస్ కుట్టడం నేర్చుకుంది.

ఓ రోజు రజియా షాపు దగ్గర నుంచి ఇంటికి వస్తుంటే వాళ్ళ ఊరి సోమయ్య చూశాడు. “బాగున్నావా అమ్మా! ఇక్కడే ఉంటున్నారా? రవిగాడు బాగుండా” అని అడిగి ఎట్లయితేంది తల్లీ! ఇద్దరు బాగుంటే చాలు అనుకుంటూ ఈ విషయం మీ అన్నకు చెబుతానంటాడు. “వద్దు మామ . అన్న కోపం నీకు తెలుసు కదా! మమ్మల్ని సంపినా దిక్కులేదు” అని రజియా అంటుంది. ఇంకెక్కడి కోపం రా సంవత్సరం కావస్తుంది. నేను మాట్లాడుతలే. మీ అన్నా చెల్లెల్ని కలుపుతా అనుకుంటూ అడ్రస్ చీటి మీద రాయించుకొని వెళ్ళిపోతాడు.

అలీసాబ్ ను సోమయ్య కలిసి వాళ్ళ చెల్లెలు కలిసిన విషయం చెబుతాడు. ఇంటికి వెళ్ళి తీవ్రంగా ఆలోచిస్తాడు. మనసులో మనసులేదు. పేలిపోతుందా అన్నట్టు తయారయింది అతని మెదడు. వాళ్ళ ఆవిడతో ఈ విషయం చెబుతాడు. ఆమె ఎంతో సంతోషించి వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతుకుతున్నారు కదా! ఇంకా కావాల్సింది ఏముంది అని సముదాయిస్తుంది. లోపలెంతో బాధ ఉన్నా, తీవ్రమైన అసహనం ఉన్నా నా చెల్లెలి ఆనందమే కదా నాకు కావాల్సిందని నిద్రకు ఉపక్రమిస్తాడు. రెప్పలు మాత్రమే మూసుకుపోయాయి. వాటి వెనకాల మరో ప్రపంచంలో మరెన్నో ఆలోచనలు నడుస్తూనే ఉన్నాయి.

రంజాన్ పండుగ దగ్గరకొస్తుంది. అలీసాబ్ తన భార్య పర్వీన్ తో చెల్లెల్ని తీసుకొద్దామని చెబుతాడు. పర్వీన్ చాలా సంతోషపడుతుంది. ఏంటండి మీరేనా ఈ మాటలు అనేదని ఆశ్చర్యపడి ఇప్పటికైనా మీ మనసు మారింది. సంతోషం అంటుంది.

అలీసాబ్ సోమయ్యను పిలిచి చెల్లెల్ని పండుగకు రమ్మని చెప్పమని అడుగుతాడు. అలీ “ఎంత మంచిమాట చెప్పావు.చాలా సంతోషం. మీ చెల్లెలి ప్రేమను అర్థం చేసుకున్నందుకు. నీదెంత గొప్ప మనసయ్యా” అని కళ్ళనిండా నీళ్ళు తీసుకుంటాడు.
సర్లే కానీ రంజాన్ పండుగ కాదా మా చెల్లెల్ని, రవిని బట్టలు కొనుక్కోమనమని డబ్బులిస్తాడు.
రంజాన్ పండుగ ముస్లింలకు అతి పవిత్రమైనది. ఆ సమయంలో పేద, ధనిక అని లేకుండా అందరూ కొత్త బట్టలు కొంటారు. ఆరు పూటల నమాజు చేస్తారు.
ఇఫ్తారు విందు ఇస్తుంటారు. ఉన్నవాళ్ళు లేని వాళ్ళకు సహాయం చేస్తుంటారు. ఏ మతంలోనైనా అదే ఉంది. ఎవరి నమ్మకాలు వారివి. ఎవరి ఆచార వ్యవహారాలు వారివి.

సోమయ్య బిడ్డ లక్ష్మీ ఉండే ఊళ్ళోనే రజియా ఉంటున్నది. తరుచూ సోమయ్య అక్కడికి పోయి వచ్చేవాడు. ఇలానే పోయి వస్తుంటే రజియా దారిలో కలిసింది. సోమయ్య రజియా దగ్గరికి వెళ్ళి “మీ అన్న పండుగకు రమ్మన్నాడు పిల్లా! ఇన్ని రోజులు నువు పడ్డ బాధలన్నీ పోతయి.‌ పయానం కట్టు” అంటడు.
రజియా సంతోషానికి అవధులు లేవు.
మా అన్న, వదినలకు నా మీద ఉన్న ప్రేమ తెలుసు మామ. నన్ను వాళ్ళు వదులుకోరు. చిన్నప్పటినుంచి నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాడో నీకు తెల్వదా. నచ్చిన డ్రెస్సులు కొనిచ్చిండు. నేను వాడినన్ని చెప్పుల జతలు మన ఊళ్ళో ఏ అమ్మాయి వాడింది చెప్పు. ఇగ పిల్ల ఆగదు అన్న పిలిసిండని తెల్వంగనే చెట్టెక్కి కూసున్నది.‌ సాల్లేగాని మీ ఇద్దరిని బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చిండు మీ అన్న తీసుకో. అవునా! ఇటు ఇవ్వు ఇవ్వు అని ఎగిరిగంతేసింది రజియా.
నా అన్న నాన్న లేని లోటు తీర్చిండు. నాన్నలు లేని ఇంట్లో అన్నలు, తమ్ముల్లే నాన్నలు. మా అన్న అన్న కాదు మామ నాకు నాన్న. సరే మామ నువ్వన్నట్టే ఈ చెల్లెను, అన్నను కలుపుతున్నవు. నువ్వు ఖుషీగున్నట్టున్నవు. అవునమ్మా ఈ సిన్నజీవితంలో గొడవలు పెట్టుకొని, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నరని దూరమయి ఏం సాధిస్తరు. చివరికి ఎవడయిన అయ్యేది పిడికెడంత బూడిదే కదా! అందరూ కలిసి మెలిసి ఉండాలే. మనుషులంతా కడుపునిండా మాట్లాడుకోవాలే. ఈ కుల, మత తేడాలు పోవాలే.
పొద్దుబోతాంది మళ్ళ నేను ఊరు జేరాలే! ఇగో డబ్బులు తీసుకోమ్మ. పండుగ దద్దరిల్లాలే. నన్ను పిలువుర్రి. ఇంత బిర్యాని తినొస్తా‌. నాలుకంతా చేదు చేదు గొడతాంది. శానా రోజులయింది తినక.

రజియా డబ్బులు తీసుకొని నచ్చిన గాజులు, బట్టలు కొనుక్కుంది. రవి మంచి బట్టలు కొనుక్కున్నాడు.”ఎలాగూ మన పెళ్ళి అందరి ముందు కాలేదు కదా! ఈ బట్టలు కట్టుకుని పండుగ జరుపుకుందాం. అదే పెళ్ళి వేడుకవుతుంది” అని రజియా కళ్ళనిండా ఉబికివచ్చిన ఆనందభాష్పాలతో రవిని హత్తుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -