Sunday, June 21, 2026
E-PAPER
Homeజోష్అమలిన ప్రేమకథ (ఎపిసోడ్ -2)

అమలిన ప్రేమకథ (ఎపిసోడ్ -2)

- Advertisement -

ఇంకొకడు మా మిత్రుడు రంగనాథాచారి ఆరా తీస్తున్నాడు. “నుస్రత్ చాలా సిన్సియర్ రా. నీ వల్లకాదు” అని సమద్ రంగనాథ్‌తో చెబుతుండు.”ఏం… అంత పెద్ద తోపా ఆమె? ఊళ్ళో అందరిలాగే చదువుకోవడానికి కాలేజీకి వస్తుంది కదా. దానికే అంత బిల్డప్పా! చూద్దాం… దాన్ని పడేయడం ఎంతసేపు” అని రంగనాథ్ గాడు ఎగిరెగిరి పడుతుండు. మాటలతోనే కోటలు కడుతాడు కానీ ఒక్క అమ్మాయి వాడి ముఖం కూడా చూడదు. రోజుకు ఎన్ని సార్లు స్నానం చేసినా ఇప్పుడే నిద్ర లేచొచ్చాడా అనే అనుమానం కలిగే బద్ధకం వాడి సొంతం.

సమద్ ఆమె గురించి చెబుతున్న మాటలు ఇంకా ఇంకా తనపైన శ్రద్ధను పెంచాయి. ఆ సమయానికే ఆమె అక్కడినుంచి సైకిల్ మీద వెళ్తుంది.నిండుజాబిలి దారితప్పి ఈ రోడ్డు మీదుగా వెళ్తుందా అనిపించింది. బొడ్డుమల్లె పూలు కుప్పగా రాలినట్టు ఆ వీధంతా ప్రేమ వాసన. నక్షత్రాలన్నీ ఉదయం పూటే మెరుస్తున్నట్టు నా కళ్ళల్లో వేలకోట్ల కాంతిపుంజాలు తళుక్కుమన్నయి.

కొలిస్తే చక్కటి నిలువు గీత లాంటి ముఖం, ఎర్రని ఛాయ మేని, అప్పుడప్పుడే విచ్చుకుంటున్న దోర పెదాలు. చెవులకు చంద్రవంక రింగులు. కాళ్ళకు వెండి పట్టీలు. పాకాల నదంత స్వచ్ఛమైన కల్మషం లేని ముఖం నాకక్కడ కనబడింది.

ముస్లిం అమ్మాయే కానీ బుర్ఖా వేసుకునేది కాదు. ఆ రోజుల్లో పల్లెటూర్లలో ఎక్కువశాతం మంది బుర్ఖా వేసుకోకపోయేది. హిందువుల ఇండ్లల్లోనే వాళ్ళ ఇండ్లు ఉండేవి. ఉప్పులు, పప్పులు చేబదులు పుచ్చుకునేవారు. ఆ రోజులే వేరు. రంజాన్ వస్తే సేమియాను ఇళ్ళకు పంచేవారు. పండుగలొస్తే వీళ్ళు మడుగులు, అరిసెలు, గారెలు పంచేవారు. మనుషులంతా కలిసిమెలిసి ఉండే కాలమది. ఏమతమైనా మనుషుల్ని విడదీయదు. అన్నదమ్ముల్లా కలిసి ఉండమనే చెబుతుంది. ఛాందసం ఎందులో ఉన్నా అది ఖండించదగిందే. అంతకు మించి ఆలోచిస్తే మనుషులను మించింది ఏది లేదు. అప్పుడే మనం మనలా జీవిస్తాం. మధ్యవర్తికి అవకాశం చిక్కదు.

ఆ రోజు ఆమెను చూడగానే నా మనసులో గందరగోళం మొదలయింది. పైగా సమద్ ఆమె సిన్సియర్, ఎవరితోనూ అంతగా మాట్లాడదు అంటున్నాడు. నాకు ఛాలెంజ్ లంటే మహా ఇష్టం. ఆ రోజునుంచిక నా ఆలోచనల్లోకి తాను వద్దనుకున్న వస్తుంది. ఆమె కోసం ఉదయం, సాయంత్రం అక్కడే మకాం వేసి వేచి చూసేవాన్ని.

అన్ని పాటలు మరిచిపోయి ఆమె వస్తుందని చూసి “అందమైన కుందనాల బొమ్మరా. చందనాల మత్తు జల్లి పోయేరా” పాట అందుకునే వాన్ని. “నువు పాడాల్సిన పాట ‘నేనొక ప్రేమ పిపాసిని. నీవోక ఆశ్రమవాసివి. నా దాహంతీరనిది. నీ హృదయం కరగనిది’ రా” అని టైలర్ సమద్ ఆటపట్టిస్తుండేవాడు.

సమద్ అలా ఆటపట్టిస్తున్నా నా కళ్ళు మాత్రం ఆమె వెళ్ళిన దారినే చూస్తుండేవి. అసలు కాలేజీలో అంత సిన్సియర్ గా ఉండే నుస్రత్, ఇంట్లో ఎలా ఉండేదో నాకు తర్వాత తెలిసింది. నుస్రత్ ఇంటి దగ్గర పనులన్ని చూసుకునేది. వాకిలి ఊడ్చేది. గిన్నెలు తోమేది. బియ్యం కడిగి పెట్టేది. ఒక్క క్షణం ఖాళీ ఉండేది కాదు. పనులన్నీ అయ్యాక పుస్తకం పట్టుకొని చదువుకునేది. వాళ్ళ అమ్మ కూరగాయలు అమ్మేది. చుట్టుపక్కల మార్కెట్లకు వెళ్ళి కూరగాయలు కొనుకొచ్చి ఊళ్ళె అమ్మేది. ఆ గిరాకీ చూసుకోవడంతోనే సరిపోయేది.

ఎప్పుడన్న బిడ్డతో మాట్లాడితే ”ఎందుకు తల్లి నీకీ సదువు. కూరగాయల బేరంలో నాకు సాయం జెయ్యి. రోజులు బాగా లేవు. సైకిల్ మీద ఐదు కిలోమీటర్లు పోతున్నవు. ఐదు కిలోమీటర్లు వస్తున్నవు. ఆడపిల్లవి. నువు ఇంటికొచ్చేదాకా పాణం గిల్లగిల్లకొట్టుకుంటదే. ఓ ఇంటికి ఇస్తే పోయేదానివి. ఎందుకు బిడ్డ సదువు” అని జపం చేసేది. “మొన్ననే వార్తల్ల విన్న ఎక్కన్నో కాలేజీ సదువుకునే అమ్మాయిల వెంబడి పోకిరి వెదవలు పడ్డరట. అప్పటినుంచి నా మనసుల మనసు ఉండటంలేదు. జాగ్రత్త బిడ్డ” అని చాంద్ గుర్తు చేస్తూ ఉండేది.

నాయన వ్యవసాయం చేసేటోడు. పొద్దునబోతే సాయంత్రం వచ్చేటోడు. బిడ్డంటే వల్లమాలిన ప్రేమ. “బంగారు తల్లి నీ ఇష్టం రా. మంచిగ సదువుకో. పేరు మాత్రం చెడగొట్టకు బిడ్డా” అని ప్రేమగా మందలించేటోడు.నుస్రత్కి ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు. వాళ్ళిద్దరు చదువుకుంటున్నారు కానీ తనంత శ్రద్ధగా చదివేటోళ్ళు కాదు. నుస్రత్ కు స్నేహితులన్న, బంధువులన్న చాలా ఇష్టం. కాలేజీ స్నేహితులను ఇంటికి పిలిచి రంజాన్ పండగకు భోజనం పెట్టి పంపేది. బిర్యాని, డబల్ కా మీఠా, చికెన్ తో స్పెషల్ ఐటెమ్స్ చేయించేది. వాళ్ళ బాబాయి బిడ్డలతో చాలా కలివిడిగా ఉండేది. నూర్జహాన్ తో మరీ క్లోజ్ గా ఉండేది, ఏ విషయమైనా పంచుకునేది.

పగవాళ్ళ మనసు ఎట్లుంటదో కానీ, అందరికీ నుస్రత్ అంత మంచి మనసు ఉంటుందా? ఎప్పుడు ఏ విషయంలో దొరుకుతరా ఇరికిద్దామా అని చూస్తుంటరు. నుస్రత్ ది కల్మషం లేని ప్రేమ. పక్కన వాళ్ళ చిన్నతాత కొడుకు ఇల్లు ఉంది. ఆ ఇల్లును సొంత ఇల్లులాగానే భావించేది. ఆ పిన్ని నుస్రత్ను బాగా చూసుకునేది. జడలు వేసుకోవాలన్న ఆ పిన్ని దగ్గరకే వెళ్ళేది. మెహందీ పెట్టించుకోవాలన్న ఆమె దగ్గరికే పోయేది. ఎన్నో మంచి విషయాలు చెప్పేది. స్పెషల్స్ చేసుకొని తినేవారు. వేడుకలకు కలిసి వెళ్ళే వారు. వీళ్ళకు సాధారణంగా రాత్రిపూటే డిన్నర్లుంటాయి. డిన్నర్లప్పుడు నుస్రత్కు దిష్టి తీసేది వాళ్ళ అమ్మ. ఆమె కళ్ళకు సుర్మాపెడితే చూసే వాళ్ళ కళ్ళల్లో చురకత్తులు దిగేవి. అంత వాడియైన కళ్ళు తనవి. దగదగ మెరిసే టాప్స్, మ్యాచింగ్ గాజులతో భలే తయారయ్యేది.

“వెండిరజను చల్లినట్టు, ఆకాశమంతా తెల్లని దూదిపింజలు మొలిచినట్టు అందమే ఎటువైపు చూసినా.

“ఇలా రోజు కాలేజీకి వెళ్తూ, వస్తూ ఇంటిలో సహాయం చేస్తున్న ఈమెను చూసి వాడలోని వాళ్ళంతా “కూతురంటే నుస్రతే. మా ఇంట్లో అమ్మాయిలున్నారు, ఏ పని చేయరు. వట్టి దండుగ” అనుకునేవాళ్ళు. సమాజానికి ఇప్పుడు కావల్సింది అయితే చదువుకునే వాళ్ళు, లేకపోతే ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఎవరి పనిని వాళ్ళు చేసుకునేవారు. ఈమెలో చదువూ ఉంది, ఇంటిపనుల్లో సహాయం చేసే గుణమూ ఉంది. ఇలాంటి వాళ్ళను ఇరుగుపొరుగు, సమాజం ఖచ్చితంగా గుర్తిస్తుంది, గుర్తింపునిస్తుంది. తల్లిదండ్రులను ఇది కావాలి, అది కావాలి అని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు తనది.

కానీ, వాళ్ళ వీధిలో ఉండే బాలకృష్ణ నుస్రత్ వంక అదోలా చూస్తుండేవాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -