మన యువతకు కొండల్ని పిండిచేసే శక్తి ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఆ విషయాన్ని మనమే నమ్మలేం. చదవగలమో లేదో, ఉద్యోగం వస్తుందో రాదో.. ఇలాంటి ఆలోచనలతో మనల్ని మనమే సందేహిస్తూ ఉంటాం. కానీ గెలవాలనే తపన ఉండాలేగానీ, అపజయాలను విజయసోపానాలుగా ఎలా మార్చుకోవచ్చో నిరూపించాడు ఈ అనంతపల్లి యువకుడు.
పల్లెటూరి పేదరికం నుండి ఎదిగి నేడు సచివాలయంలో ఉన్నత స్థానానికి చేరుకున్నారు డాక్టర్ లోలపు తిరుపతి. రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలం, అనంతపల్లి గ్రామానికి చెందిన సామాన్య వ్యవసాయ కుటుంబంలో వసంత, రాములు దంపతులకు తిరుపతి జన్మించారు. సొంత ఊరిలో ఐదో తరగతి వరకు, ఆపై వేములవాడ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన ఆయనకు ప్రారంభంలో చదువు అంత సులభంగా సాగలేదు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో పలుమార్లు విఫలం కావడం ఆయన జీవితంలో పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది. కానీ, ఆ ఓటమి ఆయనను కుంగదీయలేదు. మరింత పట్టుదలను పెంచింది.
పదో తరగతిలో ఫెయిల్ అయిన సమయంలో దాదాపు మూడేళ్ల పాటు ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచారు తిరుపతి. అంతేకాకుండా ఒక ఎరువుల దుకాణంలో జీతానికి పని చేస్తూ కుటుంబానికి అండగా నిలిచారు. ఆ కష్ట కాలంలో తండ్రి రాములు ఇచ్చిన ప్రోత్సాహం, గురువు కొమ్మోజి శ్రీధర్ అందించిన మార్గదర్శకత్వం ఆయనను మళ్లీ పుస్తకం పట్టేలా చేశాయి. పట్టుదలతో చదివి పదో తరగతి పాస్ అవ్వడమే కాకుండా, కోడిమ్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆర్ట్స్ గ్రూప్‌లో చేరి ఏకంగా మండల టాపర్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఈ విజయం ఆయన ఉన్నత విద్యా ప్రయాణానికి బలమైన పునాదిగా మారింది. పత్రికలు చదవడం అలవాటు చేసుకున్న తిరుపతి, ఏపీఆర్‌డీసీ (APRDC)ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, కర్నూలులోని ప్రతిష్టాత్మక సిల్వర్ జూబ్లీ కళాశాలలో సీటు సంపాదించారు. ఆపై ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్‌లో పీజీ, ఆ తర్వాత బి.ఎడ్ పూర్తి చేశారు. పరిశోధనలపై ఉన్న ఆసక్తితో సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష రాసి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) లో ప్రొఫెసర్ గడ్డం కృష్ణారెడ్డి సూచనల మేరకు ఎం.ఫిల్ కోర్సులో చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాల సాధన, సంస్కతి, కళారూపాలు, ఆట, పాట, మాట వంటి అంశాలపై లోతైన పరిశోధన చేసి ఎం.ఫిల్ పట్టా అందుకున్నారు. అనంతరం పంచాయతీరాజ్ సంస్థలలో వెనుకబడిన కులాల ప్రాతినిధ్యంపై కరీంనగర్ జిల్లాను కేస్ స్టడీగా తీసుకుని పీహెచ్‌డీ పరిశోధన కొనసాగించారు.పూర్వ ఉస్మానియా వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ మార్గదర్శకత్వంలో పీహెచ్‌డీ పూర్తి చేసిన తిరుపతి, ఉస్మానియా విశ్వవిద్యాలయ శతజయంతి ఉత్సవాల సందర్భంగా వైస్ ఛాన్స్‌లర్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక డాక్టరేట్ పట్టాను అందుకున్నారు.
ఒకప్పుడు పదిలో ఫెయిల్ అయిన విద్యార్థి, నేడు ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ సాధించడం చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద సంచలనంగా, యువతకు ఆదర్శంగా నిలిచింది. ఈ విజయాలన్నింటికీ తన తల్లిదండ్రుల నిరంతర ప్రోత్సాహమే కారణమని, అందుకే తన డాక్టరేట్‌ను వారికి అంకితం ఇస్తున్నట్లు తిరుపతి గర్వంగా చెప్తారు. కేవలం అకడమిక్ డిగ్రీలతోనే ఆగిపోకుండా, తన పరిశోధన పరిజ్ఞానాన్ని, పట్టుదలను సమాజ పురోగతికి ఉపయోగించే అద్భుతమైన అవకాశాన్ని తిరుపతి దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని అత్యున్నత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ‘పాలసీ అనలిస్ట్’ (విధాన విశ్లేషకులు) గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో, వాటి విశ్లేషణలో కీలక పాత్ర పోషిస్తూ గ్రామీణ యువతకు ఆశాదీపంగా నిలిచారు. ఓటమిని గెలుపుగా మార్చుకున్న డాక్టర్ లోలపు తిరుపతి ప్రస్థానం, కష్టాలు ఎదురైనప్పుడు వెనకడుగు వేసే నేటి తరం యువతకు ఒక గొప్ప దిక్సూచి.
జేపి చందు,
చందుర్తి రిపోర్టర్



