Friday, August 14, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మోడీని ఇష్టపడితే ఒప్పుకోమంటున్న జెన్ జీ

మోడీని ఇష్టపడితే ఒప్పుకోమంటున్న జెన్ జీ

- Advertisement -

వైద్య ప్రవేశ పరీక్ష పేపర్లు లీకైన తర్వాత విద్యా సంస్కరణలు కోరుతూ జాతీయ రాజధానికి తరలివచ్చిన పదివేల మందిలో అమ్మాయిలు కూడా ఎందరో ఉన్నారు. ఈ లీక్ కారణంగా ఇరవై మందికి పైగా అభ్యర్థులు ఆత్మహత్య చేసుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ ఉద్యమంలో బీజేపీ మద్దతుదారుల పిల్లలు సైతం విద్యా సంస్కరణలు కోరుతూ, విద్వేష రాజకీయాలను తిరస్కరిస్తూ పాల్గొన్నారు. మోడీని ఇష్టపడుతున్న తమ తల్లిదండ్రులను నిలదీస్తున్నారు. నరేంద్ర మోడీ 12 ఏండ్ల పాలనకు తీవ్రమైన సవాలు విసిరింది ఈ ఉద్యమం. అంతేకాదు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు, ప్రవేశ పరీక్షల సంస్కరణకు దారితీసింది. బీజేపీ పాలనలోని లోపాలను బయటపెట్టింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి.

36 రోజుల పాటు ఉప్పెనై ఎగిసిపడిన ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ (సీజేపీ) సభ్యులు జూలై 25న విద్యాశాఖ మంత్రి రాజీనామా తర్వాత తమ ప్రదర్శనలను విరమించుకున్నారు. కానీ తమ జీవితాలు కోలుకోలేని విధంగా మారిపోయాయని తెలుసుకున్న యువత ఆ ప్రదేశాలను విడిచిపెట్టలేదు. వారిలో ప్రియా సింగ్ ఒకరు. ఆమె తండ్రి బీజేపీకి గట్టి మద్దతుదారు. ఆమె జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన ఆమెను బెదిరించాడు. ‘నేను అక్కడికి వెళ్ళినప్పుడు నా ముఖం కనిపించకుండా కప్పుకున్నాను. ఎందుకంటే, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తానని నేను మా నాన్నకు ముందే చెప్పాను. ఫొటోలు, వీడియోలో ఆయన నన్ను చూస్తాడేమో అని అలా చేశాను’ అని 24 ఏండ్ల ఆమె చెప్పింది.

మా నాన్న బీజేపీకి అంధ భక్తుడు
ప్రియా తండ్రి ఒక సెక్యూరిటీ సంస్థలో పనిచేస్తున్నారు. ఆమె మాటల్లో చెప్పాలంటే ఆయన బీజేపీకి అంధ భక్తుడు. ఒక మహిళా నిరసనకారిణిపై పోలీసు అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వీడియోలను ఆమె తన తండ్రికి చూపించింది. అయితే ఆయన అధికారులనే సమర్థించారు. ‘ప్రభుత్వం నిరసనలు చేయవద్దని చెప్పింది. అలాంటప్పుడు వాళ్లు అసలు అక్కడికి వెళ్లకూడదు కదా’ అని ఆయన వాదాన. ‘శాంతియుత నిరసనలు మన రాజ్యాంగబద్ధమైన హక్కు అని నేను చెప్పాను. కానీ అది అనవసరమని ఆయన అన్నారు. నిరసనల సమయంలో తీవ్రంగా గాయపడిన మహిళలు ఆ శిక్షకు అర్హులేనని ఆయన నమ్మకం. ఎందుకంటే వారు తమ తల్లిదండ్రులకు చెప్పకుండా, వారి మాట వినకుండా ఆ ప్రదర్శనలకు హాజరయ్యారు.’

ముస్లిం యూనివర్సిటీలో చదవొద్దన్నారు
ప్రియా ముస్లింలచే స్థాపించబడిన శతాబ్దపు చరిత్ర కలిగిన ‘జామియా మిలియా ఇస్లామియా’ యూనివర్సిటీలో పీజీ విద్యార్థి. ‘నేను ఇంట్లో ఎవరికీ చెప్పకుండానే జామియా మిలియా ప్రవేశ పరీక్షకు హాజరయ్యాను, ఆ తర్వాత వారికి తెలియకుండానే కోర్సులో చేరాను’ అని ఆమె చెప్పింది. ‘ఇస్లామిక్ నేషనల్ యూనివర్సిటీ’ అని అర్థం వచ్చే ఉర్దూ, అరబిక్ పేరున్న సంస్థలో ఆమె చేరడం పట్ల తన తండ్రి తీవ్ర అసంతృప్తికి గురయ్యారని ఆమె గుర్తు చేసుకుంది. ‘అక్కడ ఉన్నవాళ్లు నన్ను దుర్భాషలాడుతారని, ఇస్లాం మతంలోకి మారేలా ఒత్తిడి చేస్తారని ఆయన నాతో అన్నారు. కానీ అప్పటికే నేను అక్కడ చేరడంతో ఆయన ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నా స్నేహితుల గురించి గానీ, తరగతుల గురించి గానీ కుటుంబ సభ్యులతో ఏమీ చెప్పను. ఇంట్లో ఉన్నప్పుడు స్నేహితుల ఫోన్ కాల్స్ కూడా తీసుకోను’ అని ఆమె అన్నది.

నాన్న బీజేపీ.. నేను వామపక్షం
ప్రియా నివసించే ప్రాంతానికి సుమారు పది కిలోమీటర్ల (ఆరు మైళ్లు) దూరంలో 25 ఏండ్ల అంజలి నివసిస్తోంది. ఆమె ఢిల్లీ యూనివర్సిటీలో హ్యుమానిటీస్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి. భారతదేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రమైన బీహార్‌లో పుట్టి పెరిగిన ఆమె, ‘కోపిష్టి తండ్రి పర్యవేక్షణ’లో గడిపింది. ఆమె తండ్రి ఆమె పట్ల వివక్ష చూపేవాడు. ఆమెకు సరైన విద్య, సామాజిక సంబంధాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించేవాడు. కానీ తన కొడుకు విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించేవాడు. ఆమె తల్లిదండ్రులు బీజేపీకి బలమైన మద్దతుదారులు మాత్రమే కాదు, ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు కూడా. మరోవైపు, అంజలి ‘ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్’ (AISA)కు చెందిన విద్యార్థి నాయకురాలు. మొదట్లో ఆమె కూడా మోడీ అభిమాని. కానీ 2018 నాటికి.. అంటే ఆమె ఇంటి నుండి ఆర్థిక సహాయం తీసుకోవడం మానేసిన ఏడాదిలో ఆమె ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. ఆమె రాజకీయంగా పూర్తిగా భిన్నమైన వైఖరిని స్వీకరించి AISAలో చేరింది. గత ఏడాది జరిగిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో వామపక్ష కూటమి తరపున అధ్యక్ష పదవికి పోటీ చేసింది.

అమ్మ రహస్యంగా చూసేది
‘నేను ఎప్పుడైనా టీవీ ఛానల్స్‌‌లో మాట్లాడుతుంటే అమ్మ రహస్యంగా చూసేది. నాకు ఫోన్ చేసి నా ప్రసంగం ఎలా అనిపించిందో చెబుతుంది. ఆమెకు సొంత అభిప్రాయాలు, స్వేచ్ఛ ఎప్పుడూ లభించలేదు. పైగా ఆమెకు పెద్దగా చదువు కూడా లేదు. కానీ మా నాన్న పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ చేశారు. ఆయన విద్యావంతుడు. ఆయనతో సంభాషణలకు నేను సాధ్యమైనంత దూరంగా ఉంటాను’ అని అంజలి చెప్పింది. కానీ తల్లిదండ్రులు తన రాజకీయాలను ఏమాత్రం పట్టించుకోరని, తనను అవమానించడానికి, అపరాధభావానికి గురిచేయడానికి, ఇబ్బంది పెట్టడానికి, ఇంకా తన జీవితాన్ని వృధా చేసుకోవడం ఆపమంటూ అన్ని రకాల ఎత్తుగడలు వేస్తారని ఆమె చెప్పింది.

ఆమెకు దెబ్బలు తినడం ఎందుకంత ఇష్టం?
జంతర్ మంతర్ నిరసనలు ప్రారంభమైనప్పుడు అంజలి ఎక్కడుందో తెలుసుకోవడానికి తల్లి ఆమెకు ఫోన్ చేసేది. ‘నేను చదువుకుంటున్నాననో, ఏదో పనిలో ఉన్నాననో అబద్ధం చెప్పేదాన్ని. అప్పుడు ఆమె నన్ను ఇప్పటికే టీవీలోనో, ఏదైనా సోషల్ మీడియా రీల్‌లోనో చూశానని చెప్పేది’ అంటూ అంజలి నవ్వుతూ చెప్పింది. జూలై 20న నిరసనకారులు పార్లమెంటు వైపు కవాతు చేసిన రోజున ఆమె తల్లి కన్నీళ్లతో ఫోన్ చేసింది. పోలీసుల లాఠీచార్జిలో గాయాలయ్యాయా అని అడిగింది. ‘నేను బాగా లేను. పోలీసుల దాడి వల్ల నాకు లిగమెంట్ గాయమైంది’ అని అంజలి చెప్పింది. ఆమె తల్లితో మాట్లాడుతుండగా తండ్రి మాటలు వినిపించాయి. ‘ఈ ప్రభుత్వం ఆమెను అణచివేస్తుందని, ఎవరినీ వదిలిపెట్టరని నేను ఆమెకు చెప్పాను. దెబ్బలు తినడం ఆమెకు ఎందుకు ఇష్టం? దెబ్బలు తినడానికే మనం ఆమెను పెంచామా?’ అన్నారు. తాను కూడా ఈ ప్రభుత్వంలో ఒక భాగమని, ఇందులో శక్తివంతులు, అత్యంత ధనవంతులు ఉన్నారని, ఎవరైనా వారిని మార్చడానికి ప్రయత్నిస్తే వారిని అణచివేస్తారని కూడా ఆయన అన్నారు’ అని అంజలి గుర్తుచేసుకుంది.

ఆశ్చర్యం కలిగేలా…
కొన్నిసార్లు తన తండ్రి రాజీ ప్రతిపాదన చేయడానికి ప్రయత్నించేవాడు. కొన్ని నిర్ణయాలతో జీవితాన్ని వృధా చేసుకోవద్దని అనేవారు. అందుకే ప్రధాన్ రాజీనామా చేసినప్పుడు తన తల్లిదండ్రుల నుండి ఎప్పటిలాగే అవమానకరమైన ప్రతిస్పందనలు వస్తాయని అంజలి ఊహించింది. కానీ ఆమె తల్లి చాలా ఆశ్చర్యం కలిగేలా తన కూతురు చేసిన పోరాటానికి ఆమె సంతోషించింది, ఒక విధంగా గర్వపడింది. ‘ఇదొక చారిత్రక ఘట్టం’ అని తన తల్లి అన్నట్లు అంజలి గుర్తుచేసుకుంది. ఇక తన తండ్రి విషయానికొస్తే ఎటువంటి స్పందనా లేదు.

దేశ చర్రితను పునర్లిఖిస్తాను
29 ఏండ్ల బోరా కూడా AISA సంస్థకు జాతీయ అధ్యక్షురాలు. న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ విద్యార్థి. 23 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన నిరసనకారులలో ఒకరు. నిరసనల తర్వాత ఆమె మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించే జెన్ జీ తరం వారిలో ఒకరిగా ఎదిగారు. విచ్ఛిన కారులు ఆమెపై నల్ల ఇంకు చల్లితే, చల్లిన ఆ ఇంకుతోనే దేశ చర్రితను పునర్లిఖిస్తానని ధైర్యంగా చెప్పిన యువతి ఆమె. పాత్రికేయురాలు బర్ఖా దత్‌కు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆర్మీ అధికారి అయిన తండ్రి, గృహిణి అయిన తన తల్లి బీజేపీ మద్దతుదారులని, వామపక్ష భావజాలం గల తన క్రియాశీలతను వారు ‘అంత సానుకూలంగా’ తీసుకోలేదని బోరా చెప్పారు. వారి మధ్య విభేదాలు ఉన్నప్పటికీ బోరా నిరాహార దీక్ష గురించి తెలుసుకున్న తర్వాత, ఆమె తల్లి న్యూఢిల్లీకి తూర్పున సుమారు 300 కిలోమీటర్ల (186 మైళ్ల) దూరంలో ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నగరంలో ఉన్న తమ ఇంటి నుండి జంతర్ మంతర్‌కు ప్రయాణించింది. ప్రధాన్ రాజీనామా చేసినప్పుడు ఆమె తన కుమార్తెను అభినందించింది కూడా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -