నవతెలంగాణ – మల్హర్ రావు
రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. కాటారం మండలం ధన్వాడ గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఘనంగా నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రత్యేక పూజలకు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో జీవించాలని రేణుక ఎల్లమ్మ తల్లిని ప్రార్థించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దేవాలయాలు ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రాలుగా నిలుస్తాయని, ప్రజల్లో ఐకమత్యం, సోదరభావం, మానవతా విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ధన్వాడ గ్రామ ప్రజలు ఐక్యంగా కలిసి దేవాలయ అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా మంత్రి చేతుల మీదుగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేశారు.



