శాఖలు సమన్వయం చేసుకోవాలి
ప్రత్యేకంగా కమిటీలు వేయాలి
టూరిజం హబ్ కింద వికారాబాద్ అభివృద్ధి : పర్యాటక సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
వచ్చే డిసెంబర్‌లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కోసం కసరత్తు ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు సర్కారీ శాఖల మధ్య సమన్వయం కోసం కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ ఆర్డీ బోధి పెవిలియన్ లో పర్యాటక శాఖ పై సీఎం సమీక్ష చేశారు. టూరిజం అభివృద్ధి హబ్ కింద వికారాబాద్‌కు పర్యాటక శోభ తేవాలని ముఖ్యమంత్రి సూచించారు. తారామతి బారామతిని టూరిజం ప్లేస్ గా మరింత బలోపేతం చేయాలని అన్నారు. దుర్గం చెరువును పూర్తి స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని చెప్పారు. మంజీరా, దిల్ కుషా గెస్ట్ హౌస్ లను ఆధునీకరించాలని ఆదేశించారు. వికా రాబాద్ లో వీరభద్రస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని, ఈ తరహాలో టెంపుల్ కు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. క్యూర్ పరిధిలో ఉన్న అటవీ శాఖ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజంగా మలచాలని స్పష్టం చేశారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలో ఎకో పార్క్ లు తీర్చి దిద్దాలని వివరించారు. ఫ్యూచర్ సిటీ లో ఉన్న అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో అభివృధ్ధి చేయాలని సూచించారు. అర్బన్ ఫారెస్ట్ తరహాలో సన్నాహాలు అవసరమని చెప్పారు. అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్టు కోసం ప్రత్యేకాధికారిని నియమించి పనులను ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జిలను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా మలచాలని సూచించారు. బ్రిడ్జిలపై పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను అందుబాటులోకి తేవాలన్నారు. అవకాశం ఉంటే ట్రాఫిక్‌ను మళ్లీంచి పర్యాటకులకు అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్ , టూరిజం సెక్రెటరీ వాణి ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ ఎండీ గౌతమి తదితరులు పాల్గొన్నారు.
డిసెంబర్‌లో గ్లోబల్ సమ్మిట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



