Tuesday, July 7, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసర్..పరేషాన్

సర్..పరేషాన్

- Advertisement -

ఎన్యుమరేషన్ ఫారాలను పూరించటంలో తడబాటు
చదువుకున్న వారికి సైతం అర్థంకాని పదజాలం
పత్రాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న సిబ్బంది
ప్రారంభ దశలోనే డిజిటలైజేషన్, సాంకేతిక సమస్యలు

నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
​ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు(బీఎల్‌ఓలు) పంపిణీ చేస్తున్న ఎన్యుమరేషన్ ఫారం (గణన ఫారం)లు నింపడం ఓటర్లకు సమస్యగా మారింది. అధికార యంత్రాంగం ఫారాల పంపిణీని దాదాపు పూర్తి చేసింది. కానీ వాటిని ఎలా పూరించి ఇవ్వాలని తెలియక.. ఎలా పూరిస్తే ఏ సమస్య వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఫారంలోని సాంకేతిక పదజాలం, కాలమ్‌లు అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. నిరక్షరాస్యులే కాక అక్షరాస్యులు సైతం ఏమి చేయాలో తెలియక ఇరుగుపొరుగు వారిని ఆరా తీస్తున్నారు. అనుమానాల నివృత్తి కోసం జిల్లా కలెక్టరేట్, మున్సిపల్, ఇతర కార్యాలయాల్లో హెల్ఫ్ డెస్క్‌‌లు ఏర్పాటు చేసినా క్షేత్రస్థాయిలో మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు.

​కొందరు బీఎల్‌ఓల నిర్లక్ష్యం
ఫారంపైన బీఎల్‌ఓ నంబర్ ఇచ్చినా..ఫోన్ చేస్తే కొందరు అందుబాటులోకి రావడం లేదు. మరికొందరి నెంబర్లు తరచూ బిజీ వస్తున్నాయి. చాలాచోట్ల బీఎల్‌ఓలు ఇండ్లకు తిరిగి గణన ఫారంలు ఇవ్వడం లేదు. ఒకచోట కూర్చొని ఓటర్లను అక్కడకు పిలిపించుకుంటున్నారు. ఓ వీధిలో ఒకరిద్దరికి నెంబర్లు వేసి ఇచ్చి ఆ బజార్ మొత్తానికి పంపిణీ చేయమని సూచిస్తున్నారు.

​అవగాహన లోపం
గ్రామీణ ప్రాంతాల్లోనే కాక పట్టణాల్లోని వృద్ధులు, నిరక్షరాస్యులు ఫారం నింపడానికి ఇబ్బందులు పడుతున్నారు. బీఎల్‌ఓలు ఫారం ఇచ్చి వెళ్తున్నారే తప్ప ఎలా పూరించాలో సరైన అవగాహన కల్పించడం లేదనే విమర్శలు ఉన్నాయి. అక్షరాస్యులు సైతం 2002లో ఓటరు జాబితా ప్రకారం ఓటు ఉంటే ఎక్కడ, ఓటు లేకపోతే ఏమేం రాయాలో తెలియక..తెలిసిన వారినల్లా అడుగుతున్నారు. తప్పులు దొర్లితే ఓటు ఎక్కడ తొలగిస్తారోననే భయం ఓటర్లను వేధిస్తోంది.

​సాంకేతిక పదజాలం.. డిజిటలైజేషన్ ఇబ్బందులు
ఎన్యుమరేషన్ ఫారంను పూరించేటప్పుడు కొన్ని సాంకేతిక పదాలు ఇబ్బంది కలిగిస్తున్నాయి. కుటుంబ సభ్యుల వివరాలు, వారి ఓటరు గుర్తింపు కార్డుల నంబర్లతో పాటు ప్రొజెనీ(సంతతి), సెల్ఫ్, నో మ్యాపింగ్ వంటి సాంకేతిక పదాలు ఎలా నింపాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. డిజిటలైజేషన్ (ఆన్‌లైన్) ప్రక్రియ ప్రారంభ దశలోనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ 4.25శాతంగా ఉందని సమాచారం. మొత్తం 85.18శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయింది. బూత్ లెవల్ ఆఫీసర్ల ద్వారా మొత్తం 14,38,446 ఫారాలు (4.25శాతం) మాత్తమే డిజిటలైజ్ చేయబడ్డాయని తెలుస్తోంది.
​ఖమ్మం జిల్లాలో 12,43,781 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 98.21 శాతం (12,21,533 మంది ఓటర్లకు) గణన ఫారంలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 1,47,344 ఫారంలను మాత్రమే డిజిటలైజ్ చేశారు.‌ రాష్ట్రంలో నల్గొండ తర్వాత ఖమ్మం జిల్లా డిజిటలైజేషన్‌లో రెండో స్థానంలో ఉండటం గమనార్హం. ఫారాల సేకరణ వేగంగా జరగాలంటే ఓటర్లకు బీఎల్‌ఓల ద్వారా అవగాహన కల్పించాలని, తద్వారా ఇబ్బందులు తప్పి ఎస్ఐఆర్ ఆశయం నెరవేరుతుందని పలువురు సూచిస్తున్నారు.

ఆన్‌లైన్-ఆఫ్‌లైన్ సమస్యలు
ఆన్‌లైన్ ద్వారా ఫారం పూరించే సమయంలో ఆధార్ కార్డులోని పేరు (ఉదాహరణకు : ఇంటిపేరు ముందు వెనుక ఉండటం), ఓటర్ ఐడీలోని పేరుతో సరిగ్గా సరిపోలకపోతే ఆన్‌లైన్ సబ్మిషన్ నిలిచిపోతోంది. ఆన్‌లైన్‌లో ఎన్యుమరేషన్ ఫారం పూర్తి చేయాలంటే ఓటర్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. లింక్ లేని వారు ముందుగా ఫారం-8 ద్వారా మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసుకోవాల్సి వస్తోంది. 2002 నాటి ఓటర్ లిస్ట్‌లోని పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ వంటి పాత వివరాలను వెతకడం ప్రస్తుత వివరాలతో వాటిని మ్యాపింగ్ చేయడం పెద్ద సమస్యగా మారింది. ఫారంలో తప్పులు దొర్లినప్పుడు ఓటర్లు వైట్‌నర్లు వాడుతున్నారు. వైట్‌నర్ ఉపయోగించిన ఫారంలు చెల్లవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇంగ్లీష్, మిగిలిన చోట్ల తెలుగులో ఫారాలు ఇస్తున్నారు. ఉర్దూ మాత్రమే చదవగలిగే కొందరు ముస్లింలు, ఇతర భాషలు మాత్రమే చదవగలిగేవారు ఈ ఫారాలను అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.

ఫారాలు నింపటం కష్టంగా ఉంది
ఫారాలు ఇచ్చి నింపాలని వెళ్లారు. అందులో ఏ విషయాలు సరిగ్గా అర్థం కావట్లేదు. 2002 ఓటరు జాబితాలో మా పేర్లు ఉన్నాయి. దరఖాస్తుకు ఏమేం జత చేయాలనే సమాచారం లేదు. అవగాహన కల్పించకపోవటంతో తెలియక ఏమైనా పొరపాట్లు చేస్తే ఇబ్బంది అవుతుందేమోనని ఆలోచిస్తున్నాం. పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి.
-ఎన్. లక్ష్మీతిరుపతమ్మ, ప్రయివేటు టీచర్, ఏదులాపురం మున్సిపాలిటీ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -