ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
సంగారెడ్డిలో నాయకుల బైండోవర్
విద్యార్థులకు గాయాలు
నవతెలంగాణ-సంగారెడ్డి
పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్, ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేశారు. పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు గడిచినా ఇప్పటికీ యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ తదితర సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందలేదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని సుమారు 27వేల ప్రభుత్వ పాఠశాలలను 4వేల పాఠశాలలుగా కుదించే ప్రతిపాదన ప్రభుత్వ విద్యా వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉందన్నారు. పాఠశాలల సంఖ్యను తగ్గించకుండా, జనాభా ప్రాతిపదికన కొత్త ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేసి, ఇప్పటికే ఉన్న పాఠశాలలను మరింత బలోపేతం చేయాలని కోరారు. ఈ క్రమంలో పలు చోట్ల పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. పలువురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు.
సంగారెడ్డి పట్టణంలోని గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ నుంచి విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెకరేట్‌లోనికి పోయేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పోలీస్‌లకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను తహసీల్దార్ ముందు హాజరు పరిచి బైండోవర్ చేశారు. మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. మహబూబాబాద్ కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. వందలాది మంది విద్యార్థులతో కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, ఎస్‌ఎఫ్‌ఐ నేతలకు మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. ములుగు జిల్లాలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువుల రోజురోజుకూ రోడ్డున పడుతున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ల నాగరాజు అన్నారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట అర్ధనగ ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు గేటు తోచుకుని ముందుకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నప్పటికీ విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు, సరిపడా పాఠ్యపుస్తకాలు అందించలేదన్నారు. పాఠశాలలను తగ్గించడమంటే ప్రభుత్వం విద్యారంగం నుంచి తప్పుకోవడమేనని విమర్శించారు. యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా అనంతరం జిల్లా పరిపాలనాధికారి అంజిరెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలను విరమించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామోర కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. విద్యాశాఖలో వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, ఎంఈవోలు, డీఈవోలు, లెక్చరర్లు ఇతర పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రయివేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించేందుకు చట్టాన్ని చేయాలని కోరారు. కరీంనగర్‌లోని తెలంగాణ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ తీసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా జరిగింది.
స్కాలర్‌షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



