Tuesday, July 7, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుహైదరాబాద్‌లో తొలి ఏరోబిన్ కంపోస్ట్ హార్వెస్ట్

హైదరాబాద్‌లో తొలి ఏరోబిన్ కంపోస్ట్ హార్వెస్ట్

- Advertisement -

పీర్జాదిగూడ పర్వతాపూర్‌‌లో పైలెట్‌ ‌ప్రాజెక్టు
ఈ నెల 10న ప్రారంభించనున్న కమిషనర్‌ ‌వినయ్‌ ‌కృష్ణారెడ్డి
కార్పొరేషన్‌ అంతటా విస్తరణకు నిర్ణయం
‘ఎస్‌‌డబ్ల్యూఎం రూల్స్‌-2026’ అమలులో ‘ఎంఎంసీ’ మరో మైలురాయి

నూతన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు (ఎస్‌‌డబ్ల్యూఎం రూల్స్‌-2026) అమలులో భాగంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఒక కీలక మైలురాయిని అధిగమించింది. ‘మోడరన్ ఆర్కిటెక్ట్స్ ఫర్ రూరల్ ఇండియా’ (ఎంఏఆర్‌ఐ) స్వచ్ఛంద సంస్థ, ‘స్వర్ణ లతా మదర్సన్ ట్రస్ట్’ భాగస్వామ్యంతో పీర్జాదిగూడలో తడి చెత్త ప్రాసెసింగ్ కోసం పైలట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన 5 ఏరోబిన్ కంపోస్టర్లను విజయవంతంగా అమలు చేశారు. స్థానిక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్‌‌డబ్ల్యూఏ) నాయకులకు ఏరోబిన్ కంపోస్టర్ విధానంపై అవగాహన కల్పించడం, వారిని తమ కాలనీలలోనే తడి చెత్తను తామే నిర్వహించుకునేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
నవతెలంగాణ-సిటీబ్యూరో
పీర్జాదిగూడలోని పర్వతాపూర్ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పార్క్‌లో నగరంలోనే మొట్టమొదటి ఎరోబిన్ కంపోస్ట్ హార్వెస్ట్‌ను ఎంఎంసీ కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఈ నెల 10న ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు.
ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో అత్యాధునిక కంపోస్టింగ్ సాంకేతికత కలిగిన ‘ఏరోబిన్ కంపోస్టర్’ను ఉపయోగించారు. ఇది తడి చెత్తను అత్యంత సమర్థవంతంగా సేంద్రీయ ఎరువుగా మారుస్తుంది. ఇది కరెంట్ అవసరం లేకుండా పూర్తిగా సహజమైన ఏరోబిక్ ప్రక్రియతో పని చేస్తుంది. పట్టణ ప్రాంత నివాసాలకు అనుకూలంగా ఉండేలా ఇది ఎలాంటి దుర్వాసన రాకుండా, ఈగలు-దోమల బెడద లేకుండా పని చేస్తుంది. సాధారణ పద్ధతులతో పోలిస్తే ఇది చాలా వేగంగా కంపోస్ట్‌ను సిద్ధం చేస్తుంది. దీని కాంపాక్ట్ డిజైన్ కారణంగా ఇది గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్‌లు, బల్క్ వేస్ట్ జనరేటర్లకు ఎంతో అనువైనది.

​త్వరలో కార్పొరేషన్‌ అంతటా విస్తరణ
ఇటీవల కమిషనర్, అడిషనల్ కమిషనర్‌లతో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ప్రాజెక్టును కార్పొరేషన్ అంతటా విస్తరించాలని నిర్ణయించారు. కార్పొరేషన్‌లోని ప్రతి సర్కిల్‌లోనూ కనీసం ఒక ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీ లేదా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ పరిధిలో ఈ ప్రాజెక్ట్‌ను విధిగా అమలు చేయనున్నారు. ఈ విస్తరణలో భాగంగా ఆగస్టు 1 నుంచి ‘ఎస్‌ఎల్‌ఎంఐటీ’ సంస్థ వారి ‘సీఎస్‌ఆర్‌’లో భాగంగా ప్రతిష్టాత్మక ‘ఎస్‌ఓఆర్‌‌టీ’ (సెగ్రెగేషన్‌ ఆఫ్‌ ‌వాటర్‌ ‌ఫర్‌ ‌రీసైక్లింగ్‌ అండ్‌ ‌ట్రీట్‌‌మెంట్‌) ప్రాజెక్ట్ ఆర్థిక సహకారంతో, ‘ఎంఏఆర్‌ఐ’ సంస్థ, మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్ సంయుక్తంగా ఎంపిక చేసిన 15 వ్యూహాత్మక ప్రాంతాల్లో 80 ఏరోబిన్ యూనిట్లను ఏర్పాటు చేయనుంది. ఇందుకు 13 నివాస ప్రాంతాలతో పాటు ఒక విద్యా సంస్థను సైతం భాగస్వామ్యం చేయనున్నారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ ఉన్న పీర్జాదిగూడ కేంద్రాన్ని మోడల్ అభ్యాస, ప్రదర్శన కేంద్రంగా కొనసాగిస్తారు.​విలువైన సంపదగా తడి చెత్త ఏరోబిన్ కంపోస్టర్ ద్వారా తడి చెత్త నిర్వహణ సుస్థిరంగా, విజయవంతంగా సాగడానికి ‘ఎంఏఆర్‌ఐ’ సంస్థ తరపున ప్రత్యేక ప్రాజెక్ట్ సిబ్బంది రోజువారీ పనులను, సాంకేతిక పర్యవేక్షణను చూసు కుంటారు. ఈ ప్రాజెక్ట్ అమలు చేసే ప్రాంతాల్లో తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లి తడి-పొడి చెత్తను వేరు చేసే అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్థానిక పారిశుధ్య కార్మికులు, హౌస్ కీపింగ్ సిబ్బందికి సాంకేతిక శిక్షణ ఇస్తారు. చెత్తను ఎక్కడికక్కడే స్థానికంగానే విభజించి, ప్రాసెస్ చేయడం ద్వారా, మున్సిపాలిటీకి రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా డంపింగ్ యార్డుల కోసం అవసరమైన భూ భారం తగ్గుతుంది. తద్వారా పల్లెల్లాగే నగరాల్లోనూ తడి చెత్తను విలువైన సంపదగా మార్చొచ్చని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ విషయమై సోమవారం జరిగిన సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, పారిశుధ్య అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, ‘ఎంఏఆర్‌ఐ’ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళి, ప్రాజెక్ట్ మేనేజర్ సుధా పోలేని, ‘ఐటీసీ’ ప్రతినిధులు ఉమాకాంత్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -