ఇది భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడే : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రశ్న రావణ్ అనే యూట్యూబర్‌పై అత్యంత కఠినమైన ఉపా (చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం) చట్టాన్ని ప్రయోగించడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఖండించారు. దేశ సమగ్రతను, భద్రతను కాపాడటానికి ఉద్దేశించిన ఈ చట్టాన్ని, ప్రభుత్వ విధానాలను విమర్శించిన ఒక సామాన్య యూట్యూబర్‌పై ప్రయోగించడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. ఇది భావప్రకటనా స్వేచ్ఛపైనే దాడి అని అభివర్ణించారు. రావణ్‌పై నమోదు చేసిన అక్రమ కేసులను, ఉపా సెక్షన్లను ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. రావణ్‌పై నమోదైన కేసుల్లో ఏకంగా నాలుగుసార్లు కోర్టులు బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఆంధప్రదేశ్ ప్రభుత్వం అతనిపై పగబట్టి మరీ ప్రమాదకరమైన ఉపా చట్టాన్ని ప్రయోగించడం కక్ష సాధింపు చర్యే అని స్పష్టం చేశారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ మాట్లాడిన మాటలనే అనుకరించి రావణ్ మాట్లాడారనీ, దానికే అతనిపై ఉపా చట్టాన్ని ప్రయోగించడం దారుణమని పేర్కొన్నారు. అదే పవన్‌కళ్యాణ్‌పై కేసు పెడతారా? అని ప్రశ్నించారు. ఇది చట్టాన్ని, న్యాయ వ్యవస్థను ధిక్కరించడమేనని తెలిపారు. ఉపా చట్టాన్ని రాజకీయ కక్షసాధింపులకు, ప్రజా గొంతుకలను నొక్కేందుకు ఆయుధంగా వాడుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని పేర్కొన్నారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలపైనా, ప్రభుత్వ వైఫల్యాలపైనా ప్రశ్నించేవారిపై ఉగ్రవాదులపై పెట్టే కేసులను పెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే హక్కును ఎవ్వరూ కాలరాయలేరనీ, ఇటువంటి నిరంకుశ చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.
ప్రశ్న రావణ్‌పై ఉపాను ఖండిస్తున్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



