ప్రయివేటు డీలర్లదే పెత్తనం
డీలర్ నమోదు చేయకుంటే బోనస్ డొల్ల..
సన్న ధాన్యం కొనుగోళ్లపై
కొత్త నిబంధనలు
విత్తనాలు కొనుగోలు చేసిన రెండు నెలల తర్వాత ఉత్తర్వులు
రైతుల్లో ఆందోళన
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వం ప్రకటించిన సన్న వరి బోనస్ పథకంపై కొత్త నిబంధనలు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన దాదాపు రెండు నెలల తర్వాత ప్రయివేట్ డీలర్లు రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో బోనస్ అర్హత డీలర్లపైనే ఆధారపడి ఉంది.
కొనుగోలుకు ముందే నమోదు చేయాల్సి ఉండగా..
ప్రభుత్వం బి.పి.టి-5204, ఆర్‌ఎన్‌ఆర్-15048, హెచ్‌ఎంటీ సోనా, కేఎన్‌ఎం-1638, కేఎన్‌ఎం-7715, డబ్ల్యూజీఎల్-44, జై శ్రీరామ్ రకాల సన్న వరి ధాన్యాలకే బోనస్ ప్రకటించింది. ఈ విత్తనాలను రైతులు జూన్ 23 నుంచి 30 వరకు విత్తన మేళాల్లో లేదా ప్రయివేట్ డీలర్ల వద్ద కొనుగోలు చేశారు. విత్తనాల కొనుగోలు సమయంలో నమోదు గురించి ఎలాంటి నిబంధనలూ లేకపోయినా, ఇప్పుడు రైతుల వివరాలను డీలర్లే పోర్టల్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ముందస్తు సమాచారం లేకుండా కొత్త నిబంధనలు అమలు చేయడంపై రైతు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఏడు రకాల సన్నాలకే బోనస్ అనేదే సీజన్ ప్రారంభమయ్యాక ప్రభుత్వం ప్రకటించడంపై అప్పటికే విత్తనాలు కొనుగోలు చేసిన
చాలా మంది రైతులు ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వారికే బోనస్ అనేలా ప్రభుత్వ ఆదేశాలుండటం సన్నాలకు క్రమంగా బోనస్ ఎగ్గొటడానికే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
డీలర్ నమోదు చేయకుంటే బోనస్ రానట్టే..
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విత్తనాలు కొనుగోలు చేసిన రైతుల వివరాలను సంబంధిత డీలర్లే నమోదు చేయాలి. నమోదు జరగకపోతే రైతు వద్ద బిల్లు ఉన్నా బోనస్ కోల్పోయే ప్రమాదం ఉంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దాంతో ఆన్‌లైన్‌లో నమోదు కోసం రైతులు బిల్లులు చేతబట్టుకుని డీలర్ల వద్దకు పలుమార్లు వెళ్లాల్సి వస్తోంది. సాగు పనుల మధ్య సమయం, ప్రయాణ ఖర్చు, కూలి నష్టం భరించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. నమోదు ఆలస్యం లేదా సాంకేతిక సమస్యలు తలెత్తితే మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
తప్పించుకునేందుకే కొత్త నిబంధనలా..?
రాష్ట్రంలో వరి దిగుబడి పెరుగుతున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు భారం తగ్గించుకోవడానికే ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చిందనే అనుమానాలను రైతు సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. నమోదు లోపాల పేరుతో అర్హులైన రైతులు కూడా బోనస్‌కు దూరమయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాపై ఎక్కువ ప్రభావం
తెలంగాణలోనే అత్యధికంగా వరి సాగు జరిగే ఉమ్మడి నల్లగొండ జిల్లాపై ఈ నిర్ణయం అత్యధిక ప్రభావం చూపనుంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 22.10 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా, అందులో 11 లక్షల ఎకరాలకు పైగా వరి సాగవుతోంది. నల్లగొండ జిల్లాలో 5.56 లక్షల ఎకరాలు, సూర్యాపేటలో 4.15 లక్షల ఎకరాలు, యాదాద్రి భువనగిరిలో దాదాపు 3 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. లక్షలాది మంది రైతులు ఈ బోనస్‌పై ఆశలు పెట్టుకోవడంతో నమోదు ప్రక్రియలో నిర్లక్ష్యం జరిగితే పెద్ద సంఖ్యలో రైతులు నష్టపోయే అవకాశం ఉంది. వీరిలో ఎక్కువ మంది రైతులు చిన్న, సన్నకారు రైతులే. సూర్యాపేట జిల్లాలోనే 2.70 లక్షలకు పైగా రైతు ఖాతాలు ఉండగా, అందులో అత్యధికులు సన్నకారు రైతులే. నల్లగొండ జిల్లాలో 3.5 నుంచి 4 లక్షల మంది, యాదాద్రి భువనగిరిలో 2 లక్షలకు పైగా రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ప్రయివేట్ డీలర్ల నుంచే విత్తనాలు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
ప్రతి రైతుకూ బోనస్ ఇవ్వాలి
రైతు సంఘం రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్నాలు పండించిన ప్రతి రైతుకూ బోనస్ ఇవ్వాలి. డీలర్లపై మాత్రమే ఆధారపడే విధానాన్ని సడలించాలి. నమోదు గడువు పొడిగించి ప్రతి రైతుకూ బోనస్ అందేలా చర్యలు తీసుకోవాలి. గ్రామస్థాయిలో ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించాలి. ఏఈఓలు నేరుగా రైతుల వద్దకు వెళ్లి నమోదు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌లో నమోదైతేనే బోనస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



