Thursday, July 9, 2026
E-PAPER
Homeజాతీయంపేదల ఆహార హక్కును కాపాడుకుందాం

పేదల ఆహార హక్కును కాపాడుకుందాం

- Advertisement -

జాతీయ ఆహార భద్రతా చట్ట సవరణలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళ‌న‌
ఏఐఎడబ్ల్యూయూ, ఐద్వా, ఏఐకేఎస్‌, సీఐటీయూ పిలుపు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

​కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టానికి ప్రతిపాదించిన సవరణలకు వ్యతిరేకంగా, పేదల ఆహార హక్కును కాపాడేందుకు దేశవ్యాప్త ఆందోళ‌న‌కు ప్ర‌జా సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేర‌కు బుధ‌వారం ఏఐఎడబ్ల్యూయూ, ఐద్వా, ఏఐకేఎస్‌, సీఐటీయూ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు బి. వెంకట్, కనినిక ఘోష్, విజూ కృష్ణన్, ఎల‌మ‌రం క‌రీం సంయుక్తంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఒక కుటుంబానికి 35 కిలోల రేషన్ కోటాలో నుంచి ఓ వ్యక్తికి 7 కిలోలకు తగ్గించేలా ‘ఆహార, ప్రజా పంపిణీ శాఖ’ ప్రతిపాదించిన ‘జాతీయ ఆహార భద్రతా సవరణ బిల్లు’కు వ్యతిరేకంగా ఈ ఆందోళ‌న చేప‌ట్టాల‌ని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన జీవనానికి అత్యంత పేద వర్గాలకు ప్రస్తుతం ఉన్న కోటా కంటే చాలా ఎక్కువ ఆహారం అవసరమని వైద్య నిపుణులు, పోషకాహార నిపుణులు, విద్యావేత్తలు ఇప్పటికే గుర్తించార‌ని తెలిపారు. శారీరక సమగ్ర వికాసానికి ఒక్కో వ్యక్తికి కనీసం 14 కిలోల ఆహార ధాన్యాలు అవసరమని ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌) గతంలోనే సిఫారసు చేసింద‌ని వివరించారు. అయినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం కోటాను మరింత తగ్గించాలని ప్రతిపాదించడం, దేశంలోని పేదలు, కార్మిక వర్గాల సంక్షేమం పట్ల వారికి ఉన్న నిర్లక్ష్య వైఖరిని స్పష్టం చేస్తోందని విమ‌ర్శించారు.

‘‘చిన్న‌, పెద్ద కుటుంబాల మధ్య ఆహార ధాన్యాల పంపిణీలో అసమానత ఉంద‌నేది ప్రభుత్వం చూపిస్తున్న కారణం. ఈ అసమానతను సరిదిద్దేందుకు ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి 7 కిలోల ఆహార ధాన్యాలను అందించాలని నిర్ణయించింది. అయితే, అన్ని కుటుంబాలకు తగినంత ఆహార ధాన్యాలను అందించడానికి బదులుగా కొన్ని కుటుంబాలకు కోటాను తగ్గించాలని నిర్ణయించడం ఈ వాదనలోని బలహీనతను ఎత్తిచూపుతోంది. అంతేకాకుండా, అదే బిల్లులో కుటుంబానికి గరిష్ట రేషన్ పరిమితిని 35 కిలోలుగా నిర్ణయించడం వల్ల, వారి వాదనకు ఎటువంటి ఆచరణాత్మక ఆధారం లేకుండా పోయింది. కుటుంబానికి గరిష్ట పరిమితి 35 కిలోలుగానే కొనసాగుతుంది కాబట్టి, 5 మంది కంటే ఎక్కువ సభ్యులున్న కుటుంబాలకు తలసరి 7 కిలోల కంటే తక్కువ ఆహార ధాన్యాలు అందుతాయి. ఫలితంగా పంపిణీలో అసమానత కొనసాగుతూనే ఉంటుంది. బీజేపీ ప్రభుత్వం భావించే సమానత్వం అంటే ‘అందరికీ పేదరికం’ .. అంటే ప్రజలు పేదలుగా ఉంటే, అందరూ సమానంగా పేదలుగానే ఉండాలన్నమాట’’ అని ఎద్దేవా చేశారు.

‘‘ప్రస్తుతం 236.9 లక్షల అంత్యోదయ కుటుంబాలు (మొత్తం 939.4 లక్షల మంది ప్రజలు) తమ జీవనోపాధి కోసం ఏఎవై పథకంపై ఆధారపడి ఉన్నాయి. ఈ లబ్దిదారులలో అసంఘటిత రంగ కార్మికులు, సంప్రదాయ వృత్తుల వారు, వ్యవసాయ కూలీలు, భూమి లేని కూలీలు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, దళితులు, ఆదివాసీలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులు, ఇతర అత్యంత బలహీన వర్గాల వారు ఉన్నారు. ప్రస్తుత పాలక వర్గం విధానాల కారణంగా ఈ అట్టడుగు వర్గాలకు సరైన వైద్య సేవలు, ఉద్యోగాలు లేదా సామాజిక భద్రతా ప్రయోజనాలు అందడం లేదు. వారికి రోజుకు రెండు పూటలా ఆహారం లభించడానికి ఈ పథకమే ఏకైక మార్గం. అయినప్పటికీ కేంద్రం ‘’సమాన పంపిణీ’ అనే విచిత్రమైన ఆలోచన పేరుతో ప్రస్తుతం అందుతున్న రేషన్ కోటాను తగ్గించాలని నిర్ణయించింది’’ అని వారు విమర్శించారు.

ప్రస్తుత చట్టంలోనూ అనేక వివాదాస్పద అంశాలు
‘‘ప్రస్తుతం అమలులో ఉన్న జాతీయ ఆహార భద్రతా చట్టం-2013 (ఎన్ఎఫ్ఎస్ఎ)లో కూడా అనేక వివాదాస్పద అంశాలు ఉన్నాయని, లక్షలాది మంది పేదలకు ఇంకా దీని ప్రయోజనాలు అందడం లేదన్న వాస్తవాన్ని ఈ ప్రతిపాదిత సవరణ పూర్తిగా విస్మరిస్తోంది. రాయితీతో కూడిన ఆహార కోటా 2011 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించబడింది. అప్పటి నుంచి దేశ జనాభా గణనీయంగా పెరిగినప్పటికీ, ఆ కోటాను మాత్రం సవరించలేదు. ఆర్థికవేత్తలు రీతికా ఖేరా, జీన్ డ్రెజ్, మేఘనా ముంగికర్ 2021లో చేసిన అంచనా ప్రకారం, ఎన్ఎఫ్ఎస్ఎ పరిధిలోని ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ‌నుంచి 10 కోట్లకు పైగా ప్రజలు మినహాయించబడ్డారు’’ అని తెలిపారు.

మహిళల కష్టాలు తీవ్రం
‘‘ఆకలి, ఆహారం, పేదరికం వంటి అంశాలపైనే ప్రస్తుత బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వానికి సరైన అవగాహన లేదు. తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం పథకాలను నిర్దిష్ట వర్గాలకు మాత్రమే చేరవేయడంపై దృష్టి సారించడం వల్ల, దేశవ్యాప్తంగా అందరికీ ఆహార భద్రత కల్పించాల్సిన ఆవశ్యకత తీవ్రంగా దెబ్బతింది. ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ (2019-21) గణాంకాల ప్రకారం… 35.5 శాతం మంది పిల్లలు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. 32.1 శాతం మంది తక్కువ బరువుతో ఉన్నారు. 6 నుంచి 59 నెలల వయస్సు గల పిల్లల్లో 67.1 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థతో అవసరమైన క్యాలరీలు లభించడం లేదు. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఆహార రాయితీని తగ్గించి, ప్రభుత్వ ఖజానాలోని అధిక భాగాన్ని కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం మళ్లించడం తప్ప, రేషన్ కోటాను తగ్గించడానికి ప్రభుత్వం ఎలాంటి సమంజసమైన కారణం చూపలేదు. ఇది అత్యంత పేదవారి, ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలోని దళితులు, ఆదివాసీలు, మహిళల కష్టాలను మరింత తీవ్రతరం చేస్తుంది’’ అని పేర్కొన్నారు.

​ఈ నేపథ్యంలో ‘‘ఎన్ఎఫ్ఎస్ఎకి ప్రతిపాదించిన సవరణను ఖండిస్తున్నాం. దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుత ఎన్ఎఫ్ఎస్ఎలో ఈ క్రింది మెరుగుదలలను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. 1. ఆహార ధాన్యాల పంపిణీని పెంచడం. ఇందులో ఆరోగ్యకరమైన క్యాలరీలు, అన్ని అత్యవసర ఆహార పదార్థాలను చేర్చడం, అలాగే దీనిని అందరికీ (సార్వత్రిక పద్ధతిలో) వర్తింపజేయడం. 2. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన ఎన్ఎఫ్ఎస్ఎ పరిధిని సవరించడం. ఏ ఒక్క వ్యక్తిని కూడా దీని నుంచి మినహాయించకూడదు’’ అని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -