Thursday, July 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమధ్యప్రాచ్యంలో మళ్లీ మంటలు

మధ్యప్రాచ్యంలో మళ్లీ మంటలు

- Advertisement -


దద్దరిల్లిన కువైట్, బహ్రెయిన్..
సైరన్ల మోతలతో ఉలిక్కిపడుతున్న పశ్చిమాసియా
ఇరాన్‌లోని 80 లక్ష్యాలపై అమెరికా దాడులు.. 85 అమెరికా స్థావరాలపై విరుచుకుపడిన టెహ్రాన్
ఎంఓయూ కథ ముగిసింది : ట్రంప్
ధీటుగా తిప్పికొడతాం : టెహ్రాన్

నవతెలంగాణ – జనరల్ డెస్క్
మధ్యప్రాచ్యం మరోసారి దాడులతో దద్దరిల్లింది. అమెరికా సేనలు మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ ఏకంగా 80 ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేశాయి. అమెరికా దాడులపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. దాడులకు తగిన విధంగా జవాబిస్తానని హెచ్చరించింది. కువైట్, బహ్రెయిన్ లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఆ తర్వాత కొద్దిసేపటికే బహ్రెయిన్, కువైట్‌లలో గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలకం చేశారు. ఇరాన్ చమురు ఎగుమతులకు కీలకంగా ఉన్న ఖర్గ్ దీవిలో పేలుడు శబ్దాలు వినిపించాయి. అలాగే ఓడరేవు పట్టణాలైన బందర్ అబ్బాస్, సిరిక్‌లతో పాటు ఖెష్మ్ దీవిలో కూడా పేలుళ్లు సంభవించాయి. సిరిక్‌పై జరిగిన దాడిలో అనేక మంది గాయపడ్డారని తెలుస్తోంది. బందర్ అబ్బాస్‌లో మత్స్యకారులకు చెందిన అనేక పడవలు దగ్థమయ్యాయి. దివంగత సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీకి ఖ్వోమ్ నగరంలో లక్షలాది మంది నివాళులు అర్పించిన మరునాడే అమెరికా ఈ దాడులకు దిగడం గమనార్హం. ఇరాన్‌తో కుదుర్చుకున్న ఎంఓయూ కథ ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టర్కీలో చెప్పారు.

ఇరాన్‌ను దెబ్బతీసేందుకే : సెంట్‌కామ్
‘మా దళాలు ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు, కమాండ్-కంట్రోల్ వ్యవస్థలు, కోస్తా రాడార్ కేంద్రాలు, నౌకా క్షిపణి విధ్వంసక సామర్ధ్యాలపై దాడులు చేశాయి. హార్ముజ్ సమీపంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ)కు చెందిన అరవై చిన్న పడవలపై కూడా దాడి జరిపాయి’ అని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ఓ ప్రకటనలో వివరించింది. ఒప్పందానికి కట్టుబడి ఉండకపోయినా లేదా దానికి విధేయత చూపకపోయినా ఇరాన్‌ను బాధ్యురాలిని చేసేందుకు తమ దళాలు సిద్ధంగా ఉంటాయని చెప్పింది. ఇరాన్‌ను తీవ్రంగా నష్టపరచడమే ఈ దాడుల ఉద్దేశమని తెలిపింది. ఇరాన్ దళాల అవాంఛనీయ దుందుడుకు చర్యలు కాల్పుల విరమణకు తూట్లు పొడిచాయని, హార్ముజ్‌లో నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించకుండా అడ్డుకున్నాయని ఆరోపించింది. కాగా పర్షియన్ గల్ఫ్‌లోనూ, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లోనూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీరంలో బుధవారం ఉదయం పదికి పైగా అమెరికా యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి.

ధీటుగా తిప్పికొడతాం : టెహ్రాన్
‘అమెరికా దూకుడుకు, ఉగ్రవాద చర్యలకు మా సాయుధ దళాలు తగిన విధంగా జవాబిస్తాయి. అమెరికా దాడులను సమర్ధవంతంగా తిప్పికొడతాయి’ అని ఇరాన్‌కు చెందిన ఖతమ్ అల్`అన్బియా కేంద్ర కార్యాలయం తెలిపింది. హార్ముజ్ జలసంధి నిర్వహణలో కానీ, వ్యవహారాలలో కానీ ఇతరుల జోక్యాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. ఇరాన్ నిర్దేశించిన మార్గాలలో ప్రయాణించే నౌకలు మాత్రమే సురక్షితంగా ఉంటాయని చెప్పింది. తమతో కుదుర్చుకున్న ఎంఓయూను అమెరికా ఉల్లంఘిస్తోందని ఇరాన్ శాంతి చర్చల ప్రతినిధి మహమ్మద్ బాఘర్ ఘలీబఫ్ ఆరోపించారు. ‘బెదిరింపులు, దోపిడీల కాలం చెల్లిపోయింది. మేము ఎవరికీ తలవంచం’ అని ఆయన చెప్పారు. దేశ ప్రయోజనాలను, భద్రతను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపింది. సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్లొనేందుకు ఇరాక్ వెళ్లిన దేశాధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తాజా పరిణామాల నేపథ్యంలో హుటాహుటిన స్వదేశానికి చేరుకున్నారు.

ఎంఓయూకు కాలం చెల్లింది.. స్పెయిన్‌తో దోస్తీ కటీఫ్ : ట్రంప్
మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్‌తో కుదుర్చుకున్న ఎంఓయూకు కాలం చెల్లిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక టెహ్రాన్‌తో ఎలాంటి సంప్రదింపులు ఉండబోవని స్పష్టం చేశారు. ఇరాన్ నాయకత్వం అనారోగ్యంతో బాధపడుతోందని వ్యాఖ్యానించారు. ఆగస్టు మధ్య నాటికి దీర్ఘకాలిక శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఉద్దేశించిన ఎంఓయూ కథ కంచికి చేరిందా అని విలేకరులు ప్రశ్నించగా ‘ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. నాకు సంబంధించినంత వరకూ అది ముగిసిన అధ్యాయమని అనుకుంటున్నాను. ఇక నేను వారితో ఎలాంటి సంబంధాలు పెట్టుకో దలచుకోలేదు. వారు నీచులు. రోగులు. వారికి నాయకత్వం వహిస్తున్నది కూడా వ్యాధిగ్రస్థులే. నన్ను అడిగితే వారితో వ్యవహారాలు నడపడం వల్ల సమయం వృథా అవడం తప్ప ప్రయోజనం ఉండదు’ అని చెప్పారు. టర్కీ రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో నేతల సదస్సు సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ స్పెయిన్‌తో వాణిజ్య సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్‌ను ఆదేశించానని చెప్పారు. నాటోలో స్పెయిన్ ‘భయానక భాగస్వామి’ అని అన్నారు. స్పెయిన్‌తో ఎలాంటి వాణిజ్య సంబంధాలు పెట్టుకోబోమని అన్నారు. ఇరాన్‌పై తాను సాగించిన యుద్ధానికి మద్దతు ఇవ్వనందుకు మిత్రదేశాలపై ట్రంప్ మరోసారి చిందులు తొక్కారు. గ్రీన్‌లాండ్‌పై మరోసారి తన వాదనను వినిపించారు. ట్రంప్ వ్యాఖ్య నాటో మిత్రదేశమైన డెన్మార్క్‌కు ఆగ్రహం తెప్పించింది. నాటో సదస్సు ఉక్రెయిన్‌కు సంఘీభావాన్ని, మద్దతును తెలియజేస్తుందని ఆశించిన ఐరోపా నేతలకు చివరికి నిరాశే ఎదురైంది.
అమెరికా, స్పెయిన్ దేశాల మధ్య తీవ్ర విభేదాలు పొడసూపాయి. ఐరోపా దేశాలు తమ సైనిక వ్యయాన్ని గణనీయంగా పెంచుకోవాలని, తమ రక్షణ వ్యయాన్ని తామే భరించాలని ట్రంప్ సూచించగా అందుకు స్పెయిన్ నిరాకరించింది. ఇరాన్‌పై యుద్ధం కోసం తమ గగనతలాన్ని, సైనిక స్థావరాలను అమెరికా ఉపయోగించుకునేందుకు నిరాకరించింది. ట్రంప్ తాజా ప్రకటనను స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ కార్యాలయం తేలికగా తీసుకుంది. దీనిని మామూలు విషయంగానే చూస్తున్నామని, ద్వైపాక్షిక సంబంధాలు ఇరు దేశాలకూ ప్రయోజనకరమేనని తెలిపింది.

కాల్పుల విరమణ ఒప్పందంపై నీలినీడలు
దాడులు-ప్రతి దాడుల నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా 60 రోజుల పాటు ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేస్తానని చెప్పిన అమెరికా…తాజాగా తిరిగి వాటిని విధించింది. హార్ముజ్ సమీపంలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేసిందని, అందుకు ప్రతీకారంగానే తిరిగి ఆంక్షలు విధించానని అమెరికా చెప్పింది.

అమెరికా స్థావరాలపై 
ఇరాన్ దాడులు
ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడులకు ప్రతిగా బహ్రెయిన్ లోని 85 అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించామని ఐఆర్‌జీసీ తెలిపింది. బహ్రెయిన్ లోని సాల్మన్ పోర్టులో ఉన్న అమెరికా సైనిక కేంద్రాలపై తమ నౌకా, వైమానిక దళాలు సంయుక్తంగా దాడులు చేశాయని వివరించింది. సాల్మన్ ఓడరేవులో అమెరికా నౌకాదళానికి చెందిన ఫిప్త్ ఫ్లీట్ పనిచేస్తోంది. పర్షియన్ గల్ఫ్, ఎర్ర సముద్రం, అరేబియా సముద్రంలో నిఘా కార్యకలాపాలు నిర్వహించడం దీని పని. కాగా కువైట్‌లోని అలీ అల్ సలేం వైమానిక స్థావరంపై కూడా ఐఆర్‌జీసీ దాడి చేసింది. ఇరాన్ వైపు నుంచి దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్లను అడ్డుకుంటున్నామని కువైట్ చెప్పింది. ఇరాన్ దాడులను అడ్డుకునే క్రమంలో పేలుడు శబ్దాలు వినిపించవచ్చునని తెలిపింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో బహ్రెయిన్ లో సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలలో తలదాచుకోవాలని కోరారు. రెండు గంటల వ్యవధిలోనే బహ్రెయిన్ ఆంతరంగిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ రెండు హెచ్చరికలు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -