Saturday, March 7, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమూసీ ప్రక్షాళన చేసి తీరుతాం

మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం

- Advertisement -

అభివృద్ధి చేస్తుంటే గుంపులుగా అడ్డుకుంటున్నారు
రంగారెడ్డి జిల్లాను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతా : సీఎం ఎ.రేవంత్‌రెడ్డి
శంషాబాద్‌లో అతిపెద్ద రైల్వేస్టేషన్‌కు అనుమతులు
త్వరలో అక్కడి నుంచే బుల్లెట్‌ రైలు ప్రయాణం
మూసీ, రేడియల్‌ రోడ్డు బాధితులకు అండగా ఉంటాం
శంషాబాద్‌లో ఏకోపార్క్‌ ప్రారంభించిన సీఎం
రేడియల్‌ రోడ్డు పనులకు శిలాఫలకం

నవతెలంగాణ-శంషాబాద్‌
మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే.. కొందరు గుంపులుగా అడ్డుకుంటున్నారని అన్నారు. రంగారెడ్డి జిల్లాను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండల పరిధిలోని హిమాయత్‌సాగర్‌ వద్ద 85 ఎకరాల విస్తీర్ణంలో రూ.75 కోట్లతో నిర్మించిన ఏకో పార్కు టూరిజం కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే బుద్వేల్‌ నుంచి నాచారం వరకు రూ.488 కోట్లతో 250 ఫీట్ల వెడల్పుతో నిర్మించనున్న నేషనల్‌ హైవే 167 రేడియల్‌ రోడ్డు-2 పనులనూ ప్రారంభించారు. అనంతరం రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి. ప్రకాష్‌ గౌడ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడారు. హైదరాబాద్‌ నగరానికి చారిత్రక నేపథ్యం ఉందని గుర్తు చేశారు. చార్మినార్‌, గోల్కొండ, మక్కా మసీద్‌, ఉస్మానియా ఆస్పత్రి, ఉస్మానియా కాలేజ్‌తోపాటు అనేక అద్భుత నిర్మాణాలు ఉన్నాయన్నారు. హిమాయత్‌ సాగర్‌ వద్ద నిర్మించిన ఏకో పార్కు అద్భుతమైనదని తెలిపారు.

వినోదం, ఆహ్లాదం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి రావాల్సిన అవసరం లేకుండా.. ఇక్కడే వివిధ ప్రాంతాల ప్రజలు వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించే విధంగా అద్భుతంగా తీర్చిదిద్దామని అన్నారు. పర్యాటక కేంద్రంగా హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించి సామాన్యులకు, అన్ని వర్గాలకూ అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాల పర్యావరణహితమైన సౌకర్యాలతో ఏర్పాటు చేశామని తెలిపారు. పెద్ద నిర్మాణమైనా దాని నిర్వహణ సరిగ్గా లేకపోతే.. త్వరలోనే పాడవుతుందని అన్నారు. నాటి నైజాం వరదల నివారణ కోసం నిర్మించిన గొప్ప చారిత్రాత్మకమైన మూసీ.. నేడు మురికి కుంపగా మారిందని తెలిపారు. గత పాలకులు దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆధ్వర్యంలో మూసీ నదిని సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక రూపొందించి, అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంటే.. బీఆర్‌ఎస్‌ నాయకులు గుంపులు గుంపులుగా అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 40ఏండ్ల పాటు వారి కుటుంబం అధికారంలో ఉండి ఈ ప్రాంతంలో ప్రజల అభివృద్ధిని అడ్డుకోవడం ఓ మాజీ మంత్రికే చెల్లిందని అన్నారు.

మూసీ, రేడియల్‌ రోడ్డు బాధితులను ఆదుకుంటాం
రంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా మూసీ రివర్‌ ఫ్రంట్‌లో కొంతమంది భూములు కోల్పోతున్నారని, ఆపార్ట్‌మెంట్లు, రేడియల్‌ రోడ్డు కింద భూములు కోల్పోతున్న వారికి అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాల మాదిరి వాళ్ళను రోడ్డుకు వదిలేసే పరిస్థితి లేదని, మెరుగైన నష్టపరిహారం ఇచ్చి భవిష్యత్తులో మరోచోట భూములు కొనుక్కునే విధంగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ సూచన మేరకు ఎక్కడైతే భూములు కోల్పోతారో అక్కడే అదే ప్రాంతంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తోందన్నారు. ఐదేండ్లలో రంగారెడ్డి జిల్లా రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయని స్పష్టం చేశారు. శంషాబాద్‌లో అతిపెద్ద రైల్వే స్టేషన్‌ నిర్మాణంతో ఇక్కడి నుండే బుల్లెట్‌ రైలు వెళ్తుందని, దానికి కావాల్సిన అనుమతులు వచ్చాయని తెలిపారు.

బహదూర్‌గూడలో మెట్రో స్టేషన్‌ ఏర్పాటు జరుగుతుందని, రేడియల్‌ రోడ్డుతో రంగారెడ్డి జిల్లా వివిధ ప్రాంతాలు పూర్తిగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. శంషాబాద్‌తోపాటు షాబాద్‌లోని చందనవెళ్లి పారిశ్రామికవాడ, సీతారాంపూర్‌ పరిశ్రమ, కావాలాచర్ల పారిశ్రామిక వాడను లింకు చేస్తూ రూ.488కోట్లతో 81 కిలో మీటర్ల రేడియల్‌ రోడ్డు నిర్మాణం చేపట్టామని అన్నారు. మూసీ రివర్‌ ప్రక్షాళనతో మురుగు ప్రక్షాళన జరగడమే కాకుండా.. 24 గంటల పాటు వ్యాపారాలు, ఉపాధి జరిగే విధంగా కార్యక్రమాన్ని రూపొందించి, ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఈ నెల 8 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం 99 రోజులపాటు జరుగుతుందని, ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీలు కొండ విశ్వేశ్వర్‌రెడ్డి, డాక్టర్‌ మల్లు రవి, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, చల్ల నర్సింహరెడ్డి, జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -