– సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
నవతెలంగాణ-సత్తుపల్లి
విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే మార్గదర్శకులని, విలువలతో కూడిన విద్యే అసలైన మార్గమని స్వామి బోధమయానంద మహారాజ్ అన్నారు. సత్తుపల్లిలోని మాధురి ఫంక్షన్ హాల్‌లో రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ వృత్తి నైపుణ్య శిక్షణ సదస్సు శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద మహారాజ్ పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులకు కేవలం మార్కులే ముఖ్యం కాదని, క్రమశిక్షణ, నైతిక, మానవీయ విలువలను పెంపొందించడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యతగా కృషి జరపాలన్నారు. ఆదర్శ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుని పాత్ర అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు పార్లమెంట్‌లో కాదని, తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
మైసూర్ రామకృష్ణ మిషన్ స్వామీజీ మహా మేధానంద, విజయవాడ ఉప కార్యదర్శి స్వామి శితి కంటానంద మహారాజ్ మాట్లాడుతూ..నిరంతర అభ్యాసం, వృత్తి నైపుణ్యాల పెంపు, ఉపాధ్యాయ వృత్తిని ఒక తపస్సులా భావించి, విద్యార్థులను సొంత బిడ్డల్లా ప్రేమించాలని సూచించారు. గురువును గౌరవించడం అంటే సమాజాన్ని గౌరవించడమే: సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి దయానంద్ కార్యక్రమంలో పాల్గొన్న సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ, గురువును గౌరవించడం అంటే సమాజాన్ని గౌరవించడమేనన్నారు. ఉపాధ్యాయులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ, సమయపాలన పాటిస్తూ, విద్యార్థుల విజయంలోనే తమ విజయాన్ని చూసుకోవాలని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ కోరారు.



